Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Chandrababu Govt One Year Rule By Vardhelli Murali1
ఏడాది పాలన పొట్ట విప్పి చూడ..!

చంద్రబాబు అనే నాలుగు అక్షరాలకు అర్థమూ, తాత్పర్యమూ, నిర్వచనమూ అన్నీ కూడా అభివృద్ధేనని యెల్లో మీడియా మనకు ఎప్పటి నుంచో నేర్పిస్తున్నది. ముప్పయ్యేళ్ల లోపు వయసున్న తరానికైతే దొండాకు పసరు నాడే ఈ వసను కూడా కలిపి తాగించారు. అటువంటి రెండు కాళ్ల మీద నడిచే అభివృద్ధి నాలుగోసారి కుర్చీ ఎక్కి సంవత్సరకాలం పూర్తవు తున్నది. ఈ ఏడాది కాలంలో విరగబూసిన అభివృద్ధిని కళ్లారా వీక్షించాలన్న కోరిక ఎవరికి మాత్రం ఉండదు? ఆ వీక్షణ కోసం కొన్ని ‘వ్యూ పాయింట్స్‌’ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి.హిందూపూర్‌ రైల్వే స్టేషన్‌ కూడా ఒక వ్యూ పాయింట్‌.హిందూపూరంటే చంద్రబాబు పార్టీకి కంచుకోట కదా! ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఓటమి చవిచూడలేదట! పైగా ముఖ్యమంత్రికి స్వయానా బావమరిది ప్లస్‌ వియ్యంకుడు ప్లస్‌ మాస్‌ మసాలా హీరో – బాక్సాఫీస్‌ బొనాంజా బాలయ్యబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇంత బిల్డప్‌ ఉన్నచోట అభివృద్ధి దద్దరిల్లకుండా ఉంటుందా? ఉదయం నాలుగున్నర నుంచి రెండు గంటలసేపు ఆ స్టేషన్‌లో నిలబడితే రైలు కూత వాయిస్‌లో అభివృద్ధి సౌండ్‌ వినిపిస్తుంది.బెంగళూరు నగరంలోని ఇళ్లలో పాచి పనులు చేసేందుకు, వీధుల్లో మూటలు మోసేందుకూ, ఇంకా ఇతర పనుల కోసం దాదాపు మూడు వేలమంది దాకా రోజూ అక్కడ ప్యాసింజర్‌ బండ్లెక్కి వెళుతున్నారు. ఇలా ప్రతిరోజూ వెళ్లి పనిచేసుకుని రావడం కొత్తేమీ కాదు. కాకపోతే ఏడాది కిందట వీరి సంఖ్య ఆరేడు వందలు దాటేది కాదు. ఈ ఏడాదిలో క్రమంగా మూడు వేల మార్కుకు చేరుకున్నది. ఈ పెరుగుదలను ఏడాది పాలన అభివృద్ధి ఖాతాలోనే కదా వేయాల్సింది. రోజువారీ చాకిరీ ముగిసిన తర్వాత మళ్లీ రైలు బండెక్కి రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఇంటికి చేరుకుంటారు. మళ్లీ పొద్దున మూడు గంటలకే లేచి ఇంటి పనులు పూర్తి చేసుకుంటేనే... స్టేషన్‌లో బతుకు బండిని అందుకోగలుగుతారు.మహానగరానికి సమీపంలో ఉన్నందువలన హిందూపూర్‌ వలసల్లో డైలీ షటిల్‌ పద్ధతి కనిపిస్తున్నది. ఆ సమీపంలోనే ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలోనైతే మూడో వంతు జనాభా మాత్రమే మిగిలిపోయిన గ్రామాలు కూడా ఉన్నాయి. అలా మిగిలిపోయిన వాళ్లలో వృద్ధులూ, పిల్లలే ఎక్కువ. భవన నిర్మాణ రంగంలో పనిచేయడానికి నెల్లూరు నగరంలో స్థిరపడ్డ కార్మికుల్లో ఇరవై వేలమంది ఈ మధ్యకాలంలోనే పట్టణం వదిలి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ వలసలపై గ్రామ సచివాలయాల సర్వేను ఆధారం చేసుకొని ఇటీవల ‘ప్రజాశక్తి’ పత్రిక ఒక కథ నాన్ని ప్రచురించింది. దానిప్రకారం ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంతగా వలసలు పెరిగాయి. గణనీయ సంఖ్యలో జనం వలస బాట పట్టారు.వలసలన్నీ అభివృద్ధికి వ్యతిరేకమైనవి కావు. మెరుగైన జీవితం కోసం, నైపుణ్యతకు తగిన ఉపాధి కోసం, ఉన్నతో ద్యోగాల కోసం నిరంతరం వలసలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి వలసలను ప్రగతిశీలమైనవిగానే పరిగణిస్తారు. కానీ ఈ సంవత్సరం ఈ తరహా వలసల సంఖ్య చాలా తక్కువనీ, బతుకుదెరువు వలసలే ఎక్కువనీ సర్వే సారాంశమట! వ్యవ సాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, రైతన్నలకు చేసిన హామీలను ఎగవేయడం, కరువు పరిస్థితులు, ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన బిల్లులు ఆపేయడం, నిర్మాణరంగం పూర్తిగా కుదేలవడం వంటి కారణాలు పెద్ద ఎత్తున వలసలకు కారణమయ్యాయి.తొలి ఏడాది అభివృద్ధికి సంబంధించి పెరిగిన వలసలు ఒక కొలమానమైతే, అధికారిక లెక్కలు వెల్లడించే డాక్యుమెంట్లు మరో బలమైన సాక్ష్యంగా ఉంటాయి. ఇదిగో ఈ సాక్ష్యాలను ముందుపెట్టుకొనే వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర యథార్థ పరిస్థితులను మీడియా సమావేశం ద్వారా మొన్న జనం ముందు ఉంచారు. ఈ సమావేశంలో తన పార్టీ వాళ్లు తయారుచేసిన నివేదికల ఆధారంగా ఆయన మాట్లాడలేదు. ప్రభుత్వం తయారుచేసిన బడ్జెట్‌ పత్రాల్లోని లెక్కల్ని ఆధారంగా చేసుకునే మాట్లాడారు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రిపోర్టుల్లోని విషయాలపైనే మాట్లాడారు. ‘కాగ్‌’కు తన ప్రమాణాలను పాటించడం తప్ప ఎటువంటి పక్షపాత ధోరణీ ఉండదనేది తెలిసిందే. తప్పొప్పులను తూర్పారపట్టడమే దాని పని. ఈ లెక్కల ఆధారంగానే కూటమి సర్కార్‌ మాటల్లోని కపటత్వాన్నీ, వారి ప్రచారాల్లోని డొల్లతనాన్నీ ఆయన చీల్చి చెండాడారు. ప్రభుత్వంపై ఆయన చేసిన దాడి ఎంత సాధికారికంగా, ఎంత శక్తిమంతంగా జనంలోకి వెళ్లిందంటే... మూడు రోజులు గడిచినా సర్కార్‌ వైపు నుంచి ఏ ఒక్కరూ ప్రతిపక్ష నేతకు సమాధానమిచ్చేందుకు ముందుకు రాలేకపోయారు. కొన్ని పిల్లి అరుపులు వినిపించడం, కొన్ని కుప్పిగంతులు కనిపించడం తప్ప!మూలధన వ్యయం పెరుగుదలను ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి గుర్తుగా పరిగణిస్తారు. ఆర్థిక వ్యవస్థపై నమ్మకానికీ, ఉద్యోగాల కల్పనకూ, జీడీపీ ఉద్దీపనకూ ఈ మూలధన వ్యయం దోహదపడుతుంది. మరి, అభివృద్ధికి పర్యాయపదంగా యెల్లో మీడియా పలవరించే చంద్రబాబు తొలి ఏడాదిలో ఈ మూల ధన వ్యయం ఏ మేరకు పెరిగింది? పెరగలేదు సరికదా,అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 17.80 శాతం తగ్గిందని ‘కాగ్‌’ నివేదికలోని అంశాన్ని జగన్‌ జనం ముందు పెట్టారు. జగన్‌ ప్రభుత్వపు చివరి సంవత్సరంలో మూలధన వ్యయం రూ. 23,330 కోట్లయితే చంద్రబాబు తొలి సంవత్సరం అది రూ. 19,177 కోట్లు మాత్రమేనని ‘కాగ్‌’ కుండబద్దలు కొట్టింది.స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏటికేడు పెరుగుతుంటేనే అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు! కానీ గత సంవత్సరంతో పోలిస్తే చంద్రబాబు తొలి సంవత్సరంలో ఈ ఆదాయం 7.39 శాతం తగ్గింది. జగన్‌మోహన్‌రెడ్డి జనం ముందుంచిన ప్రభుత్వ గణాంకాల్లో అత్యంత ఆసక్తికరమైనది ఎక్సైజ్‌ ఆదాయం.ఎందుకంటే అంతకుముందు కంటే మద్యం షాపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి మద్యం షాపుకు అనుబంధంగా ఓ పర్మిట్‌ రూమ్‌ తయారైంది. ఇక బెల్ట్‌షాపుల సంఖ్య నలభై వేలు దాటింది. ఒక్కో బెల్ట్‌షాపు అనధికార పాటల్లో పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు పలికిందని వార్తలొచ్చాయి. బెల్ట్‌షాపుల కేటాయింపులోనే నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల మేరకు అనధికారిక డీల్‌ కనబడుతుంటే... ప్రభుత్వానికి పెరిగిన ఎక్సైజ్‌ ఆదాయం కేవలం రూ. 3,800 కోట్లు మాత్రమే!ఇక ఈ 40 వేల పైచిలుకు బెల్ట్‌ షాపుల్లో అమ్మిన సరుకెంత? వచ్చిన ఆదాయమెంత? 4,400 మద్యం దుకాణాల్లో, వాటికి అనుబంధంగా కొత్తగా వెలసిన పర్మిట్‌ రూమ్‌ల సౌకర్యంతో పెరిగిన అమ్మకాలెన్ని? వచ్చిన ఆదాయమెంత? మద్యం దుకాణాలు, పర్మిట్‌ రూమ్‌లు, బెల్ట్‌షాపులు, బార్లు రౌండ్‌ ది క్లాక్‌ చేస్తున్న వ్యాపారం వల్ల పెరిగిన ఆదాయమెంత? ఇదంతా ఎవరి జేబుల్లోకి వెళుతున్నది? లేని స్కామ్‌పై నెలల తరబడి చేసిన దుష్ప్రచారం తర్వాత ఇప్పుడు ఎవరూ మాట్లాడొద్దని చంద్రబాబు చల్లగా ఆదేశాలివ్వడం వెనుక రహస్యమేమిటి? ఆధారాలు తుడిచేశారని ‘ఈనాడు’, దర్యాప్తు ఇప్పుడప్పుడే పూర్తి కాదని ‘ఆంధ్రజ్యోతి’ రాయడం వెనుక మర్మమేమిటి? ఇప్పుడు నడిపిస్తున్న విశృంఖల అవినీతి బయటికొస్తుందేమోనని భయ పడుతున్నారా? కేవలం 24 శాతం పెరుగుదలనే నమోదు చేసిన ఎక్సైజ్‌ ఆదాయం తీగ అవినీతి డొంకను కదిలించింది.సంపద సృష్టికర్తగా స్వీయ కీర్తనలు చేసుకొని, యెల్లో మీడియా కితాబులందుకునే చంద్రబాబు తొలి ఏడాది పాలనలో రాష్ట్ర సొంత వనరుల ద్వారా పెరిగిన ఆదాయం కేవలం 3.08 శాతం మాత్రమే! అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయం 13.76 శాతం పెరిగింది. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ఆదాయం 12 శాతం పెరిగింది. అప్పుల్లో మాత్రం 30 శాతం అదనంగా చంద్రబాబు ప్రభుత్వం హైజంప్‌ చేసింది. ఇది బడ్జెటరీ అప్పుల సంగతే! అమరావతి అప్పులు, ఇతరత్రా అప్పులు వేరే ఉన్నాయి. అయిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 41 శాతాన్ని చంద్రబాబు సర్కార్‌ తొలి సంవ త్సరంలోనే చేసేసిందని జగన్‌మోహన్‌రెడ్డి ఆధారసహితంగా జనం ముందు పెట్టారు. ఒకపక్క అప్పులు పెరుగుతున్నాయి. అవినీతి మహమ్మారి మాదిరిగా విస్తరిస్తున్నది. అభివృద్ధి మృగ్యమైందని సాక్ష్యాలు చెబుతున్నాయి. మరి సంపద సృష్టికీ, అభివృద్ధికీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా చెప్పుకునే అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే ఆయన తైనాతీలు, భజంత్రీలు అమరావతి వంక చూపెడుతున్నారు. అసలా అమరావతి నిర్మాణమే అతి పెద్ద స్కామ్‌గా గణాంకాల సహితంగా జగన్‌ నిరూపించారు.గతంలో పిలిచిన టెండర్లను, అసాధారణ రీతిలో పెంచి పిలవడం వెనుక, టెండర్లు దక్కించుకున్న వారికి మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇప్పించడం వెనుకనున్న మర్మం కమీషన్లు దండుకోవడం కాదా అని ప్రశ్నించారు. సచివాలయం, హెచ్‌ఓడీ భవనాలను 53 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించడంలోని ఔచిత్యాన్నీ, చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ. 