ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే...నగలు ఎత్తుకెళ్లారు
ఏర్పేడు ఘటనలో మృతి చెందిన సుమతి తల్లి సరోజమ్మ ఆవేదన
ఏర్పేడు(శ్రీకాళహస్తి): తన కూతురు తీవ్రంగా గాయపడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే.. ఎవరో ఆమె ఒంటి మీద ఉన్న నగలను అపహరించారని ఏర్పేడు ఘటనలో మృతిచెందిన సుమతి తల్లి సరోజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మునగలపాలెంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇసుక మాఫియా వల్ల భూగర్భ జలాలు ఇంకిపోతుండటంతో న్యాయం కోసం గ్రామంలోని రైతులంతా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.
గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక్కో వ్యక్తి తహసీల్దారు కార్యాలయంతో పాటు పోలీస్‌స్టేషన్‌కు రావాలని.. లేకుంటే రూ.500 అపరాధ రుసుం కట్టాలని తీర్మానించుకున్నట్లు వివరించారు. అయితే 21వ తేదీన తన అల్లుడు ఇంటి వద్ద లేకపోవడంతో సుమతి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిందని చెప్పారు. రైతులంతా పోలీస్‌స్టేషన్ వద్ద ఉండగా లారీ దూసుకురావడంతో సుమతి తీవ్రంగా గాయపడిందన్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఎవరో వ్యక్తి సుమతి మెడలోని 4 సవర్ల బంగారు చైను, తాళిబొట్టు, చెవులకున్న బంగారు కమ్మలను అపహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిధంగా అతినీచంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని సరోజమ్మ కోరారు.