ఆటోలో స్థలం లేక నిలబడి వెళ్తున్న విద్యార్థి
ఆసిఫాబాద్‌రూరల్ : పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజు ప్రమాదపుటంచున ప్రయాణిస్తున్నారు. ఏ రోజు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియకుండానే ప్రైవేటు వాహనాలు ఆటోల్లో పాఠశాలలకు వెళ్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మంది విద్యార్థులను ఆటోల్లో తీసుకెళ్తున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో విచ్చలవిడిగా ప్రైవేటు వహనదారులు రెచ్చిపోతున్నారు. భద్రత చర్యలను పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
లాభాపేక్షే ధ్యేయంగా..
లాభాల కోసం తప్పా విద్యార్థుల జీవితం గురించి అలోచించడం లేదు ప్రైవేటు వాహనదారులు. డబ్బుల కోసం ఒక్కో ఆటోలో సుమారు 10 నుంచి 13 మంది విద్యార్థులను కూర్చోబెట్టుకుని వెళ్తున్నారు. ఇతర వాహనాల్లో కూడ రెట్టింపు మందిని కూర్చోబెడుతున్నారు. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిరోజు ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తోందని విద్యార్థులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నామమాత్రంగానే తనిఖీలు
ప్రతిరోజు తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు నెలలో కనీసం రెండు సార్లైనా తనిఖీలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇష్టానుసారం ప్రైవేటు వాహనాల్లో విద్యార్థులను తీసుకెళ్తున్నారని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆ ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు తనిఖీలు చేపట్టక పోవడం వల్లనే ప్రైవేలు వాహనదారులు విచ్చలవిడిగా ప్రయాణికులకు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి, విద్యార్థుల తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బస్సులు లేక పోవడంతోనే తప్పని పరిస్థితుల్లో ఆటోలు ఇతర వాహనాల్లో విద్యార్థులను పాఠశాలలకు పంపుతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
జిల్లా కేంద్రానికి నిత్యం వేల మంది రాకపోకలు..
జిల్లాకు ప్రతినిత్యం ఏదో ఒక పని మీద రోజూ వందల మంది ప్రజలు, విద్యార్థులు జిల్లా కేంద్రానికి ఆటోల్లో వస్తున్నారు. మండలంలోని ఇటిక్యాల, బెల్గాం, ఖప్రి, వావుదాం, మోవాడ, వెంకటాపూర్, బాబాపూర్, అక్సాపూర్, మేటిగూడ, గుండిగూడ,» లంపూర్, అలీగూడ నుంచి విద్యార్థులే సూమారు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు వస్తుంటారు. బస్సు సౌకర్యం లేక పోవడంతోనే ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నామని ప్రయాణాకులు, విద్యార్థులు తెలుపుతున్నారు.
బస్సు నడపాలి
బస్సు సౌకర్యం లేనందున ఆటో వాలాలు ప్రయాణికులను ఇష్టారాజ్యంగా ఎక్కస్తున్నారు. చార్జీలు వసూలు చేస్తున్నారు. బస్సు ఉంటే నెలకు రూ.150 ఖర్చవుతాయి. కానీ ఆటో రాడానికి నెలకు రూ.600 ఖర్చవుతున్నాయి.
– రాజేశ్వర్, ఇంటర్ విద్యార్థి, బెల్గాం
ఇబ్బందిగా ఉంది
బస్సు సౌకర్యం లేనందున ఆటో వాలాలు 12 నుంచి 15 మందిని కుర్చొబెట్టి తీసుకెళ్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం గుప్పెట్లో పెట్టుకుని తప్పని పరిస్థితుల్లో ఆటోల్లో వస్తున్నాం.
– సాయినాథ్, విద్యార్థి, ఇటిక్యాల
బస్సు రాక ఆరు నెలలు
గతంలో ఐదు నెలలు బస్సు సౌకర్యం కల్పించారు. ఇప్పుడు ఆరు నెలల నుంచి బస్సు రావడం లేదు. చాలా ఇబ్బందిగా మారింది. అధికారులు స్పందించి మళ్లీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం.
– భీమయ్య, బెల్గాం
Comments
Please login to add a commentAdd a comment