8,931గా నిర్ణయించడంలో లోగుట్టునూ కూడా ఆయన ప్రశ్నించారు.అమరావతి నిర్మాణం పేరుతో ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగూ అనుమానాస్పదంగానే ఉన్నది. ఎన్నికలకు ముందు రాజధానికి ప్రభుత్వం పైసా ఖర్చు చేయనవసరం లేదని చెప్పారు. భూముల అమ్మకం ద్వారానే నిర్మాణం పూర్తి చేయొచ్చనీ, ఆ రకంగా అది సెల్ఫ్‌ ఫైనాన్స్‌ నగరమనీ ప్రచారం చేసిన సంగతి ఎవరూ మరచిపోలేదు. ఇప్పుడేమో తొలిదశ 50 వేల ఎకరాలకే రూ.80 వేల కోట్లు కావాలని చంద్రబాబు చెబుతున్నారు. అందులో 30 వేల కోట్లు ఇప్పటికే అప్పుగా తెచ్చారు. మరో 45 వేల ఎకరాలతో రెండో దశ భూసమీకరణ కూడా జరుగుతుందట! ఈ లెక్కన రాజధాని నగరానికి రెండు లక్షల కోట్ల దాకా ఖర్చు పెట్టవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ నిర్మాణం పూర్తయ్యే సరికి తడిసి మోపెడవుతుందని జగన్‌మోహన్‌రెడ్డి కూడా హెచ్చరించారు. భూముల అమ్మకాలు జరిపినా అప్పులు తీర్చలేరని, చివరికి రాష్ట్ర ప్రజలపై అమరావతి ఒక గుదిబండ కాబో తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చౌకగా వసతి సౌకర్యాలు, అపారంగా ఉపాధి అవకాశాలను సృష్టించ గలిగితేనే ఆ నగరం నెమ్మదిగా ఒక రూపు తీసుకుంటుంది. రోమ్‌ నగరం ఒక్కరోజులో నిర్మితం కాలేదన్న సామెతకు ఒక అర్థం ఉన్నది.ఒక భారీ సంకల్పం నెరవేరాలంటే కావాల్సినంత సమ యం, సహనం, నిరంతర ప్రయత్నం, అంకితభావం ఉండాలి. అమరావతి ప్రాంతం ఇప్పటికే సామాన్యులకు అందు బాటులో లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఈ ప్రాంతంలో జగన్‌ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయిస్తే రాజధాని సమతుల్యత దెబ్బతింటుందని చంద్రబాబు బృందం కోర్టుకెక్కిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇటువంటి చోట ఎంత ప్రయాసపడ్డా వచ్చే పదేళ్లలో మరో మహానగరం కాదు, ఇంకో మంగళగిరి కూడా ఆవిర్భవించదు! ఏడాది కాలంలో ప్రజా సంక్షేమం పూర్తిగా పడకేసింది. అభివృద్ధి అలికిడే లేదు. అవినీతి విశ్వరూపం దాల్చింది. రాజకీయాల్లో ఒక అరాచక బర్బర సంస్కృతిని ప్రవేశపెట్టారు. ప్రత్యర్థులను వేటాడుతూ భయానక పాలనకు తెరతీశారు. ఈ రకంగా ప్రత్యర్థుల నోళ్లు నొక్కాలని ప్రయత్ని స్తున్నారు. శిరస్సుల మీద అప్పుల కిరీటాన్ని ధరించి, మెడలో అవినీతి మాల వేసుకొని, చేతులకు ప్రత్యర్థుల నెత్తురు పులుము కొని ఏడాది ఉత్సవాల పల్లకీలపై ఏలికలు ఊరేగబోతున్నారు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Chandrababu Govt Amaravati Capital construction works scam2
ఒక్కో బిల్డింగ్‌కు ఒక్కో రేటు.. ముడుపుల రూటు సపరేటు

సాక్షి, అమరావతి: ‘మామూలుగా భవనాల (బిల్డింగ్‌) నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదు. అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫైవ్‌ స్టార్‌ వసతులు కల్పిస్తూ నిర్మించినా చదరపు అడుగుకు రూ.4,500కు మించి ఖర్చు కాదు’ అని ఇంజినీరింగ్‌ నిపుణులు తేల్చి చెబుతుంటే రాజధాని అమరావతిలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఇక్కడ భవనాల నిర్మాణ వ్యయానికి రెక్కలు వచ్చాయి. నిర్మాణ వ్యయం బిల్డింగ్‌ బిల్డింగ్‌కు మార్చేశారు. చదరపు అడుగుకు రూ.10,418.97 చొప్పున భవనాల నిర్మాణ పనులను ముఖ్య నేత ఏర్పాటు చేసిన సిండికేట్‌ కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టేయడంపై ఇంజినీరింగ్‌ నిపుణులు, బిల్డర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటాలియన్‌ మార్బుల్స్‌తో ఫైవ్‌ స్టార్‌ సదుపాయాలతో కట్టినా చదరపు అడుగు రూ.4వేలు–­రూ.4,500కు మించ­దని హైదరాబాద్, బెంగళూరు, ముంబయిలో హైరైజ్‌ బిల్డింగ్స్‌ నిర్మిస్తున్న బిల్డర్లు నివ్వెరపోతున్నారు. ఆ భవనాలను ఏమైనా వెండితో కడుతున్నారా.. బంగారపు పూత పూస్తున్నారా.. అంటూ ఆశ్చ­ర్యం వ్యక్తంచేస్తున్నారు. భారీగా పెరిగిన నిర్మా­ణ వ్యయం కమీషన్ల రూపంలో చేరాల్సిన జేబులోకి వెళ్తోందంటూ అధికార వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. అప్పు తెచ్చిన సొమ్ముతో...ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), కేఎఫ్‌డబ్ల్యూ (జర్మనీ) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, హడ్కో వంటి జాతీయ సంస్థ నుంచి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులతో చేపట్టిన పనుల్లో ఈ స్థాయిలో దోపిడీకి తెర తీయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని అమరావతిలో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివా­లయం (ఐదు ఐకానిక్‌ టవర్లు), మంత్రులు, హైకోర్టు జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గెజిటెడ్, నాన్‌ గెజిటెడ్‌ అధికారుల నివాసాల (క్వార్టర్స్‌) నిర్మాణ పనులకు 2016–18లోనే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. అప్పట్లో చేయగా మిగిలిన పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి.. ఇటీవల సీఆర్‌డీఏ మళ్లీ టెండర్లు పిలిచింది. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 65 శాతం నుంచి 105 శాతం వరకు పెంచేసి టెండర్లు పిలిచి.. అధిక ధరలకు సిండికేట్‌ కాంట్రాక్టర్లకు అప్పగించేసింది. కాంట్రాక్టు ఒప్పందం విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్‌ అడ్వాన్సుల రూపంలో కాంట్రాక్టర్లకు ఇచ్చి.. అందులో ఎనిమిది శాతం ముఖ్య నేత, మిగతా రెండు శాతం కాంట్రాక్టర్లు నీకింత.. నాకింత.. అంటూ పంచుకున్నారు. మంత్రుల బంగ్లా వ్యయం రూ.6.99 కోట్లు రాజధాని ప్రధాన ప్రాంతం (కోర్‌ కేపిటల్‌ ఏరియా)లో 26.09 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో మంత్రుల కోసం జీ+1 పద్ధతిలో 35 బంగ్లాలు.. 24.13 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,745 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో హైకోర్టు న్యాయమూర్తుల కోసం జీ+1 పద్ధతిలో 36 బంగ్లాల నిర్మాణ పనుల్లో మిగిలిన పనులను రూ.495.86 కోట్లకు బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాకు అప్పగించారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులకు నిర్మిస్తున్న 71 బంగ్లాల్లో మొత్తం నిర్మిత ప్రాంతం 4,75,920 చదరపు అడుగులుగా టెండర్‌లో పేర్కొన్నారు. కానీ.. టెండర్‌ డాక్యుమెంట్‌ను పరిశీలిస్తే మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాల్లో ఒక్కో బంగ్లా నిర్మిత ప్రాంతాన్ని బట్టి చూస్తే.. మొత్తం నిర్మిత ప్రాంతం 4,73,820 చదరపు అడుగులే. అంటే.. నిర్మిత ప్రాంతాన్ని 2,100 చదరపు అడుగులు పెంచినట్లు స్పష్టమవుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10,418.97. ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.6.99 కోట్లు. పైగా ఇసుక ఉచితం. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో ఇదే రకమైన బంగ్లాల ధర భూమితో కలిపి రూ.4 కోట్లలోపేనని బిల్డర్లు ఎత్తి చూపుతున్నారు. ఐఏఎస్‌ల బంగ్లా చదరపు అడుగు రూ.9,771 రాజధానిలో రాయపూడి వద్ద 30.47 ఎకరాల్లో ఒక్కొక్కటి 5,464 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ముఖ్య కార్యదర్శుల కోసం జీ+1 పద్ధతిలో 25 బంగ్లాలు.. కార్యదర్శుల కోసం జీ+1 పద్ధతిలో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో 90 బంగ్లాల నిర్మాణంలో మిగిలిన పనులను రూ.516.02 కోట్లకు కేఎమ్వీ ప్రాజెక్ట్స్‌కు అప్పగించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే 115 బంగ్లాల నిర్మిత ప్రాంతం 5,28,100 చదరపు అడుగులు. అంటే.. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,771.25. అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్గత రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్‌ సరఫరా వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలతో ఇలాంటి బంగ్లాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4,500కు మించదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఐఏఎస్‌ అధికారుల ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.4.49 కోట్లు. హైదరాబాద్, బెంగుళూరు వంటి మహానగరాల్లో ఇదే రకమైన బంగ్లాల ధర భూమితో కలిపి రూ.3 కోట్లకు మించదని రియల్టర్లు స్పష్టం చేస్తున్నారు.నాడూ నేడు ఒకే రీతిలో దోపిడీ ⇒ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2015లో ఓటుకు కోట్లు ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపు­లతో అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు అడ్డంగా దొరికిపోయారు. ఆ కేసు భయంతో హైదరాబాద్‌ నుంచి ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ⇒ ఆ తర్వాత అమరావతి నుంచే పరిపాలన చేయడం కోసం ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ సంస్థ­లకు అప్పగించారు. కానీ, వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ⇒ ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమయ్యాయి. షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నుంచి సీఎం తరఫున కమీషన్లు వసూలు చేసి, ఐటీ శాఖకు సీఎం చంద్రబాబు వ్యక్తి­గత కార్యదర్శి అప్పట్లో పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాల­యం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్‌ టవర్ల నుంచి అధికారుల నివాసాల వరకు.. డిజైన్‌ మారిందని.. పని స్వభావం మారిందని.. ధరలు పెరిగాయనే సాకు చూపి.. 