పండగకు వస్తూ.. పరలోకాలకు..
వట్టిమర్తి(చిట్యాల)
రంజాన్ పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని బయలుదేరిన ఓ యువకుడు మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాలకు చెందిన అజీజ్(30) గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోని కంట్రి క్లబ్లో పనిచేస్తున్నాడు. రంజాన్ పండగ సందర్భంగా అత్తగారింటికి వెళ్లేందుకు అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి తనను తీసుకువెళ్లేందుకు వచ్చిన కుటుంబసభ్యులతో తానే కారు నడుపుతూ నార్కట్‌పల్లికి బయలుదేరాడు. వట్టిమర్తి శివారులోని ఒరిస్సా దాబా వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అజీజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారులోని ఇతర కుటుంబసభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా మృతుడికి రెండు నెలల క్రితమే వివాహమయ్యింది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.