యాగం.. వైభోగం!
సాక్షి, జగదేవ్పూర్ (గజ్వేల్): రాష్ట్రం సుభిక్షంగా ఉం డాలని కాంక్షిస్తూ.. సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న మహా రుద్ర సహిత సహస్రచండీ మహాయాగం నాలుగో రోజు విజయవంతంగా పూర్తయింది. గురువారం ఉదయం యాగశాలకు సతీసమేతంగా వచ్చిన సీఎం కేసీఆర్.. మొదట రాజశ్యామల మాత మంటపంలో పూజలు నిర్వహించారు. శ్రీమహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతీ, స్వరూపిణిగా శ్రీ రాజశ్యామలాదేవికి పుష్పాంజలి ఘటించారు. సర్వమంగళ మాంగల్యే.. శ్రీ రాజశ్యామలా దైవేయ నమస్తే.. అంటూ రుత్వికులు వేదోక్తంగా ప్రార్థనలు చేశారు. రాజశ్యామల మంటపంలో సీఎం దంపతులకు వేద పండితు లు ఆశీర్వచనం చేశారు. శుక్రవారం పూర్ణాహుతితో ఈ యాగం పరిసమాప్తం కానుంది. ఈ కార్యక్రమం లో పాల్గొనేందుకు విశాఖ శారదా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి శుక్రవారం ఉదయం ఎర్రవల్లికి చేరుకోనున్నారు.
మహారుద్ర మంటపంలో పూజలు
గురువారం నాడు మహారుద్ర మంటపంలో జరిగిన పూజల్లో సీఎం దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుత్వికులు మహారుద్ర సహిత ఏకాదశ రుద్ర పఠనం, నమకం, చమకం పఠించారు. పంచాక్షరి జపంలో భాగంగా శివశివ శంకర భూత పతే, శంకర శివ, శంభో మహాదేవ, హరహర మహాదేవ మంత్రాలతో యాగశాలలు మార్మోగాయి. బ్రహ్మ స్వరూపిణి బగళాముఖి మంటపంలో సీఎం కేసీఆర్ దంపతుల సమక్షంలో వేద పండితులు, రుత్వికులు పూజలు చేశారు. శతమానం భవతే అంటూ పండితులు సీఎం దంపతులను ఆశీర్వదించారు. నవగ్రహ మంటపంలో ఆదిత్య హృదయంతోపాటు సూర్యాది నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీమాత ప్రధాన యాగశాలలో రాజరాజేశ్వరీదేవి ప్రార్థన చేశారు. గురువారం రుత్వికులు 400 సార్లు చండీ సప్తశతి పారాయణ చేశారు. వేద పండితులు యాగం వీక్షించడానికి వచ్చిన భక్తులకు సుభాషితాలు వినిపించారు. యాగ విశిష్టతను వివరించారు. మహాహారతితో గురువారం నాటి పూజా కార్యక్రమాలు ముగిసాయి.
నాలుగో రోజు యాగంలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన వివిధ రకాల పూజా కార్యక్రమాల్లో పాల్గొని చండీమాత అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం పూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్రంలోని ఎంపీ, ఎమ్మెల్యేలు అందరితోపాటు పలువులు ప్రముఖులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం పూజాకార్యక్రమాలతో యాగం ముగియనుంది.