బాబు బాల్ వేయరు...కిరణ్ బ్యాటింగ్ చేయరు: విజయమ్మ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు తన సిద్ధాంతాలను మార్చుకున్నారని ఆరోపించారు.
గురువారం ఆమె హైదరాబాద్‌లో మీడియా చిట్‌చాట్‌లో ... రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని గత ఆరు నెలలుగా ముఖ్యమంత్రి కిరణ్‌ను తమ పార్టీ కోరుతున్న సంగతిని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఆయన నుంచి స్పందన కరువైందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన తరువాత ఇప్పుడు సమైక్య తీర్మానం కుదరదంటూ సీఎం విడ్డూరంగా మాట్లాతున్నారని ఆమె పేర్కొన్నారు.
అప్పుడే సమైక్య తీర్మానం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అంటూ విజయమ్మ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బౌలింగ్ చేస్తుంటే సీఎం కిరణ్ బ్యాటింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విభజన జరిగే వరకు చంద్రబాబు బాల్ వేయరు, కిరణ్ బ్యాటింగ్ చేయరని ఆమె పేర్కొన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు వెళ్లే అఖిలపక్షంలో తమ పార్టీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంవీఎస్ నాగిరెడ్డి హాజరవుతురన్నారు.
ప్రముఖ రచయిత్రి కాత్యాయనీ విద్మహే రచించిన సాహిత్యాకాశంలో సగం-స్త్రీల అస్తిత్వ సాహిత్యం కవిత్వం, కథ అనే సాహిత్య విమర్శ గ్రంథం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాత్యాయనీని వైఎస్ విజయమ్మ అభినందనలు తెలిపారు.