కొనకనమిట్ల: అతివేగం, నిద్రమత్తు వెరసి కారు యజమాని ప్రాణం తీసింది. ఈ సంఘటన ఒంగోలు–గిద్దలూరు రహదారిలో కొనకనమిట్ల మండలం చినారికట్ల జంక్షన్ సమీపంలోని ఎర్రవాగు బ్రిడ్జి దగ్గర ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన వల్లభనేని వెంకటేశ్వరరావు (65) వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రామేశ్వరం గ్రామం దగ్గర కొంత పొలం కొన్నాడు. ఆ పొలంలో ఇటీవల ఒక ఇల్లు నిర్మించాడు. కాగా ఆ ఇంటికి రంగులు వేసేందుకు తన గ్రామానికి చెందిన పెయింటర్స్ ఇస్లావత్ రాజేంద్రప్రసాద్ నాయక్, కృష్ణమూర్తి, ప్రసాద్‌లను తీసుకొని మారుతీ సుజికి కారులో రామేశ్వరం వెళుతున్నాడు. కారును క్రాంతి కిరణ్ అనే డ్రైవర్ నడుపుతున్నాడు. వాహనం చినారికట్ల జంక్షన్ ఎస్‌ఆర్ పెట్రోలు బంక్ సమీపంలో ఎర్రవాగు దగ్గరకు వేగంగా వచ్చింది. ఇదే సమయంలో డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో అదుపు తప్పి ఎర్రవాగుపై నిర్మించిన బ్రిడ్జి డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది.
అతని పక్కసీటులో కూర్చుని ఉన్న కారు యజమాని వెంకటేశ్వరరావు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా కారు వెనుక సీట్లో కూర్చుని ఉన్న రాజేంద్రప్రసాద్ నాయక్, ప్రసాద్, కృష్ణమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. కారు ముందు భాగం దెబ్బతింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కొనకనమిట్ల ఏఎస్‌ఐ మనోహరరాజు, కానిస్టేబుల్ మోహన్‌లు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం వెంకటేశ్వరరావు మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు వెంకటేశ్వరరావుకు భార్య పిల్లలున్నారు. బతుకు దెరువు కోసం ఎక్కడో ఊరు కాని ఊర్లో పొలం కొని అక్కడ ఇల్లు కట్టించుకొన్న వెంకటేశ్వరరావు మృతి చెందటంతో బంధువులు భోరున రోదించారు. కూలి పనికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు ఆ తర్వాత ఒంగోలుకు వైద్యశాలకు తరలించడంతో బంధువులు వచ్చి పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment