Yerpedu Accident
-
ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే...నగలు ఎత్తుకెళ్లారు
ఏర్పేడు ఘటనలో మృతి చెందిన సుమతి తల్లి సరోజమ్మ ఆవేదన ఏర్పేడు(శ్రీకాళహస్తి): తన కూతురు తీవ్రంగా గాయపడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే.. ఎవరో ఆమె ఒంటి మీద ఉన్న నగలను అపహరించారని ఏర్పేడు ఘటనలో మృతిచెందిన సుమతి తల్లి సరోజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మునగలపాలెంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇసుక మాఫియా వల్ల భూగర్భ జలాలు ఇంకిపోతుండటంతో న్యాయం కోసం గ్రామంలోని రైతులంతా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక్కో వ్యక్తి తహసీల్దారు కార్యాలయంతో పాటు పోలీస్‌స్టేషన్‌కు రావాలని.. లేకుంటే రూ.500 అపరాధ రుసుం కట్టాలని తీర్మానించుకున్నట్లు వివరించారు. అయితే 21వ తేదీన తన అల్లుడు ఇంటి వద్ద లేకపోవడంతో సుమతి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిందని చెప్పారు. రైతులంతా పోలీస్‌స్టేషన్ వద్ద ఉండగా లారీ దూసుకురావడంతో సుమతి తీవ్రంగా గాయపడిందన్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఎవరో వ్యక్తి సుమతి మెడలోని 4 సవర్ల బంగారు చైను, తాళిబొట్టు, చెవులకున్న బంగారు కమ్మలను అపహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిధంగా అతినీచంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని సరోజమ్మ కోరారు. -
ఏర్పేడు ప్రమాదంపై న్యాయ విచారణ
సాక్షి, హైదరాబాద్ : ఏర్పేడు మండలం మునగాలపాలెం వద్ద జరిగిన లారీ ప్రమాద ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గసభ్యుడు డా.కె.నారాయణ టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీలో పెరిగిపోతున్న ఇసుక, మైనింగ్ ఆగడాలకు, ఏర్పేడు ఘటనకు సీఎం చంద్రబాబే కారణమని, అందువల్ల దీనిపై న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఐఏఎస్ అధికారితో విచారణ జరిపిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం లేదన్నారు. ఈ సంఘటనకు చంద్రబాబు, రూరల్ ఎస్పీ జయలక్ష్మీ నైతిక బాధ్యత వహించాలన్నారు. రూరల్ ఎస్పీ జయలక్ష్మీపై హత్యానేరం కేసును నమోదు చేయాలన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 25లక్షలు, గాయపడినవారికి రూ.10 లక్షల చొప్పున ఆర్థికసహాయాన్ని ప్రటకించాలని, ఈ కుటుంబాలకు విద్యా,వైద్య,ఉపాధి పరంగా ఆదుకోవాలని కోరారు. బుధవారం మగ్దూంభవన్‌లో పార్టీ నాయకులు చాడ వెంకటరెడ్డి , అజీజ్‌పాషాలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇసుక,మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందని, ఎటు చూసినా అధికారపార్టీ పచ్చచొక్కాలు మాఫియాగా మారి రైతులు, ప్రజలపై విరుచుకుపడుతున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే స్వర్ణముఖి నది నుంచి ఉచితంగా తీస్తున్న ఇసుకను సమీపంలోని అటవీప్రాంతం, గ్రామాలలో నిల్వ చేసి కర్ణాటక, తమిళనాడులలో విక్రయిస్తున్నారన్నారు. దీనిని వ్యతిరేకిస్తున్న రైతులు, కూలీలపై ఎస్సీ,ఎస్టీలతో కేసులు పెట్టిస్తున్నారని ఆయన చెప్పారు. తమ గ్రామంలో ఇసుక నిల్వ చేయడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారని నారాయణ తెలిపారు.ఒక పక్క భూగర్భజలాలను పెంచేందుకు చెక్‌డ్యాంలను ప్రభుత్వం నిర్మిస్తూనే మరోవైపు ఇసుకమాఫియా ద్వారా అక్రమంగా ఇసుకను విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఇసుక, మైనింగ్ మాఫియా ఆగడాలను వ్యతిరేకిస్తే వందల సంఖ్యలో రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లగా వారు లోనికి వెళ్లకుండా రోడ్డుపై నిలబెట్టగా లారీ భీబత్సంతో అమాయక రైతులు, మహిళలు, పిల్లలు మృత్యువాత పడ్డారన్నారు. చత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లను మావోయిస్ట్‌లు కాల్పిచంపడాన్ని నారాయణ ఖండించారు. తుపాకీ గొట్టం ద్వారా విప్లవం రాదన్న విషయాన్ని ఇప్పటికైనా మావోయిస్ట్‌లు గ్రహించి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. ప్రభుత్వం కూడా తుపాకీ ద్వారా రాజ్యహింసను ప్రోత్సహించడం సరైనది