డీఆర్డీఏ నూతన పీడీ బాధ్యతలు స్వీకరించేనా..?
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: డీఆర్డీఏ పీడీగా వైవీ సత్యభాస్కర్‌ను నియమిస్తూ సెర్ప్ సీఈఓ రాజశేఖర్ ఆదేశాలు జారీ చేసి ఐదు రోజులు గడుస్తున్నా అతను బాధ్యతలు స్వీకరించే విషయంలో సందిగ్ధం నెలకొంది. ఇప్పటికీ ఈ విషయంపై స్పష్టత రాలేదు. సంవత్సర కాల పరిమితితో డీఆర్డీఏ పీడీగా వరంగల్‌లో డీపీఓగా పని చేస్తున్న పద్మజారాణి గత ఏడాది ఫిబ్రవరి 15న డిప్యుటేషన్‌పై వచ్చారు. జిల్లా ఇన్చార్జ్ డీపీఓగా కూడా వ్యవహరిస్తున్నారు.
ఆమె డిప్యుటేషన్ పరిమితి ముగియడంతో ఆమెను తిరిగి మాతృశాఖకు పంపిస్తూ సెర్ప్‌లో భూవిభాగంలో స్టేట్ ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్న సత్యభాస్కర్‌ను ఇక్కడికి బదిలీ చేస్తూ గత నెల 28వ తేదీన సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే విధుల్లో చేరాలని సత్యభాస్కర్‌ను ఆదేశించారు. కాగా సోమవారం సత్యభాస్కర్ డీఆర్డీఏ కార్యాలయానికి వచ్చారు. అయితే బాధ్యతలు మాత్రం స్వీకరించలేదు. వచ్చే సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో పలువురు అధికారులకు నోడల్ అధికారులుగా విధులు కేటాయించారు. అందులో భాగంగా ప్రస్తుతం పని చేస్తున్న పద్మజారాణికి ఎన్నికలకు సంబంధించి ట్రైనింగ్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతల పేరుతో ఆమె ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యేందుకు అయిష్టంగా ఉన్నట్లు తెలిసింది.
దీంతో ఇక్కడ కొత్తగా విధుల్లో చేరేందుకు వచ్చిన సత్యభాస్కర్ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎన్నికలకు సంబంధించి మెటీరియల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా విధులు కేటాయించిన డ్వామా పీడీ శ్రీనివాసులు మాత్రం ఇటీవల బదిలీ కావడంతో రిలీవ్ అయి వెళ్లారు. అదేవిధంగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీగా వచ్చిన రాములు సోమవారం జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. కొత్తగా బదిలీపై వచ్చిన అధికారులు కూడా ఎన్నికల బాధ్యతలను నిర్వహించే బాధ్యత ఉంటుంది. పైగా రెవెన్యూ విభాగంలో అనుభవం ఉండి ఇక్కడకు డీఆర్డీఏ పీడీగా బదిలీపై వచ్చిన సత్యభాస్కర్ సైతం ఎన్నికల నోడల్ అధికారిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. కానీ పద్మజారాణి ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉండేందుకు జిల్లా ఉన్నతాధికారులపై హైదరాబాద్ స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం.