మునిగిన నౌక కెప్టెన్ అరెస్ట్
ప్రయాణికుల భద్రతలో నిర్లక్ష్యం వహించారని అభియోగాలు 36కు చేరిన ప్రమాద మృతులు
జిందో: పసుపు సముద్రంలో మునిగిపోయిన దక్షిణ కొరియా నౌక కెప్టెన్ లీ జూన్‌సెయోక్, ఆయన సిబ్బందిలోని ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ప్రయాణికులకు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని లీపై అభియోగాలు మోపారు. ప్రమాద సమయంలో ప్రయాణికులను 40 నిమిషాలు బయటకు రావొద్దని లీ ఆదేశించడం తెలిసిందే. ఆయన, అరెస్టయిన ఇద్దరు సహోద్యోగులు ప్రయాణికులను వారి మానాన వారిని వదిలేసి ప్రమాదం నుంచి తప్పించుకున్నారని విమర్శలు ఉన్నాయి. అయితే లీ ప్రయాణికుల తరలింపులో జాప్యాన్ని మరోమారు సమర్థించుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగానే అలా ఆదేశించానన్నారు. ‘అప్పటికింకా సహాయ నౌక రాలేదు.
సాయం చేయడానికి చుట్టుపక్కల చేపల పడవలు, ఇతర నౌకలు కూడా లేవు. అలలు బలంగా, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. ప్రయాణికులను అనాలోచితంగా తరలిస్తే వారు కొట్టుకుపోతారని అనుకున్నా’ అని చెప్పారు. కాగా, ఈ ప్రమాద మృతుల సంఖ్య శనివారానికి 36కి చేరుకుంది. ఓడలోకి వెళ్లిన ఈతగాళ్లు ఓ క్యాబిన్ కిటికీ గుండా చూడగా లోపల మూడు మృతదేహాలు కనిపించాయి. కిటికీని పగలగొట్టి వాటిని బయటకు తీసుకొచ్చారు. ఈ ఓడ నుంచి మృతదేహాలను వెలికితీయడం ఇదే తొలిసారి. 350 మంది విద్యార్థులు సహా 476 మందితో బుధవారం బెజూ ద్వీపానికి వెళ్తూ ప్రమాదానికి గురైన ఈ నౌక నుంచి 174మందిని సహాయక బృందాలు కాపాడ్డం, మిగతా వారి కోసం గాలిస్తుండడం తెలిసిందే.