2015–19 తరహాలోనే దోపిడీకి తెర తీశారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఐకానిక్‌ టవర్ల నిర్మాణ వ్యయం ఆకాశమంత ⇒ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్‌ విధానంలో ఐదు ఐకానిక్‌ టవర్లు నిర్మించేలా పోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ృజెనిసిస్‌ ప్లానర్స్‌ృడిజైన్‌ ట్రీ సర్వీస్‌ కన్సెల్టెంట్స్‌ సంస్థలు 2018లో డిజైన్‌లు (ఆకృతులు) రూపొందించాయి. ⇒ ఐదు ఐకానిక్‌ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్‌ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆ ఐకానిక్‌ టవర్ల నిర్మాణంలో మిగిలిన పనులకు రూ.4,688.82 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. ⇒ నాలుగు టవర్లను బీ+జీ+39 అంతస్తు­లతో.. ఐదో టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనుంది. ఈ ఐదు టవర్ల మొత్తం నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). దీన్ని బట్టి చూస్తే ఐకానిక్‌ టవర్లలో మిగిలిన పనుల నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.8,981.56. ఈ లెక్కన చూసుకుంటే 2018 నాటితో పోల్చితే ఇప్పుడు ఐకానిక్‌ టవర్ల నిర్మాణ వ్యయం రూ.2,417.68 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ⇒ అంటే.. అంచనా వ్యయం 105 శాతం పెంచేశారన్న మాట. నిజానికి 2018ృ19 ధరలతో పోల్చితే ప్రస్తుతం సిమెంటు, స్టీలు, పెట్రోల్, డీజిల్‌ సహా నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఇక ఇసుక ఉచితం. ఈ లెక్కన నిర్మాణ వ్యయం పెరగడానికి వీల్లేదని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. నిజానికి డయాగ్రిడ్‌ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని, చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించి వ్యయం కాదని ఇంజినీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Raj Thackeray says BJP trying to wipe out Pawar and Thackeray brands3
బీజేపీ మమ్మల్నిటార్గెట్‌ చేసింది.. బాల్‌థాక్రే సంచలన వ్యాఖ్యలు

ముంబై: బీజేపీపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్‌, థాక్రే బ్రాండ్లను అంతం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కానీ, అలాంటివి జరిగే ప్రసక్తే లేదని నొక్కి చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌థాక్రే తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. థాక్రే బ్రాండ్‌ అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అది అంత సులభం కాదు. థాక్రే బ్రాండ్‌ విషయానికి వస్తే నా తాత ప్రభోదంకర్ థాక్రే మహారాష్ట్రపై మొదటి ప్రభావాన్ని చూపారు. ఆయన తర్వాత, బాలాసాహెబ్ థాక్రే, తరువాత నా తండ్రి శ్రీకాంత్‌ థాక్రే తమదైన ముద్ర వేశారు. అనంతరం, థాక్రే వారుసులమైన నేను, ఉద్దవ్‌ థాక్రే మా సత్తా ఏంటో చూపించాం అని అన్నారు.ఇదే సమయంలో..‘నేను ఒక ఫోటో చూశాను. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, సునీల్ తత్కరే, అశోక్ చవాన్, నారాయణ్ రాణే, ఛగన్ భుజ్‌బాల్, ఇతర నాయకుల మధ్యలో కూర్చున్నారు. ఆ ఫోటో చూసినప్పుడు, నేను ఆశ్చర్యపోయాను. బీజేపీ మద్దతుదారులు దానిని ఎలా చూస్తున్నారో ఆలోచించాను?. మేము వారికి అధికారం రాకుండా ఎంతో కష్టపడ్డామని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వారు ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలతో కూర్చున్నారు అని ఆలోచిస్తున్నారు. ఇది వారి మనసులో ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు.అనంతరం, పహల్గాం ఘటనపై స్పందిస్తూ..‘పహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు?. పాకిస్తాన్‌తో యుద్ధం అనేది ఒక ఎంపిక కాదు. మనం చేసింది యుద్ధం కూడా కాదు. యుద్ధం గురించి మీకు ఏం తెలుసు?. గాజాను చూడండి, అప్పుడు యుద్ధం ఎలాంటి విధ్వంసం తెస్తుందో మీకు అర్థమవుతుంది. పాకిస్తాన్‌పై మన దాడులు పర్వాలేదు. కానీ, మన 26 మందిని చంపిన ఆ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు? వారు ఇప్పటికీ పరారీలో ఉన్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ISRO Rocket Fails 7 Minutes Into Flight4
