four injuries
-
నిద్రమత్తు ప్రాణం తీసింది
కొనకనమిట్ల: అతివేగం, నిద్రమత్తు వెరసి కారు యజమాని ప్రాణం తీసింది. ఈ సంఘటన ఒంగోలు–గిద్దలూరు రహదారిలో కొనకనమిట్ల మండలం చినారికట్ల జంక్షన్ సమీపంలోని ఎర్రవాగు బ్రిడ్జి దగ్గర ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన వల్లభనేని వెంకటేశ్వరరావు (65) వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రామేశ్వరం గ్రామం దగ్గర కొంత పొలం కొన్నాడు. ఆ పొలంలో ఇటీవల ఒక ఇల్లు నిర్మించాడు. కాగా ఆ ఇంటికి రంగులు వేసేందుకు తన గ్రామానికి చెందిన పెయింటర్స్ ఇస్లావత్ రాజేంద్రప్రసాద్ నాయక్, కృష్ణమూర్తి, ప్రసాద్‌లను తీసుకొని మారుతీ సుజికి కారులో రామేశ్వరం వెళుతున్నాడు. కారును క్రాంతి కిరణ్ అనే డ్రైవర్ నడుపుతున్నాడు. వాహనం చినారికట్ల జంక్షన్ ఎస్ఆర్ పెట్రోలు బంక్ సమీపంలో ఎర్రవాగు దగ్గరకు వేగంగా వచ్చింది. ఇదే సమయంలో డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో అదుపు తప్పి ఎర్రవాగుపై నిర్మించిన బ్రిడ్జి డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. అతని పక్కసీటులో కూర్చుని ఉన్న కారు యజమాని వెంకటేశ్వరరావు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా కారు వెనుక సీట్లో కూర్చుని ఉన్న రాజేంద్రప్రసాద్ నాయక్, ప్రసాద్, కృష్ణమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. కారు ముందు భాగం దెబ్బతింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కొనకనమిట్ల ఏఎస్ఐ మనోహరరాజు, కానిస్టేబుల్ మోహన్‌లు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం వెంకటేశ్వరరావు మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు వెంకటేశ్వరరావుకు భార్య పిల్లలున్నారు. బతుకు దెరువు కోసం ఎక్కడో ఊరు కాని ఊర్లో పొలం కొని అక్కడ ఇల్లు కట్టించుకొన్న వెంకటేశ్వరరావు మృతి చెందటంతో బంధువులు భోరున రోదించారు. కూలి పనికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు ఆ తర్వాత ఒంగోలుకు వైద్యశాలకు తరలించడంతో బంధువులు వచ్చి పరామర్శించారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
రేగిడి: మండల పరిధిలోని సంకిలి చక్కెర కర్మాగారం ప్రధాన గేటు ఎదురుగా ఆదివారం పాలకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, వ్యాన్ ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఇన్చార్జి ఎస్సై ఎం.చంద్రమౌళి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రేగిడి మండలం పెదశిర్లాం గ్రామానికి చెందిన పెళ్లి వారు పాలకొండ మండలం ఓనె గ్రామానికి పిలుపులు నిమిత్తం ప్రైవేట్ వాహనంలో బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి పాలకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, వీరు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో పెదశిర్లాం గ్రామానికి చెందిన సీహెచ్ నీలవేణి, సీహెచ్ చిన్నమ్మడు, రెడ్డి సూరీడమ్మ, రెడ్డి జయలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 ద్వారా రాజాం సామాజిక ఆస్పత్రికి, అక్కడ నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పాలకొండ–విశాఖ ప్రధాన రహదారిలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పాలకొండ సీఐ సూరినాయుడు, ఇన్చార్జి ఎస్సై మీసాల చంద్రమౌళి, రేగిడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కేసు నమోదు చేశారు. -
వోల్వో బస్సు బోల్తా... నలుగురికి గాయాలు
అనంతపురం: అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో 18 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నారు. ఈ బస్సు బెంగళూరు నుంచి అనంతపురం పట్టణానికి వెళుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను వేరే బస్సులో పంపించే ఏర్పాటు చేశారు. -
బస్సు, ఆటో ఢీకొని నలుగురికి గాయాలు
పూండి, న్యూస్‌లైన్: పూండి-మంచినీళ్లపేట రహదారిలో రెయ్యిపాడుకు సమీపంలో గురువారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న సంఘటనలో నలుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇవీ... మంచినీళ్లపేట నుంచి వస్తున్న బస్సు, పూండి నుంచి స్తున్న ఆటో పరస్పరం ఢీకొన్నాయి. మలుపు వద్దకు వచ్చేసరికి రెండు వాహనాలు కొంతమేర నెమ్మదిగా వస్తుండడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. రెండు వాహనాల డ్రైవర్లు నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు బస్సులో సుమారు 70 మంది వరకు ప్రయాణిస్తుండగా, ఆటోలో ఏడుగురు ఉన్నారు. మలుపు వద్దకు రెండు వాహనాలు వచ్చే సరికి అదుపు చేసుకోలేక ఢీకొన్నట్లు ఆటోలో ఉన్న ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదంలో ఆటోలో ఉన్న బావనపాడుకు చెందిన కొమర కాములమ్మ, కొమర ఎర్రయ్య, పూడిజగన్నాథపురం గ్రామానికి చెందిన బి.ప్రవీణ్, లక్ష్మమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం పూండిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ప్రమాద సంఘటన తమ దృష్టికి వచ్చిందని, దర్యాప్తు చేస్తున్నామని వజ్రపొకొత్తూరు పోలీసులు చెప్పారు. బైక్ అదుపు తప్పి ఇద్దరికి... పలాస రూరల్: పలాస మండలం కంబిరిగాం జంక్షన్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్లాఖిమిడికి చెందిన పూర్ణచంద్ర పాణిగ్రాహి, దుర్గాప్రసాద్ పాణిగ్రాహి గాయాలపాలయ్యారు. క్షతగాత్రులు బరంపురం నుంచి పర్లాఖిమిడి వైపు వస్తుండగా కంబిరిగాం జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో గాయాలపాలయ్యారు. వెంటనే పలాస 108 వాహనంలో క్షతగాత్రులను పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు.