విద్యార్థులకు కంటి పరీక్షలు
= దృష్టి లోపమున్న పిల్లలకు ఉచితంగా కంటి అద్దాలు
= మంత్రి యు.టి.ఖాదర్ వెల్లడి
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించి, దృష్టి లోపాలున్న వారికి ఉచితంగా కంటి అద్దాలను అందజేయనున్నట్లు రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ వెళ్లడించారు. వరల్డ్ సైట్ డే సందర్భాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని కబ్బన్ పార్క్‌లో గురువారం నిర్వహించిన వాకథాన్‌లో ఆయన పాల్గొని, ప్రసంగించారు. కర్ణాటకను అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోందని చెప్పారు.
ఇందులో భాగంగానే ఐదేళ్ల వయస్సున్న చిన్నారులకు ఏడాదిలో రెండు సార్లు విటమిన్-ఎ ద్రావణాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ స్వచ్ఛంద సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని పాఠశాలల్లోని చిన్నారులకు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించనుందని చెప్పారు. అంతేకాక దృష్టిలోపంతో బాధపడుతున్న వృద్ధులకు కూడా ఈ ఏడాది నుంచి ఉచితంగా కంటి అద్దాలను అందించనున్నట్లు మంత్రి ఖాదర్ వెళ్లడించారు.
భారతదేశంలో ప్రస్తుతం 20శాతం మంది రెటినోపతి వ్యాధితో బాధపడుతున్నారని, సరైన ఆహార నియమాలు, తరచుగా కంటి పరీక్షలను చేయించుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.మదన్ గోపాల్, మింటో ఐ హాస్పిటల్ డెరైక్టర్ శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.