ఇస్రో రాకెట్ 7 నిమిషాల్లోనే విఫలం.. పరిశీలనకు కమిటీ

న్యూఢిల్లీ: ఇస్రో అత్యంత కీలకంగా భావించిన భూమి పరిశీలన ఉపగ్రహాన్ని ఆదివారం విజయవంతంగా ప్రయోగించలేకపోయింది. దానిని మోసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ- సీ61(PSLV-C61) గాలిలోకి ఎగిరిన ఏడు నిమిషాలకే విఫలమయ్యింది. దీనికి కారణాన్ని కనుగొనేందుకు ఇస్రో జాతీయ వైఫల్య విశ్లేషణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాకెట్‌కు సంబంధించిన ఆడిట్ జరుగుతోంది. దానిలోని వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లాంటి ప్రముఖ సంస్థలకు చెందిన సభ్యులు ఉన్న కమిటీ నెలరోజులలో దీనిపై నివేదికను సమర్పించే అవకాశం ఉంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(Polar Satellite Launch Vehicle) (పీఎస్‌ఎల్‌వీ)లోని ప్రతి విభాగాన్ని పరిశీలించేందుకు ఇస్రో పలు అంతర్గత కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం ఇది అత్యంత విశ్వసనీయమైన రాకెట్. 94 శాతానికి మించిన విశ్వసనీయత కలిగివుంది. అలాగే 63 ప్రయోగాలలో కేవలం నాలుగుసార్లు మాత్రమే వైఫల్యాలను చవిచూసింది.మూడవ దశలో ఘన ఇంధన మోటారును ఉపయోగిస్తున్నందున పీఎస్‌ఎల్‌వీ మాత్రమే కాకుండా మరే ఇతర రాకెట్ కూడా విఫలం కాలేదని అంతరిక్ష సంస్థ వర్గాలు తెలిపాయి. జాతీయ వైఫల్య విశ్లేషణ కమిటీ తన నివేదికను సమర్పించిన తర్వాతనే భవిష్యత్ ప్రయోగాలపై తుది నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు.ఇది కూడా చదవండి: యూపీలో నాలుగు కోవిడ్‌-19 కేసులు నమోదు

BJP MP Ram Chander Jangra Comments Over Pahalgam Incident5
‘భర్తల ప్రాణాల కోసం వేడుకోకుండా.. ఉగ్రవాదులపై తిరగబడాల్సింది’

భివానీ: పహల్గాం ఉగ్ర దాడిపై బీజేపీ నేతల నోటిదురుసు తగ్గడం లేదు. మంత్రుల స్థాయి నేతలే మతిలేని వ్యాఖ్యలు చేసి కోర్టులతో మొట్టికాయలు తింటున్నా కనువిప్పు కలగడం లేదు. పహల్గాం దాడిలో మహిళల కళ్లముందే వారి భర్తలను ముష్కరులు కర్కశంగా కాల్చి చంపడం తెలిసిందే. అలా సర్వం కోల్పోయి వితంతువులుగా మిగదిలిన వారినుద్దేశించి హరియాణాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాంచందర్‌ జంగ్రా శనివారం దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.బీజేపీ ఎంపీ రాంచందర్‌ జంగ్రా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘భర్తలను చంపొద్దని ఉగ్రవాదులను వేడుకునే బదులు వారిపై తిరగబడాల్సింది. కానీ వారిలో యోధుల స్ఫూర్తి లోపించింది. ఉగ్రవాదులకు చేతులు జోడించారు. పర్యాటకులంతా అగ్నివీరుల్లాగా వారిని ప్రతిఘటిస్తే ప్రాణనష్టం బాగా తగ్గేది’ అంటూ కామెంట్స్‌ చేశారు. రాణీ అహల్యాబాయి మాదిరిగా మన సోదరీమణుల్లో సాహస స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరముందంటూ హితోక్తులు పలికారు. జంగ్రా వాచాలతపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమంటూ కాంగ్రెస్‌ నేతలు దీపీందర్‌సింగ్‌ హుడా, సుప్రియా శ్రీనేత్, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులు మండిపడ్డారు.महिलाओं का उपहास उड़ाना तो बीजेपी का कर्म और धर्म दोनों बन चुका है।इसी क्रम में भाजपा के सांसद रामचंद्र जांगरा देश के गृहमंत्री की विफलता का ठीकरा शहीदों की पत्नी के सिर फोड़ना चाह रहे हैं।उनका कहना है कि उन महिलाओं को भी साथ में शहीद हो जाना चाहिए था।pic.twitter.com/vL2x97ePQU— Uttar Pradesh Congress Sevadal (@SevadalUTP) May 25, 2025ఇదిలా ఉండగా.. ఇటీవలే భారత సైనికాధికారిణి కర్నల్‌ సోఫియా ఖురేషీపై బీజేపీ నేత, మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విజయ్‌ షా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోదీజీ పాక్‌కు పంపించి పాఠం నేర్పించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి. ఆయన మంత్రి పదవిపై వెంటనే వేటువేయాలని కాంగ్రెస్‌ నేతలు ప్రధానికి విజ్ఞప్తిచేశారు. అనంతరం, జరిగిన పరిణామాల తర్వాత సదరు మంత్రి తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. అది ‘భాషా పరమైన తప్పిదమే’ తప్ప ఏ మతాన్నీ కించపరచాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇండియన్‌ ఆర్మీకి, సోదరి కర్నల్‌ సోఫియా ఖురేషీకి, యావత్‌ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు.

