బస్సు, ఆటో ఢీకొని నలుగురికి గాయాలు
Published Fri, Nov 15 2013 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM
పూండి, న్యూస్‌లైన్: పూండి-మంచినీళ్లపేట రహదారిలో రెయ్యిపాడుకు సమీపంలో గురువారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న సంఘటనలో నలుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇవీ... మంచినీళ్లపేట నుంచి వస్తున్న బస్సు, పూండి నుంచి స్తున్న ఆటో పరస్పరం ఢీకొన్నాయి. మలుపు వద్దకు వచ్చేసరికి రెండు వాహనాలు కొంతమేర నెమ్మదిగా వస్తుండడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. రెండు వాహనాల డ్రైవర్లు నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ సంఘటన జరిగినప్పుడు బస్సులో సుమారు 70 మంది వరకు ప్రయాణిస్తుండగా, ఆటోలో ఏడుగురు ఉన్నారు. మలుపు వద్దకు రెండు వాహనాలు వచ్చే సరికి అదుపు చేసుకోలేక ఢీకొన్నట్లు ఆటోలో ఉన్న ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదంలో ఆటోలో ఉన్న బావనపాడుకు చెందిన కొమర కాములమ్మ, కొమర ఎర్రయ్య, పూడిజగన్నాథపురం గ్రామానికి చెందిన బి.ప్రవీణ్, లక్ష్మమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం పూండిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ప్రమాద సంఘటన తమ దృష్టికి వచ్చిందని, దర్యాప్తు చేస్తున్నామని వజ్రపొకొత్తూరు పోలీసులు చెప్పారు.
బైక్ అదుపు తప్పి ఇద్దరికి...
పలాస రూరల్: పలాస మండలం కంబిరిగాం జంక్షన్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్లాఖిమిడికి చెందిన పూర్ణచంద్ర పాణిగ్రాహి, దుర్గాప్రసాద్ పాణిగ్రాహి గాయాలపాలయ్యారు. క్షతగాత్రులు బరంపురం నుంచి పర్లాఖిమిడి వైపు వస్తుండగా కంబిరిగాం జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో గాయాలపాలయ్యారు. వెంటనే పలాస 108 వాహనంలో క్షతగాత్రులను పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement