బాబు వచ్చినా జాబు లేదు
‘కేంద్రం ఏమి ఇస్తే అది తీసుకోవాలి.. లేకుంటే అదీ ఉండదు..’ అంటూ సీఎం చంద్రబాబు తెలుగుజాతి గౌరవాన్ని దిగజార్చారు. విభజన వేళ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చరంటూ పోరాడి సాధించుకోవాల్సిన చోట.. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు నోరు పెగలక ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేస్తున్నారు. రచ్చ గెలవడం చేతకాక.. ఇక్కడికొచ్చి ‘ప్రత్యేక హోదా వల్ల ఏం ఒరుగుతుంది’ అంటూ హోదా కోసం పోరాడుతున్నవారిపై చిందులు తొక్కుతున్నారు. మరీ ఏం ఒరుగుతుందని 10 ఏళ్లు హోదా కావాలని విభజన, ఎన్నికల సమయంలో గొంతెత్తారు. ఏం వెలగబెడదామని ‘బాబు రాగానే జాబు అన్నారు.. లేదా ‘నిరుద్యోగ భతి రూ. 2 వేలు’ అని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో నిధులు లేవని అప్పుడు తెలీదా..? ఇప్పటికైనా కళ్లు తెరిచి, తెలుగు వాడి ఆత్మగౌరవం కేంద్రానికి తెలిసొచ్చేలా.. ప్రత్యేక హోదా ఉద్యమానికి అందరితో కలిసి నడవాలి. తుపాకి గుళ్లకు ఎదురొడ్డి రొమ్ము చూపిన ఆంధ్రకేసరి పౌరుషాన్ని కేంద్రానికి రుచిచూపి మన హోదా మనం సాధించుకోవాలి. అని జిల్లాలోని నిరుద్యోగ యువత, విద్యార్థి లోకం సమరభేరి మోగిస్తోంది. –ఏలూరు సిటీ
లెక్కల్లో ఇలా..
జిల్లా ఉపాధి కార్యాలయంలో తమకు ఏదైనా ఉపాధి కల్పించమంటూ 81,561 మంది నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. వీరిలో టెన్త్ అభ్యర్థులు 18,093 మంది, ఇంటర్ 19,226 మంది, డిగ్రీ 19,721, స్టెనో అర్హత కలిగిన వారు 273, టైపిస్ట్ అర్హత కలిగిన వారు 2,912, బీఎడ్ అభ్యర్థులు 2,906, సెకండరీ గ్రేడ్ టీచర్ ఎలిజుబులిటీ కలిగినవారు 1,302, ఇంజినీరింగ్ డిప్లొమా అభ్యర్థులు 1,322, ఐటీఐ 11,217 మంది, ఇతరులు 4,589 మంది ఉన్నారు. వీరితో పాటు బీటెక్ విద్యార్థులు 9 వేలమంది, ఎంబీఏ, ఎంసీఏ, ఎం ఫార్మసీ, ఎంటెక్, ఎంఎస్సీ ఇలా పీజీ అభ్యర్థులు 10 వేల మంది ఉన్నట్టు అంచనా. వీరు కాకుండా ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేయించుకోని నిరుద్యోగులు జిల్లాలో లక్షల్లో ఉన్నారు. డీఎస్సీ–14 నియామకాల్లో జిల్లాలో కేవలం 506 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. బీఎడ్ అభ్యర్థులు 25 వేల మంది ఉంటే ఈ డీఎస్సీలో వారిలో 223 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మశీ, పాలిటెక్నిక్ చేసిన నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
మాకు భవిష్యత్తు ఏదీ?
వేలాది రూపాయలు ఖర్చుచేసి ఇంజినీరింగ్ పూర్తిచేసినా ఉద్యోగాలు లేవు. రాష్ట్రానికి ఒక్క కొత్త కంపెనీ కూడా రాలేదు. చదువు పూర్తి చేసిన తరువాత మా భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదు. –పి.వెంకట ఉత్తేజ్, ఇంజనీరింగ్ విద్యార్థి, ఏలూరు
నిరుద్యోగ భృతి ఇస్తారా?
నిరుద్యోగులకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లు గడిచినా ఒక్క మాట మాట్లాడడం లేదు. నిరుద్యోగ యువత అంతా నిరాశలో ఉన్నారు. ఇప్పటికైనా నిరుద్యోగభృతి ఇవ్వాలి.
–అడపా సుదర్శనం, విద్యార్థి, ఏలూరు
ప్రత్యేక హోదాతోనే..
ప్రత్యేకహోదా వస్తేనే రాష్ట్రానికి కంపెనీలు, సంస్థలు వస్తాయి. అప్పుడే నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.–కంతేటి మోహన్‌కుమార్, నిరుద్యోగి, ఏలూరు
రాష్ట్రాన్ని ముంచేశారు
రాష్ట్ర విభజన అనంతరం ఏపీ దీనస్థితిలోకి వెళ్లింది. కేవలం రాజధాని మాత్రమే నిర్మిస్తే సరిపోతుందా? మిగిలిన జిల్లాల్లోని విద్యార్థులు, నిరుద్యోగ యువత పరిస్థితి ఏమి కావాలి. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం దారుణం. జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అధికారులు చెప్పాలి. కేవలం మార్కెటింగ్‌లో పదిమందికి తాత్కాలిక ఉద్యోగాలు ఇస్తే సరిపోతుందా? ఇప్పటికైనా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ముంచేసే నిర్ణయాలు వదిలి మేలు చేసేందుకు కృషి చేయాలి.–బత్తుల సాగర్‌బాబు, విద్యార్థి, ఏలూరు