ప్రగతి భవన్‌పై నీలిరంగు జెండా
జఫర్‌గఢ్: ప్రగతిభవన్‌పై నీలిరంగు జెండా ఎగురవేయాలన్నదే తమ లక్ష్యమని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. బహుజన రాజాధికార యాత్ర స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల, జఫర్‌గఢ్ , పాలకుర్తి మండలాల్లో ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, రాష్ట్రం బాధల తెలంగాణగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న సీఎం కేసీఆర్ తన కుటుంబాన్నే బంగారంగా మార్చుకున్నారని ఆరోపించారు. బీఎస్పీ ద్వారానే బడుగుల జీవితాలు బాగుపడుతాయని తెలిపారు. రానున్న బహుజన రాజ్యంలో అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అందుతుందని, రానున్న రోజుల్లో పేదింటి విద్యార్థులే ఈ దేశాన్ని శాసిస్తారని ధీమా వ్యక్తం చేశారు.