
మంత్రి లోకేశ్ కు చేదు అనుభవం
మంత్రులు నారా లోకేశ్, అమర్ నాథ్ రెడ్డి, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకు చిత్తూరు జిల్లా మునగలపాళెంలో చేదు అనుభవం ఎదురైంది.
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, అమర్ నాథ్ రెడ్డి, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకు చిత్తూరు జిల్లా మునగలపాళెంలో చేదు అనుభవం ఎదురైంది. ఏర్పేడు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రులను స్థానికులు నిలదీశారు. అమరావతి, గుంటూరు తప్ప మిగతా ప్రాంతాల అభివృద్ధి పట్టదా అని ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలో రోడ్డు విస్తరణ జరిగి ఉంటే ప్రమాదం జరిగేది కాదన్నారు. ‘అమరావతిలో రోడ్డు వేయడం కాదు.. మా సంగతి పట్టించుకోండి’ అంటూ ధ్వజమెత్తారు. ఇసుక మాఫియాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. లోకేశ్ సమక్షంలోనే బొజ్జలపై బాధిత మహిళ విరుచుకుపడింది.
‘మీ వెనుకున్నవారే ఇదంతా చేశారు. బొజ్జల అనుచరుల వల్లే ఊరు వల్లకాడుగా మారింది. పది లక్షలిస్తా నా భర్తను తీసుకొస్తారా’ అంటూ నిలదీయడంతో సమాధానం చెప్పలేక అక్కడ నుంచి బొజ్జల వెనుదిరిగారు. కాగా ఏర్పేడు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరింది. స్విమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం మరొకరు మృతి చెందారు.