అతివేగం వల్లే ప్రమాదం
ఏర్పేడు ఘటనపై తిరుపతి ఎస్పీ స్పష్టీకరణ
తిరుపతి క్రైం: చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఈ నెల 21న లారీ అతివేగంగా రావడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఆమె ఘటన వివరాలను మీడియాకు వెల్లడిం చారు. ఈ ఘటనలో లారీ దూసుకు పోవడం వల్ల 15 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మందికి పైగా గాయపడ్డారన్నారు. లారీలో ఇద్దరు డ్రైవర్లున్నారని, ఘటన జరిగిన వెంటనే ఒక డ్రైవర్ గురవయ్యను స్థానికులు పోలీసులకు అప్పగించారన్నారు. అతను మద్యం సేవించి ఉండడం వల్ల వైద్య పరీక్షలు చేయించి, భద్రతా కారణాల దృష్ట్యా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించామన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో లారీ నడుపుతున్న డ్రైవర్ సుబ్రమణ్యం అలియాస్ మణి, లారీ యజమాని రమేష్‌లు మంగళవారం ఉదయం 7 గంటలకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అక్కరపాక గ్రామం ఇన్‌చార్జి వీఆర్‌వో ముందు హాజరై సంఘటన జరిగిన తీరును వివరించార న్నారు. వీఆర్‌వో ద్వారా సమాచారం అందుకున్న ఏర్పేడు పోలీసులు వారిద్దరినీ స్టేషన్‌లో డీఎస్పీ ముందు హాజరు పరిచారని చెప్పారు. వారిని విచారించగా లారీ యజమాని టి.రమేష్ వారికి లైసెన్స్ లేదని తెలిసినా చేర్చుకున్నాడని తేలిందన్నారు.