కాదన్నారు. ఉద్యమాలను అణచేస్తే అగ్నిగొళంగా బద్ధలవుతాయి సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల వల్ల ధర్నాచౌక్ పరిరక్షణకై జరుగుతున్న విశాల ఉద్యమం నాలుగు గోడల మధ్య జరపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని సీపీఐనేత నారాయణ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని చూస్తుంటే సీఎం కేసీఆర్ నిజాం నవాబుగా మారిపోయాడని అనిపిస్తోందని ఎద్దేవాచేశారు. తెలంగాణలో ప్రజాతంత్ర ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచేస్తే అవి ఒక్కసారిగా అగ్నిగోళం మాదిరిగా బద్ధలై విరుచుకుపడతాయని హెచ్చరించారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేసేందుకు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలన్నారు.ఓయూ శతాబ్దికి కేటాయించిన నిధులు చావుకు ఖర్చు చేసినట్లుగా ఉందని, ఈ వర్శిటీని బతికించి అభివృద్ధి చేసేందుకు కాదన్నారు. దేశంలోని విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. -
అతివేగం వల్లే ప్రమాదం
ఏర్పేడు ఘటనపై తిరుపతి ఎస్పీ స్పష్టీకరణ తిరుపతి క్రైం: చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఈ నెల 21న లారీ అతివేగంగా రావడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఆమె ఘటన వివరాలను మీడియాకు వెల్లడిం చారు. ఈ ఘటనలో లారీ దూసుకు పోవడం వల్ల 15 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మందికి పైగా గాయపడ్డారన్నారు. లారీలో ఇద్దరు డ్రైవర్లున్నారని, ఘటన జరిగిన వెంటనే ఒక డ్రైవర్ గురవయ్యను స్థానికులు పోలీసులకు అప్పగించారన్నారు. అతను మద్యం సేవించి ఉండడం వల్ల వైద్య పరీక్షలు చేయించి, భద్రతా కారణాల దృష్ట్యా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించామన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీ నడుపుతున్న డ్రైవర్ సుబ్రమణ్యం అలియాస్ మణి, లారీ యజమాని రమేష్‌లు మంగళవారం ఉదయం 7 గంటలకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అక్కరపాక గ్రామం ఇన్చార్జి వీఆర్వో ముందు హాజరై సంఘటన జరిగిన తీరును వివరించార న్నారు. వీఆర్వో ద్వారా సమాచారం అందుకున్న ఏర్పేడు పోలీసులు వారిద్దరినీ స్టేషన్లో డీఎస్పీ ముందు హాజరు పరిచారని చెప్పారు. వారిని విచారించగా లారీ యజమాని టి.రమేష్ వారికి లైసెన్స్ లేదని తెలిసినా చేర్చుకున్నాడని తేలిందన్నారు. -
ఏర్పేడు దుర్ఘటనపై చంద్రబాబు స్పందన
-
పోలీసుల అదుపులో..లారీ యజమాని, క్లీనర్
నాయుడుపేటటౌన్ (సూళ్లూరుపేట): చిత్తూరు జిల్లా ఏర్పేడులో 15 మంది మృతికి కారణమైన లారీ ప్రమాదం కేసులో నిందితులైన లారీ యజమాని తంబిశెట్టి రమేశ్‌తో పాటు పరారీలో ఉన్న క్లీనర్ సుబ్రమణ్యంను నాయుడుపేట పోలీసుల చొరవతో చిత్తూరు జిల్లా పోలీసులు శనివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. నాయుడుపేటలో నివాసముంటున్న రమేశ్ లారీకి దొరవారిసత్రం మండలం అక్కరపాకకు చెందిన గురవయ్య డ్రైవర్‌గా, అదే గ్రామానికి చెందిన సుబ్రమణ్యం క్లీనర్‌గా ఉన్నారు. ఈ నెల 21న ఏర్పేడు వద్ద జరిగిన ప్రమాదంలో లారీలో డ్రైవర్ గురవయ్యతో పాటు క్లీనర్ సుబ్రమణ్యం కూడా ఉన్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ప్రమాదం జరిగిన రోజే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ గురవయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురవయ్యకు లైట్ వెహికల్ లైసెన్సు మాత్రమే ఉండటంతో ఇందుకు బాధ్యుడిని చేస్తూ లారీ యజమానితో పాటు పరారీలో ఉన్న క్లీనర్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వీరిద్దరినీ శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. -
అది.. వారి తలరాత
