టీడీపీలో రె‘బెల్స్’..
అర్జునుడి అసమ్మతి బాణం
నూజివీడు ఇవ్వకుంటే బందరు బరిలో పోటీ?
ఈ నెల 19 డెడ్‌లైన్?
బాబు ఎదుట ముత్తంశెట్టి అనుచరుల నిరసన
నూజివీడు, పెనమలూరుపై హరికృష్ణ పంతం
నామినేషన్ వేసేందుకు జయమంగళ సన్నద్ధం
సాక్షి,మచిలీపట్నం : జిల్లా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి రాజుకుంటోంది. ఇప్పటికే గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, పెనమలూరులో మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, చలసాని పండు సతీమణి పద్మావతి, అవనిగడ్డలో సిట్టింగ్ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ అనుయాయులు తీవ్ర అసమ్మతితో రగులుతున్నారు. దీనికితోడు అవనిగడ్డలో టిక్కెట్ ఇస్తామని బాబు చెప్పడంతో నోవా విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి కృష్ణారావు దాదాపు మూడు నెలలుగా కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు.
ఆయనకు కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన మండలి బుద్ధప్రసాద్‌కు టిక్కెట్ ఖరారు చేయడంతో చంద్రబాబు తీరుపై ముత్తంశెట్టి మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబును తణుకులో కలిసిన ముత్తంశెట్టి అనుచరులు అవనిగడ్డ సీటు కోసం పట్టుబట్టారు. బాబు అందుకు సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయన ముంగిటే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
అర్జునుడి అసమ్మతి బాణం...
టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న బచ్చుల అర్జునుడు అసమ్మతి బాణం వేశారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పైకి మాత్రం చంద్రబాబుపై నమ్మకం ఉందని చెప్పినా.. టిక్కెట్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. గత రెండు పర్యాయాలుగా ఆయన టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ రాని ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తానని బాబు హామీ ఇచ్చారు.
టిక్కెట్ రాని బచ్చుల ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేయలేదని చంద్రబాబుకు అప్పట్లో పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే బచ్చులకు ఎమ్మెల్సీ ఇవ్వకపోగా ఈసారి కూడా టిక్కెట్ ఇచ్చేందుకు బాబు ఆసక్తి చూపలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే టిక్కెట్ ఇస్తానని, నూజివీడులో పార్టీ కోసం పనిచేయాలని ఆర్నేల్ల క్రితం చెప్పిన బాబు ఇప్పుడు బచ్చులకు ఇవ్వకపోతే ఆయన రెబెల్‌గా మారే అవకాశం ఉంది.
గన్నవరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు టిక్కెట్ ఇచ్చే ప్రయత్నం చేయడాన్ని బచ్చుల వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో నూజివీడు, బందరు నియోజకవర్గాల్లో ఏదోక చోట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తన టిక్కెట్ విషయంలో ఏ నిర్ణయం తీసుకునేదీ 19 వరకు డెడ్‌లైన్ పెట్టడం గమనార్హం.
నూజివీడు టిక్కెట్ ‘హరీ’..
ముద్దరబోయిన తన సీటు తన్నుకుపోతున్నాడని బాధపడుతున్న బచ్చులకు మరోవైపు హరికృష్ణ రూపంలో సమస్య వచ్చి పడింది. తెలుగుదేశంలో ఎన్టీఆర్ వారసుడిగా హరికృష్ణ సీటు పోరును గురువారం తీవ్రం చేసిన సంగతి తెల్సిందే. తనకు పెనమలూరు, నూజివీడులో ఏదో ఒకటి ఇవ్వాలని హరికృష్ణ అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పెనమలూరులో బోడే ప్రసాద్‌కు బీ-ఫారం ఇచ్చేయడంతో మిగిలిన నూజివీడుపై హరి కన్నేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నూజివీడు టిక్కెట్ కూడా హరీ అవుతుందని బచ్చుల బాధపడుతున్నట్టు సమాచారం.
జయమంగళకు లైన్‌క్లియర్..?
సీమాంధ్ర ప్రాంతంలో బీజేపీలో తెలుగుదేశం పొత్తు వ్యవహారం బెడిసికొట్టే అవకాశం ఉండటంతో బీజేపీకి కేటాయించిన సీట్లలోను టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పొత్తులో భాగంగా జిల్లాలో కైకలూరు నియోజకవర్గంతో పాటు విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గం బీజేపీకి కేటాయించారు. బీజేపీ పొత్తుపై నీలినీడలు కమ్ముకోవడంతో ఆ పార్టీకి కేటాయించిన సీట్లలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయాలని చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో బీజేపీకి కేటాయించిన కైకలూరు నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు లైన్‌క్లియర్ అయినట్టు చెబుతున్నారు. దీంతో ఈ నెల 19న ఆయన నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీతో మళ్లీ పొత్తు కుదిరితే మరి జయమంగళ సంగతేంటి అనేది అనుమానమే?