Young FICCI Ladies Organisation
-
Ridhi Khosla Jalan: మన జీవితానికి మనమే డిజైనర్లం..
సొంతంగా ఇంటి అలంకరణ లో ఎదుర్కొన్న ఇబ్బందులు పిల్లల కోసం కొత్తగా ఏదైనా సృష్టించాలనే ఆలోచన రిధి ఖోస్లా జలాన్ని ఈ రోజు ఉన్నతంగా నిలబెట్టింది. హోమ్ డెకార్‌లో డిజైన్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరొందిన రిధి పిల్లల కోసం లిటిల్ నెస్ట్ పేరుతో ఏర్పాటు చేసిన డిజైన్ స్టోర్‌తో మార్కెట్లో ఆమెను వ్యాపారవేత్తగా మార్చింది. ముంబై నుంచి ఇటీవల హైదరాబాద్‌లోని ఫిక్కీ వైఎఫ్‌ఎల్‌ఓ ఏర్పాటు చేసిన సెషన్లో పాల్గొన్న ఈ యంగ్ ఎంట్రప్రెన్యూర్ తన జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకుందో వివరించింది. ‘మనలో ఉన్న అభిరుచి ఏంటో తెలుసుకుని, దానిని అమలులో పెడితే విజయం మన వెన్నంటే ఉంటుంది’ అంటుందామె. స్ఫూర్తివంతమైన ఆమె మాటలు... సాధారణ గృహిణిగా ఉన్న రిధి తన జీవితాన్ని ఈ రోజు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎలాంటి మలుపులు తిప్పిందో వివరించింది. ఇంటీరియర్ డిజైనర్ నుండి కిడ్స్ ఫర్నీచర్ స్టోర్ యజమాని వరకు రిధి పేరొందింది. ‘‘ఫైనాన్స్, మార్కెటింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశాక పెళ్లవడంతో ముంబై వెళ్లిపోయాను. మొదటి బిడ్డ పుట్టాక నాలో తన కోసం ప్రత్యేకమైన డిజైనింగ్ రూమ్ ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అంతేకాదు పిల్లల బట్టలు, వారికి కావల్సిన వస్తువుల విషయంలోనూ ఆలోచన పెరిగింది. అప్పుడే ఇంటీరియర్ డిజైన్‌కు సంబంధించిన కోర్సు చేయాలనుకున్నా. రెండవసారి ప్రెగ్నెంట్ అయిన టైమ్‌లోనే ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులో చేరాను. అలా ఆ అభిరుచే వృత్తిగా మారింది. నా లైఫ్‌లో ఇదొక స్పెషల్ జర్నీ అని చెప్పవచ్చు. పిల్లల గదులను డిజైన్ చేయడం అనే నా హాబీ నన్ను చాలామందికి చేరువ చేసింది. మొదట ఈ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించాను. ఫర్నీచర్, డెకార్ వస్తువుల కోసం ఎక్కడ షాపింగ్ చేయాలనే దానిపై స్నేహితులు తరచూ సలహాలు అడుగుతుండేవారు. వ్యక్తిగతంగానూ, నా స్నేహితులు పడుతున్న కష్టాన్ని గమనించినప్పుడు నా డిజైనింగ్‌లో ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుందో స్వయంగా తెలుసుకున్నాను. స్నేహితులకు సూచనలు ఇచ్చే క్రమంలో నాకూ చాలా విషయాల పట్ల అవగాహన పెరిగింది. కిడ్స్ డెకార్ బ్రాండ్‌ను ప్రారంభించడానికి ముందు మార్కెట్ పోకడలను గమనించాను. అప్పుడు ‘లిటిల్ నెస్ట్’ పేరుతో స్టోర్ ప్రారంభించాను. ఈ క్రియేటివ్ డిజైన్ నన్ను చాలా మందికి చేరువ చేసింది. ముందు కుటుంబమే నాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని, చేస్తున్న వర్క్ప్రోగ్రెస్ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటాను. ఒక ప్రశ్న– సమాధానంతో సోషల్ మీడియా వీడియోను ప్రారంభించాను. ఏడాది లోపు ఐదు లక్షలకు పైగా ఫాలోవర్లకు చేరువయ్యాను. ప్రజలు కోరుకునే సమాచారాన్ని అందించడంపై పెట్టే దృష్టి నన్ను ఇంతమందికి చేరువ చేసింది. అయితే, ఇల్లే నా మొదటి ప్రాధాన్యత. ఇంటిని మేనేజ్ చేయగలగితే చాలు, బయట అన్ని పనులను సులువుగా చక్కబెట్టవచ్చు. ఇందుకు నా పిల్లల సాయం కూడా ఉంటుంది. నా బిజీ వర్క్, ప్లానింగ్ చూస్తూ పెరుగుతున్న నా పిల్లలు కూడా వారి పనులు వారు చేసుకుంటారు. నా వర్క్ వల్ల సోషల్‌గా అందరితోనూ అంతగా కలిసే సమయం ఉండదు. మొదట్లో అన్నీ బ్యాలెన్స్ చేయగలిగాను. కానీ, డెకార్ వర్క్, కంటెంట్ క్రియేటివ్‌కు ఎక్కువ టైమ్ పడుతుంది. ఇదొక డైనమిక్ జర్నీ అవడంతో నా ముందున్న మార్పులను కూడా ఉత్సాహంగా చేసుకుంటూ వెళుతున్నాను. గ్లోబల్ డిజైన్ మ్యాప్‌లో మన దేశం నుంచి నేను ఉండాలన్నది నా కల. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతోమందికి చేరవయ్యాను. ఆఫ్‌లైన్‌లో వ్యక్తిగతంగా చాలా మందికి రీచ్ కావాలని కోరుకుంటున్నాను. రెండు వారాలకు ఒకసారి.. ఎంత పని ఉన్నా రెండు వారాలకు ఒకరోజు పూర్తి విశ్రాంతి తీసుకుంటాను. నా కోసం నేను అన్నట్టుగా ఉంటాను. ఆ రోజులో ఎక్కువ సమయం బుక్స్ చదవడానికి సమయాన్ని కేటాయిస్తాను. రోజువారీ పనితో ఏ మాత్రం సంబంధం లేని పనులను చేస్తాను. దీంతో మరింత ఉత్సాహంగా మారిపోతాను’’ అని తన విజయానికి వేసుకున్న బాటలను ఇలా మన ముందు ఉంచారు రిధి. అప్డేట్గా ఉంటాను.. ఇంటీరియర్ డిజైన్ స్టూడియో మెయింటెయిన్ చేయాలంటే ఎప్పుడూ అప్డేట్గా ఉండాలి. ప్రతిరోజూ నాలుగు పేజీల షెడ్యూల్‌ని వేసుకుంటాను. ఇల్లు, వర్క్‌స్పేస్, అప్డేట్స్, నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేవి ప్రోత్సాహాన్ని కలిగించే కోట్స్ నోట్ చేసుకుంటాను. దీని వల్ల ప్రతిదీ ఏ రోజు కా రోజు ప్లానింగ్‌గా జరిగిపోతుంటుంది. భవిష్యత్తు గురించి అంటే మరో ఐదేళ్లలో నా ప్రాజెక్ట్స్ గ్లోబల్ లెవల్‌కి వెళ్లాలి. ప్రపంచంలోని అత్యుత్తమ డిజైన్ ఇన్ ఫ్లుయెన్సర్లలో ఒకరిగా ఉండాలన్నదే నా లక్ష్యం. – నిర్మలారెడ్డి -
లేడీసే లీడర్స్
యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్.. యువ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, వారి సాధికారతకు కృషి చేస్తున్న సంస్థ. దశాబ్దానికి పైగా నగరంలో సేవలందిస్తున్న ఎఫ్ఎల్ఓ (ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్)కు అనుబంధంగా నడుస్తోందీ వైఎఫ్‌ఎల్‌ఓ. పర్సనాలిటీ డెవలప్మెంట్, అవేర్నెస్, ట్రైనింగ్, బిజినెస్ కన్సల్టెన్సీ, నెట్వర్కింగ్ తదితర అంశాల్లో ఎప్పటికప్పుడు యంగ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను అప్డేట్ చేస్తూ... వారి అభివృద్ధికి చేయూతనందిస్తోంది. దీనికి నూతన చైర్‌పర్సన్‌గా సామియా అలమ్‌ఖాన్ నియమితులయ్యారు. సిటీకి చెందిన ఈ యువ పారిశ్రామికవేత్త మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్. బ్యాంకింగ్ ప్రొఫెషనల్‌గా కెరీర్ ప్రారంభించి, ఐటీఈఎస్, కేపీఓ సెక్టార్స్‌లో ప్రభావవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం లీడింగ్ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్ ‘ఆరాయిష్’ పార్ట్నర్గా, ‘ది హైదరాబాద్ దక్కన్ సిగరెట్ ఫాక్యక్టరీ’ డెరైక్టర్‌గా సమర్థవంతమైన పాత్రలు పోషిస్తున్న సామియా... శకుంతల దివి నుంచి ‘వైఎఫ్‌ఎల్‌ఓ’ పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా... జీవితంలోని ప్రతి అంకంలో మహిళ నాయకురాలే అంటారామె. ‘మహిళ సాధికారత సాధించాలంటే విద్యాభివృద్ధి, ఆర్థిక కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించడం కీలకం. అన్ని స్థాయిల్లో విద్య, నైపుణ్యాల అభివృద్ధి ద్వారా దీన్ని సాకారం చేసుకోగలం. కాన్ఫిడెన్స్, ఎంపవర్మెంట్... కజిన్స్. దానికి మూలం, ప్రోత్సాహం ఆత్మవిశ్వా సమే. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఓ శక్తిగా ఎదుగుతోంది. మహిళలు నిర్ణయాత్మకంగా వ్యవహరించి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఆలోచనలు విస్తృతం చేసి, ప్రతి రంగంలోనూ ముందుకు దూసుకు పోయేలా ఎదగాలి. అది విద్య, మౌళిక వసతులు, పరిశ్రమలు, ఆర్థిక సేవలు, వ్యాపారాలు.. ఏవైనా కావచ్చు’ అంటూ ఎంతో ఉద్వేగంగా చెప్పుకొచ్చారు సామియా. వయసులో చిన్నే అయినా ఆమె ఆలోచనలు ఆకాశమంత. సీఈఓ నుంచి హౌస్‌వైఫ్ వరకు.. మహిళలు వంటింట్లో ఉన్నా.. వ్యాపార రంగంలో ఎదుగుతున్నా.. ఎక్కడున్నా నాయకురాళ్లే అనేది సామియా అలమ్‌ఖాన్ చెప్పే భాష్యం. అంతే కాదు... ‘ఏ గొప్ప కార్యం జరిగినా దానికి ఆరంభం మహిళలతోనే. విశ్వాసం, నాయకత్వ లక్షణాలున్న ఎంతో మంది స్త్రీల సామర్థ్యంతో ఈ భారతావని నిర్మితమైంది’ అంటూ స్ఫూర్తిదాయకంగా చెప్పుకొచ్చారు ఈ యువ పారిశ్రామికవేత్త. మహిళలు స్వతంత్రంగా ఎదిగి తోటి మహిళలకూ చేయూతనందించడం తప్పనిసరంటున్న సామియా ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగుతారు. ‘లెర్న్, ఇంప్లిమెంట్ అండ్ ఇన్స్పైర్’ అనే థీమ్‌తో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తానంటున్నారామె. సో... బెస్ట్ ఆఫ్ లక్ టు సామియా!