ఏర్పేడు దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన సాక్షి, న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా ఏర్పేడులో లారీ ఢీకొని 15 మంది దుర్మరణం చెందడాన్ని సీఎం చంద్రబాబు బాధితుల తలరాత(డెస్టినీ)గా అభివర్ణించారు. నీతిఆయోగ్ మూడో గవర్నింగ్ కౌన్సిల్ భేటీకి హాజరైన సీఎం ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘ఏర్పేడులో జరిగిన సంఘటన బాధాకరం. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక్కోసారి దురదృష్టం వెంటాడినప్పుడు ఎట్లా ఉంటుందో ఇదొక ఉదాహరణ. ఒకవైపు బాధ, మరోవైపు డెస్టినీ. ఒక్కోసారి డెస్టినీ ఇలా చేస్తుంది. ఒక కారణం కోసం వెళ్లిన వారు ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తుల ఆందోళనకు కారకులైన ఇద్దరు వ్యక్తులు టీడీపీకి చెందిన వారు. ధనుంజయ నాయుడు, చిరంజీవి నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. వాళ్లను అరెస్టు చేయాలని ఆదేశించాం. వాళ్లు చేసిన పని వల్లే ఇదంతా జరిగింది. ఎమ్మార్వోను సస్పెండ్ చేస్తున్నాం.. ఫిర్యాదు చేసినప్పుడు జాగ్రత్త తీసుకుని ఉంటే ఇది జరిగేది కాదు’’ అని చంద్రబాబు చెప్పారు. బొక్కలో తోస్తే దారికొస్తారు ‘‘ఏర్పేడు స్టేషన్ ఎస్ఐకి గాయాలయ్యాయి. అతడిపైనా ఆరోపణలు ఉన్నాయి. ఈ దుర్ఘటనపై సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపిస్తున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఆర్టీఏ అధికారులు నిర్లక్ష్యం వల్ల లారీ ప్రమాదం జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా మనుషులను చంపే లైసెన్స్ ఉన్నట్టు వ్యవహరించారు. పదేళ్లు, ఇరవై ఏళ్లు బొక్కలో తోస్తే దారికొస్తారు. తాగి వాహనం నడిపితే లైసెన్స్ రద్దయ్యేలా కఠిన చర్యలు తీసుకుంటాం.’’ అని బాబు హెచ్చరించారు. సోషల్ మీడియాలో బాధ్యతగా ఉండాలి సోషల్ మీడియాలోని పోస్టింగ్‌లపై ఉక్కుపాదం మోపుతున్నారన్న మీడియా ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ... ‘‘నేరపూరితంగా, అదేపనిగా రెచ్చగొట్టే విధానంలో, అవమానకర రీతిలో ప్రవర్తించడం సరికాదు. బాధ్యతగా ఉండాలి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛఉండాలి. కానీ, సభ్యత లేకుండా ఇష్ట్రపకారం చేస్తే ఎలా? నాకు కూడా ఓ వెబ్సైట్ ఉంది. కానీ మేమెప్పుడు ఇలాంటివి ప్రమోట్ చేయలేదు’’ అని బాబు పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేయాలని నీతిఆయోగ్ భేటీలో తాను ప్రధానిని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక సాయానికి చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశాం. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలని కోరాం. ’ అని సీఎం పేర్కొన్నారు. ఒకేసారి ఎన్నికలపై వ్యతిరేకత రాలేదు ‘‘దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్న అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. దీనిపై వ్యతిరేకత రాలేదు. దాదాపు అంతా సానుకూలమే. మేమూ సిద్ధమే. దీనిపై రాజకీయ ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. ’ అని చంద్రబాబు వెల్లడించారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో సీఎం ఆదివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో భూసేకరణ చట్టం రూపకల్పనపై చర్చించినట్లు సమాచారం. -
మంత్రి లోకేశ్ కు చేదు అనుభవం
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, అమర్ నాథ్ రెడ్డి, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకు చిత్తూరు జిల్లా మునగలపాళెంలో చేదు అనుభవం ఎదురైంది. ఏర్పేడు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రులను స్థానికులు నిలదీశారు. అమరావతి, గుంటూరు తప్ప మిగతా ప్రాంతాల అభివృద్ధి పట్టదా అని ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలో రోడ్డు విస్తరణ జరిగి ఉంటే ప్రమాదం జరిగేది కాదన్నారు. ‘అమరావతిలో రోడ్డు వేయడం కాదు.. మా సంగతి పట్టించుకోండి’ అంటూ ధ్వజమెత్తారు. ఇసుక మాఫియాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. లోకేశ్ సమక్షంలోనే బొజ్జలపై బాధిత మహిళ విరుచుకుపడింది. ‘మీ వెనుకున్నవారే ఇదంతా చేశారు. బొజ్జల అనుచరుల వల్లే ఊరు వల్లకాడుగా మారింది. పది లక్షలిస్తా నా భర్తను తీసుకొస్తారా’ అంటూ నిలదీయడంతో సమాధానం చెప్పలేక అక్కడ నుంచి బొజ్జల వెనుదిరిగారు. కాగా ఏర్పేడు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరింది. స్విమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం మరొకరు మృతి చెందారు.