సొంతంగా ఇంటి అలంకరణ లో ఎదుర్కొన్న ఇబ్బందులు పిల్లల కోసం కొత్తగా ఏదైనా సృష్టించాలనే ఆలోచన రిధి ఖోస్లా జలాన్‌ని ఈ రోజు ఉన్నతంగా నిలబెట్టింది. హోమ్ డెకార్‌లో డిజైన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరొందిన రిధి పిల్లల కోసం లిటిల్ నెస్ట్ పేరుతో ఏర్పాటు చేసిన డిజైన్ స్టోర్‌తో మార్కెట్లో ఆమెను వ్యాపారవేత్తగా మార్చింది.
ముంబై నుంచి ఇటీవల హైదరాబాద్‌లోని ఫిక్కీ వైఎఫ్‌ఎల్‌ఓ ఏర్పాటు చేసిన సెషన్‌లో పాల్గొన్న ఈ యంగ్ ఎంట్రప్రెన్యూర్ తన జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకుందో వివరించింది. ‘మనలో ఉన్న అభిరుచి ఏంటో తెలుసుకుని, దానిని అమలులో పెడితే విజయం మన వెన్నంటే ఉంటుంది’ అంటుందామె. స్ఫూర్తివంతమైన ఆమె మాటలు...
సాధారణ గృహిణిగా ఉన్న రిధి తన జీవితాన్ని ఈ రోజు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎలాంటి మలుపులు తిప్పిందో వివరించింది. ఇంటీరియర్ డిజైనర్ నుండి కిడ్స్ ఫర్నీచర్ స్టోర్ యజమాని వరకు రిధి పేరొందింది.
‘‘ఫైనాన్స్, మార్కెటింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశాక పెళ్లవడంతో ముంబై వెళ్లిపోయాను. మొదటి బిడ్డ పుట్టాక నాలో తన కోసం ప్రత్యేకమైన డిజైనింగ్ రూమ్ ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అంతేకాదు పిల్లల బట్టలు, వారికి కావల్సిన వస్తువుల విషయంలోనూ ఆలోచన పెరిగింది. అప్పుడే ఇంటీరియర్ డిజైన్‌కు సంబంధించిన కోర్సు చేయాలనుకున్నా. రెండవసారి ప్రెగ్నెంట్ అయిన టైమ్‌లోనే ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులో చేరాను. అలా ఆ అభిరుచే వృత్తిగా మారింది. నా లైఫ్‌లో ఇదొక స్పెషల్ జర్నీ అని చెప్పవచ్చు.
పిల్లల గదులను డిజైన్ చేయడం అనే నా హాబీ నన్ను చాలామందికి చేరువ చేసింది. మొదట ఈ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించాను. ఫర్నీచర్, డెకార్ వస్తువుల కోసం ఎక్కడ షాపింగ్ చేయాలనే దానిపై స్నేహితులు తరచూ సలహాలు అడుగుతుండేవారు. వ్యక్తిగతంగానూ, నా స్నేహితులు పడుతున్న కష్టాన్ని గమనించినప్పుడు నా డిజైనింగ్‌లో ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుందో స్వయంగా తెలుసుకున్నాను. స్నేహితులకు సూచనలు ఇచ్చే క్రమంలో నాకూ చాలా విషయాల పట్ల అవగాహన పెరిగింది. కిడ్స్ డెకార్ బ్రాండ్‌ను ప్రారంభించడానికి ముందు మార్కెట్ పోకడలను గమనించాను. అప్పుడు ‘లిటిల్ నెస్ట్’ పేరుతో స్టోర్ ప్రారంభించాను. ఈ క్రియేటివ్ డిజైన్ నన్ను చాలా మందికి చేరువ చేసింది.
ముందు కుటుంబమే
నాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని, చేస్తున్న వర్క్‌ప్రోగ్రెస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటాను. ఒక ప్రశ్న– సమాధానంతో సోషల్ మీడియా వీడియోను ప్రారంభించాను. ఏడాది లోపు ఐదు లక్షలకు పైగా ఫాలోవర్లకు చేరువయ్యాను. ప్రజలు కోరుకునే సమాచారాన్ని అందించడంపై పెట్టే దృష్టి నన్ను ఇంతమందికి చేరువ చేసింది. అయితే, ఇల్లే నా మొదటి ప్రాధాన్యత. ఇంటిని మేనేజ్ చేయగలగితే చాలు, బయట అన్ని పనులను సులువుగా చక్కబెట్టవచ్చు. ఇందుకు నా పిల్లల సాయం కూడా ఉంటుంది.
నా బిజీ వర్క్, ప్లానింగ్ చూస్తూ పెరుగుతున్న నా పిల్లలు కూడా వారి పనులు వారు చేసుకుంటారు. నా వర్క్ వల్ల సోషల్‌గా అందరితోనూ అంతగా కలిసే సమయం ఉండదు. మొదట్లో అన్నీ బ్యాలెన్స్ చేయగలిగాను. కానీ, డెకార్ వర్క్, కంటెంట్ క్రియేటివ్‌కు ఎక్కువ టైమ్ పడుతుంది. ఇదొక డైనమిక్ జర్నీ అవడంతో నా ముందున్న మార్పులను కూడా ఉత్సాహంగా చేసుకుంటూ వెళుతున్నాను. గ్లోబల్ డిజైన్ మ్యాప్‌లో మన దేశం నుంచి నేను ఉండాలన్నది నా కల. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎంతోమందికి చేరవయ్యాను. ఆఫ్‌లైన్‌లో వ్యక్తిగతంగా చాలా మందికి రీచ్ కావాలని కోరుకుంటున్నాను.
రెండు వారాలకు ఒకసారి..
ఎంత పని ఉన్నా రెండు వారాలకు ఒకరోజు పూర్తి విశ్రాంతి తీసుకుంటాను. నా కోసం నేను అన్నట్టుగా ఉంటాను. ఆ రోజులో ఎక్కువ సమయం బుక్స్ చదవడానికి సమయాన్ని కేటాయిస్తాను. రోజువారీ పనితో ఏ మాత్రం సంబంధం లేని పనులను చేస్తాను. దీంతో మరింత ఉత్సాహంగా మారిపోతాను’’ అని తన విజయానికి వేసుకున్న బాటలను ఇలా మన ముందు ఉంచారు రిధి.
అప్‌డేట్‌గా ఉంటాను..
ఇంటీరియర్ డిజైన్ స్టూడియో మెయింటెయిన్ చేయాలంటే ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉండాలి. ప్రతిరోజూ నాలుగు పేజీల షెడ్యూల్‌ని వేసుకుంటాను. ఇల్లు, వర్క్‌స్పేస్, అప్‌డేట్స్, నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేవి ప్రోత్సాహాన్ని కలిగించే కోట్స్ నోట్ చేసుకుంటాను. దీని వల్ల ప్రతిదీ ఏ రోజు కా రోజు ప్లానింగ్‌గా జరిగిపోతుంటుంది. భవిష్యత్తు గురించి అంటే మరో ఐదేళ్లలో నా ప్రాజెక్ట్స్ గ్లోబల్ లెవల్‌కి వెళ్లాలి. ప్రపంచంలోని అత్యుత్తమ డిజైన్ ఇన్ ఫ్లుయెన్సర్‌లలో ఒకరిగా ఉండాలన్నదే నా లక్ష్యం.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment