బాబు హామీలపై కన్నెర్ర
ఎన్నికల ముందు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తానని, రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని హామీల గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మొదటి ఐదు సంతకాలతో రాష్ట్ర రూపురేఖలే మారుస్తానన్న బాబు అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నత్తనడక కూడా నడవడం లేదు. బాబు వస్తే జాబు రాకపోగా ఉన్నవి ఊడుతున్నాయి ... నిరుద్యోగులకు భృతి రాకపోగా ఉద్యోగ ప్రకటనలు కూడా వెలువడడం లేదు.
పింఛన్లు పెంచకపోగా...
పింఛన్లు పెంచుతున్నామని చెప్పి కొత్త మార్గదర్శకాల పేరుతో జిల్లాలో 80 వేల మంది వృద్ధులకు పింఛన్లు ఎత్తివేశారు. దరఖాస్తులు అందజేసినా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు.
డ్వాక్రాపై రూ.20 కోట్ల భారం
జిల్లాలో 49 వేల డ్వాక్రా సంఘాలున్నాయి. ఎన్నికల హామీకి ముందు డ్వాక్రా రుణాలు రూ.750 కోట్లుండగా ఇప్పుడు అది రూ. 805 కోట్లకు చేరాయి. సకాలంలో రుణమాఫీ చేయకపోవడంవల్ల 4.5 శాతం వడ్డీ పడింది. దీంతో దాదాపుగా ఈ ఏడాది చివరికి రూ. 40 నుంచి 50 కోట్ల భారం పడనుంది. వడ్డీని కూడా అసలులో కలపడం వల్ల మరో రూ. 10 నుంచి 20 కోట్ల అదనపు భారం పడనుంది. రుణాలు కట్టలేదన్న సాకుతో ఈ ఏడాది రుణాలు కూడా బ్యాంకులు ఇవ్వడం లేదు.
కాగితాలకే పరిమితం
విమానాశ్రయం, శిల్పారామం, నిమ్జ్ కాగితాలకే పరిమితమయ్యాయి.
శనగ రైతూ కుదేలు
శనగరైతు కుదేలయ్యాడు. వీరి వద్ద నుంచి శనగలు కొనుగోలు చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు.
అసలు మాఫీకి బదులు వడ్డీ భారం
రైతుల రుణాలు మాఫీ చేయడంలో ఘోరంగా విఫలమయింది. జిల్లాలో జాతీయ బ్యాంకులతోపాటు సహకార బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న రుణాలు ప్రస్తుతం రూ.5,900 కోట్లున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు మూడు లక్షల మంది లబ్ధిదారులు రైతురుణ మాఫీకి అర్హులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరిపై వడ్డీ రూపంలో రూ.300 కోట్లకు పైగా భారం పడింది.
బాబూ వచ్చే జాబు పాయే
జాబు కావాలంటే బాబు రావాలంటూ ఊదరకొట్టిన తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్లు, మధ్యాహ్న భోజన వంట కార్మికులు, వివిధ ప్రభుత్వ సంస్థల్లోని పొరుగు సేవల ఉద్యోగలను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది.
మోగని సైరన్
జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పినా ఒక్క పరిశ్రమ కూడా జిల్లాకు రాలేదు. రామాయపట్నం పోర్టు, పూలసుబ్బయ్య వెలి గొండ ప్రాజెక్టు, గుండ్లకమ్మ ప్రాజెక్టులు కూడా పూర్తయ్యే పరిస్థితి కనపడటం లేదు.
నిరుద్యోగ భృతి
తాను అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగమే కాదు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని బాబు ప్రకటించారు. తరువాత ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లాలో లక్షలాది మంది నిరుద్యోగులుండగా, అందులో 59 వే లమంది ఇప్పటికే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చెంజీల్లోలో నమోదు చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.
విజయవంతం చేయండి
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసేవరకూ పోరాటం చేస్తామని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలని ఆయన జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. గిద్దలూరులో జరిగే ధర్నాలో తాను పాల్గొంటానన్నారు.