చిన్న పనినైనా శ్రద్ధాసక్తులతో చేయాలి
భారతీయ ఆధ్యాత్మిక చేతన స్వామి వివేకానంద. తన గురువు శ్రీ రామకృష్ణ పరమహంస ప్రేరణతో ఆయన ప్రపంచమంతటా పర్యటించారు. యువశక్తిని ప్రేరేపించే విధంగా ఎంతో ఉత్తేజపూరితమైన ప్రసంగాలు, ప్రబోధాలు చేశారు. కొన్నితరాలకు సరిపోయేటటువంటి ఆధ్యాత్మిక జ్ఞానామృతాన్ని పంచారు. స్ఫూర్తిదాయకమైన ఆయన మాటలు మంచి ముత్యపు మాలికలు!ఆ మాలికలనుంచి రాలిన కొన్ని మేలిముత్యాలివి.
శ్రద్ధ, ధీరత్వం కలిగి ఉండి ఆత్మజ్ఞానాన్ని పొందండి. అలా జ్ఞానం పొందిన మీ జీవితాన్ని ఇతరుల మేలుకై త్యాగం చేయండి. ఇదే నా ఆకాంక్ష, ఆశీర్వాదం. మనసు ఎంత నిర్మలమైతే దాన్ని నిగ్రహించడం అంత సులభమౌతుంది. మనసును నిగ్రహించాలనుకుంటే, చిత్తశుద్ధికి తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి.
చేపట్టిన కర్తవ్యం మధురంగా తోచటం చాలా అరుదు. చేదుగా తోచే పనిని చెయ్యాలంటే దాని మీద గొప్ప ప్రేమను పెంపొందించుకోవాలి. ప్రేమను దాని చక్రాలకు కందెనగా పూసినప్పుడు మాత్రమే ఈ కర్తవ్యమనే యంత్రం సాఫీగా నడుస్తుంది.
జీవించినా, మరణించినా మీ బలం మీదనే ఆధారపడండి. ప్రంచంలో పాపమనేది ఉంటే అది బలహీనతే కానీ మరొకటి కాదు. అన్ని రకాల బలహీనతల్ని విడనాడండి.
మానవ చరిత్రను పరికిస్తే, ఉన్నతులైన స్త్రీ, పురుషుల జీవితాల్లో అన్నింటికంటే ఎక్కువగా సామర్ధ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే. వాళ్లు ఉన్నతులు కాగలరనే విశ్వాసంతో జన్మించారు, ఉన్నతులై నిలిచారు.
నిరాశలో మునిగిపోవడం ఏమైనా కావచ్చు కానీ ఆధ్యాత్మికత మాత్రం కాదు. ఎల్లప్పుడూ సంతోషంగా, నవ్వుతూ ఉండటం అన్ని ప్రార్థనల కన్నా మనల్ని భగవంతునికి చేరువ చేస్తుంది.
సౌశీల్యం, జ్వాజ్వల్యమానమైన ప్రేమ, నిస్వార్థాలే జీవితంగా గల కొంతమంది వ్యక్తుల అవసరం ఈ ప్రపంచానికి ఉంది. కాబట్టి నీలో ఆ గుణాలను పెంచుకోవడానికి ప్రయత్నించు.
మనిషికి, మనిషికి మధ్య గల భేదం, విశ్వాసంలో ఉన్న భేదమే తప్ప వేరేమీ కాదు. ఒక వ్యక్తిని ఉన్నతుణ్ణి గాను, మరొకర్ని దుర్బలునిగాను, అధమునిగాను చేసేది ఈ విశ్వాసమే.
అసూయను, తలబిరుసునూ విడనాడండి. పరహితం కోసం సమష్టిగా కృషి చేయడం అలవరచుకోండి. మనదేశపు తక్షణ అవసరం ఇది.
పరిపూర్ణ అంకితభావం, అతిసునిశితమైన బుద్ధి, సర్వాన్ని జయించగల సంకల్పం, వీటిని కలిగిన కొద్దిమంది వ్యక్తులు పని చేసినా మొత్తం ప్రపంచంలో పెనుమార్పు సంభవిస్తుంది.
ప్రపంచానికి కావలసింది సౌశీల్యం, ఎవరి జీవితం ఉజ్వల ప్రేమయుతమై, నిస్వార్థమై ఉంటుందో అలాంటి వారే లోకానికి కావాలి.
పరిస్థితులను ఎదుర్కొని పోరాడి ముందుకు సాగినప్పుడే... పురోగమించడానికి మళ్లీ మళ్లీ ప్రయత్నం చేసినప్పుడే మనలోని సంకల్ప శక్తి బయటకు వస్తుంది.
చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా వెనక్కు చూడకుండా పురోగమించాలి. అందుకు మనకు కావలసినవి శక్తి, పట్టుదల, ధైర్యం, సహనం. అప్పుడే మహాకార్యాలను సైతం సులువుగా సాధించగలుగుతాం.
సింహసదృశులైనటువంటి కొద్దిమంది ప్రపంచాన్ని జయిస్తారు కానీ లక్షలకొద్దీ గొర్రెల మందలు కాదు.
మీ మనసులో, మాటలలో గొప్ప శక్తిని ఉంచుకోవాలి. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం అంటే నీలోని భగవంతుని తక్కువ చేయడమే! భగవంతుని వైపు వెళ్లేలా చేసే ఏ కార్యమైనా సత్కార్యమే. అదే మన ధర్మం. మనల్ని అధోగతి చేరేలా చేసే ఏ కార్యమైనా దుష్కార్యమే. అది మన ధర్మం కాదు.
నీవు శ్రద్ధాభావంతో ఏం చేసినా నీకది మేలే. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మహాద్భుత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతివ్యక్తి తాను చేయగల ఎంత చిన్నపనైనా శ్రద్ధతో నిర్వహించాలి. సంకల్పశక్తిని సరైన రీతిలో, నైపుణ్యంగా ఉపయోగించేలా వ్యక్తులకు ఇచ్చే శిక్షణే విద్య.
మన దేశానికి కావలసింది ఇనుప కండరాలు, ఉక్కునరాలు. ఇంకా ఎవ్వరూ నిరోధించలేనిదీ, జగత్తులోని రహస్యాలను ఛేదించగలిగేది అయిన వజ్రసంకల్పం. వీటితోబాటు మహాసముద్రంలో అట్టడుగునకు మునగవలసి వచ్చినా, లక్ష్యాన్ని ఏ విధంగానెనా సాధించగలిగే దృఢసంకల్పం మనకు అవసరం.
- ధ్యానమాలిక