జననమరణ ధ్రువీకరణ పత్రాల తొలి ప్రతి ఉచితం
న్యూఢిల్లీ: తన పరిధిలో నివసించే పౌరులకు తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ) తొలి ప్రతిని ఉచితంగా అందజేయనుంది. ఈ ప్రతి నేరుగా లబ్ధిదారుల ఆవాసాలకు రానుంది. ఈ పథకాన్ని శుక్రవారం ఈడీఎంసీ ఘనంగా ప్రారంభించింది. ఈడీఎంసీ పరిధిలోని ఆస్పత్రిలో జరిగే జనన, మరణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సంబంధిత పౌరుడికి దీనిని పోస్టుద్వారా పంపుతామని ఈడీఎంసీ ప్రజాసంబంధాల అధికారి యోగేంద్రసింగ్ మాన్ తెలిపారు. పత్పర్గంజ్లోని ఈడీఎంసీ కార్యాలయం వద్ద ఈ పథకాన్ని మేయర్ మీనాక్షి శుక్రవారం ప్రారంభించారు.
ఇందుకోసం పౌరులు ఈడీఎంసీ పరిధిలోని వివిధ జోన్లలోగల సిటిజన్ సర్వీస్ బ్యూరో (సీఎస్బీ)లో లాంఛనాలను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందువల్ల సీఎస్బీలకు కొంతమేర పనిభారం తగ్గుతుంది. ఈ విషయమై ఈడీఎంసీ స్థాయీసమితి అధ్యక్షుడు బీబీ త్యాగి తాము పెట్టిన నూతన విధానం వల్ల తమ కార్పొరేషన్‌పై పౌరులకు విశ్వాసం మరింత పెరుగుతుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ పథకం అమలు వల్ల తమ కార్పొరేషన్‌పై ఏడాదికి అదనంగా రూ. 37,20,000 మేర భారంపడుతుందన్నారు. ఇదే విషయమై ప్రతిపక్ష నాయకుడు రాంనారాయణ్దూబే మాట్లాడుతూ ఈడీఎంసీ పరిధిలో మొత్తం 120 సంస్థలు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాయన్నారు.