హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తయారీ రంగంలో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి బజాజ్ ఆటో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రముఖ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని కంపెనీ మంగళవారం తెలిపింది.
ఈ శిక్షణ కేంద్రాలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు, డిప్లమాలతో కూడిన అధునాతన నైపుణ్య శిక్షణను ఇస్తాయని వివరించింది. మెకాట్రానిక్స్, మోషన్ కంట్రోల్, సెన్సార్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఆటోమేషన్, ఇండస్ట్రీ 4.0, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి క్లిష్ట మాడ్యూల్స్‌పై శిక్షణ ఉంటుంది. తయారీ పరిశ్రమలో నైపుణ్యం అంతరాన్ని పరిష్కరించడంలో ట్రైనింగ్ సెంటర్లు సహాయం చేస్తాయని కంపెనీ తెలిపింది.
ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన అవసరమైన పరికరాలను ఈ శిక్షణా కేంద్రాలకు బజాజ్ ఆటో అందిస్తుంది. కార్యక్రమ ప్రారంభ దశలో నిర్వహణ ఖర్చులకు నిధులు కూడా సమకూరుస్తుంది. ‘భారత్‌లో ఏటా 1.2 కోట్ల మంది ఉద్యోగులుగా చేరుతున్నారు. సాంకేతికతలో వేగవంతమైన మార్పులతో యువతను ఉద్యోగానికి సిద్ధంగా ఉంచడంలో విద్య, పరిశ్రమల మధ్య భారీ అంతరం ఉంది. సమాజానికి తిరిగి ఇచ్చే వారసత్వంతో ఈ అంతరాన్ని పూడ్చేందుకు కట్టుబడి సీఎస్‌ఆర్ ప్రాజెక్ట్‌ను ప్రకటించినందుకు గర్విస్తున్నాము’ అని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఈ సందర్భంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment