డీర్ పార్కుకు 42 ఏళ్లు
పాల్వంచ రూరల్: కిన్నెరసాని ప్రాజెక్టు వద్దనుఏర్పాటు చేసిన డీర్ పార్కుకు గురువారంతో 42 ఏళ్లు నిండాయి. సింగరేణి కాలరీస్ సంస్థ ఏర్పాటు చేసిన దీనిని 1974 సెప్టెంబర్ 29న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించి, పర్యాటకులకు అంకితం చేశారు. నాటి నుంచి 2000 సంవత్సరం వరకు ఈ డీర్ పార్కును సింగరేణి నిర్వహించింది. 2000లో దీనిని వన్య మృగాల సంరక్షణ విభాగానికి సింగరేణి అధికారులు అప్పగించారు. 14.50 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పార్కులో చుక్కల దుప్పులు (జింకలు) ఉన్నాయి. నాడు కేవలం 30 దుప్పులు మాత్రమే ఉండేవి. ఈ సంఖ్య ఇప్పుడు 130కి చేరింది. వీటి సంరక్షణ కోసం వైల్డ్‌లైఫ్ శాఖ ఇనుప కంచె ఏర్పాటు చేసింది. వీటికి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దాణాతోపాటు పౌష్టికాహారాన్ని నిర్వాహకులు అందిస్తున్నారు. డీర్ పార్కు సముదాయంలో వాచ్ టవర్, జింకలకు నీడ కోసం రెండు షెడ్లు నిర్మించారు. కిన్నెరసానికి వస్తున్న పర్యాటకులు ఇక్కడి డీర్ పార్కులోని చుక్కల దుప్పులను చూడకుండా వెళ్లరు. మనుషులు కనిపిస్తే దుప్పులు సహజంగానే దూరంగా పరుగెత్తుతాయి. ఇక్కడి దుప్పులు మాత్రం కంచె వద్దకు వచ్చి, పర్యాటకులు పెట్టే పండ్లను చక్కగా ఆరగిస్తాయి. వారిని అలరిస్తాయి.
------------------------------------------
ఏడాదికి రూ.ఐదు లక్షల వ్యయం
ఎ.వెంకటేశ్వరరావు, వైల్డ్ లైఫ్ డీఎఫ్ఓ
‘‘దుప్పుల సంరక్షణ కోసం వైల్డ్ లైఫ్ శాఖ అనేక చర్యలు చేపట్టింది. అరుదైన దుప్పులు ఈ జిల్లాలో మాత్రమే ఉన్నాయి. ఒక్కో దుప్పికి రోజుకు కేజీ చొప్పున పౌష్టికాహారం అందిస్తున్నాం. అన్ని జింకలకు కలిపి ఏడాదికి ఐదులక్షల రూపాయలకు పైగా ఖర్చవుతోంది. పర్యాటకాభివృద్ధిలో భాగంగా డీర్ పార్కును మరింత సుందరంగా, కనువిందుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’’.