Raveena Tandon reentry In Kollywood For Vijay Antony Movie6
24ఏళ్ల తర్వాత ఆ హీరో కోసం రీఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్‌ బ్యూటీ

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇప్పుడు మెల్లిగా సౌత్‌ ఇండియా పరిశ్రమైపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ టాప్‌ నటీనటులు ఇక్కడికి షిఫ్ట్‌ అయిపోతున్నారు. అయితే, 24ఏళ్ల క్రితమే కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్‌ బ్యూటీ రవీనా టాండన్‌( Raveena Tandon). మళ్లీ తమిళ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటారు. అంతేకాకుండా బెంగాలీ, కన్నడం, తెలుగు భాషల్లోనూ పలు చిత్రాల్లో కథానాయకిగా నటించారు. తమిళంలో అర్జున్‌కు జంటగా సాదు అనే చిత్రంతో 1994లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2001లో కమలహాసన్‌కు జంటగా ఆళవందాన్‌ "అభయ్" చిత్రంలో నటించారు. కాగా ఇటీవల కాలంలో కన్నడ హీరో యష్‌‌ కథానాయకుడిగా నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 చిత్రంలో ముఖ్య భూమికను పోషించారు. తెలుగులోనూ అడపా దడపా నటిస్తున్న రవీనా టాండన్‌ తాజాగా కోలీవుడ్‌ ప్రేక్షకులను మరోసారి పలకరించడానికి సిద్ధమవుతున్నారు. నటుడు, సాంకేత దర్శకుడు విజయ్‌ ఆంటోని ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాగా తాజాగా లాయర్‌ అనే చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి జాషువా సేతురామన్‌ కథా,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. కాగా విజయ్‌ ఆంటోనీ తన విజయ్‌ ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌ నెలలో ప్రారంభం కానుంది. ఇందులో విజయ్‌ ఆంటోనికి దీటైన పాత్రలో ఒక ప్రముఖ నటి నటించబోతున్నట్లు దర్శకుడు ఇదివరకే చెప్పారు. కాగా ఆమె ఎవరని చిత్ర వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఆమే నటి రవీనా టాండన్‌. దీని గురించి దర్శకుడు తెలుపుతూ నటి రవీనా టాండన్‌ 1999లో నటించిన శూల్‌ చిత్రంలో ఆమె నటన తనకు ఎంతగానో నచ్చిందన్నారు. అలాంటి నటి తమ చిత్రానికి అవసరం అనిపించిందన్నారు. లాయర్‌ చిత్రంలో రవీనా టాండన్‌ పాత్ర నటుడు విజయ్‌ ఆంటోని పాత్రకు దీటుగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Donald Trump Expands Tariff Threat to Samsung, Other Phone Makers7
సామ్‌సంగ్‌కు ట్రంప్‌ హెచ్చరికలు 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ ప్రఖ్యాత తయారీ సంస్థలను టారిఫ్‌ల పేరిట బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆయా కంపెనీలు అమెరికాలోనే వస్తువులు, సరుకులు ఉత్పత్తి చేయాలని, లేకపోతే సుంకాల బాదుడుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆయన యాపిల్‌ కంపెనీకి ఇప్పటికే హెచ్చరికలుజారీ చేశారు. దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్‌ సంస్థకు సైతం ఇప్పుడు అదే పరిస్థితి ఎదురయ్యింది. అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే 25 శాతం టారిఫ్‌ విధిస్తామని సామ్‌సంగ్‌కు ట్రంప్‌ తేల్చిచెప్పారు. ఆయన తాజాగా వైట్‌హúస్‌లో మీడియాతో మాట్లాడారు. అణు విద్యుత్‌ ఉత్పత్తిని మరింత పెంచడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అమెరికాలో ఎల్రక్టానిక్‌ ఉత్పత్తులు విక్రయించుకొనే ఏ సంస్థ అయినా సరే వాటిని ఇక్కడే తయారు చేయాలని, లేనిపక్షంలో సుంకాలు చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టంచేశారు. తయారీ ప్లాంట్లను అమెరికాలో నెలకొల్పితే ఎలాంటి టారిఫ్‌లు ఉండవని చెప్పారు. మరెక్కడో తయారు చేసి, ఇక్కడ విక్రయించుకొని, సొమ్ము చేసుకుంటామంటే అది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఐఫోన్లను అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే యాపిల్‌ కంపెనీపై 25 శాతం టారిఫ్‌లు విధించడం తథ్యమని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. యాపిల్‌ కంపెనీకి సంబంధించి 90 శాతం ఫోన్లు చైనాలోనే తయారవుతున్నాయి. అక్కడి ప్లాంట్లను భారత్‌కు తరలించేందుకు యాపిల్‌ సిద్ధమవుతోంది. ఇంతలోనే ట్రంప్‌ కన్నెర్ర చేశారు. మరోవైపు సామ్‌సంగ్‌కు చైనాలో తయారీ ప్లాంట్లు లేవు. చివరి ప్లాంట్‌ 2019లో మూతపడింది. సామ్‌సంగ్‌ ఫోన్లు, ఎల్రక్టానిక్‌ ఉత్పత్తులు ఎక్కువగా భారత్, దక్షిణ కొరియా, వియత్నాం, బ్రెజిల్‌లోనే తయారవుతున్నాయి. భారత్‌లోనే తయారు చేస్తారా? మీ ఇష్టం.. యాపిల్‌ కంపెనీకి ట్రంప్‌ మరోసారి అల్టిమేటం జారీ చేశారు. ‘‘ఐఫోన్ల తయారీ ప్లాంట్లను చైనా నుంచి భారత్‌కు తరలించుకోవాలంటే తరలించుకోండి. మేము వద్దనడం లేదు. కానీ, ఐఫోన్లను అమెరికాలో విక్రయించుకోవాలంటే మాత్రం సుంకాలు చెల్లించాల్సిందే. సుంకాలు లేకుండా మీరు ఐఫోన్లు ఇక్కడ అమ్ముకోలేరు’’అని పేర్కొన్నారు.

Does the Y Chromosome in Men Work?8
మాయమవుతున్న 'వై' క్రోమోజోమ్

మగజాతి ఉనికికి కీలకమైన ‘వై’ క్రోమోజోమ్‌ క్షీణించిపోతోంది. ఈ పరిస్థితిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.భూమ్మీద మగజాతి అంతరించిపోతుందా అనే భయాలు కూడా ఉన్నాయి. ఇప్పటికిప్పుడే అంత ముప్పేమీ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకు కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందని అంటున్నారు. ‘వై’ క్రోమోజోమ్‌ క్షీణతపై ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా వైద్య పరిశోధకుల్లో చర్చ జరుగుతోంది. దీనిపై విస్తృత పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఈ ‘వై’ వర్రీ గురించి తెలుసుకుందాం.పురుషుల కంటే మహిళల ఆయుర్దాయం ఎక్కువ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. పురుషుల ఆయుర్దాయం తక్కువగా ఉండటానికి అనేక సామాజిక, శారీరక కారణాలు ఉన్నాయి. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు పురుషుల్లోనే ఎక్కువ. ఇక మహిళల్లో ఉండే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ వారికి రకరకాల ఆరోగ్య పరిస్థితుల నుంచి సహజ రక్షణ కల్పిస్తుంది. మహిళల్లోని ఇరవైమూడు జతల క్రోమోజోమ్‌లలోనూ రెండేసి ఎక్స్‌ క్రోమోజోమ్‌లు ఉంటాయి. పురుషుల్లో ఇరవైమూడో జతలో ఒక ‘ఎక్స్‌’, ఒక ‘వై’ క్రోమోజోమ్‌లు ఉంటాయి. ఒక ‘ఎక్స్‌’ క్రోమోజోమ్‌ కంటే, రెండు ‘ఎక్స్‌’ క్రోమోజోమ్‌లు ఉండటం కూడా మహిళల ఆయుర్దాయం ఎక్కువగా ఉండటానికి కారణం అనే అభిప్రాయం కూడా ఉంది. ఇలా చెబుతూ పోతే ఈ జాబితా చాలానే ఉంటుంది. పురుషుల కంటే మహిళల ఆయుర్దాయం ఎక్కువగా ఉండటానికి గల కారణాలపై రకరకాల ప్రచారాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వాస్తవాలు, ఇంకొన్ని అవాస్తవాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పురుషుల్లోని ‘వై’ క్రోమోజోమ్‌ క్షీణిస్తున్నట్లుగా ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ‘వై’ క్రోమోజోమ్‌ పురుషుల అస్తిత్వానికి కీలకమైనది. వయసు పెరిగే కొద్ది పురుషుల్లోని ‘వై’ క్రోమోజోమ్‌ తన జన్యుకణాలను కోల్పోతూ ఉంటుంది. ఈ కణాలు కోల్పోయే వేగాన్ని బట్టి వార్ధక్య లక్షణాలు కనిపిస్తాయి. వార్ధక్యంలో వచ్చే వ్యాధులు కూడా చుట్టుముడతాయి. ‘వై’ క్రోమోజోమ్‌ కణాల క్షీణత ఈ మేరకు మాత్రమే పరిమితమైతే ఏ ఆందోళనా అక్కర్లేదు. ‘వై’ క్రోమోజోమ్‌ పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి కూడా ఉందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే జరిగితే, భూమ్మీద పురుషజాతి అంతరించిపోతుంది. పురుషజాతి పూర్తిగా అంతరించిపోతే, భూమ్మీద మహిళలు మాత్రం ఎంతకాలమని మనుగడ సాగించగలరు? ‘వై’ క్రోమోజోమ్‌ అంతరించిపోతే, యావత్‌ మానవాళి కూడా భూమ్మీద అంతరించిపోతుందా? ఇలా ఈ అంశంపై అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ‘వై’ క్రోమోజోమ్‌ క్షీణత వల్ల ఏర్పడబోయే పరిణామాలపై తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించడానికి, మానవాళి అంతరించిపోయే ముప్పును తప్పించే మార్గాలను కనుగొనడానికి శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు సాగిస్తున్నారు. భూమ్మీద మానవుల మనుగడ మొదలైన నాటి నుంచి మానవజాతిలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిలో భాగంగానే పురుషజాతి అస్తిత్వానికి కీలకమైన ‘వై’ క్రోమోజోమ్‌లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనుషుల్లో 23 జతల క్రోమోజోమ్‌లు ఉంటాయి. వాటిలో ఒక జత లింగనిర్ధారణకు కీలకమైనది. మహిళల్లో ఈ జతలో రెండు ‘ఎక్స్‌’ క్రోమోజోమ్‌లు, పురుషుల్లో ఒక ‘ఎక్స్‌’, ఒక ‘వై’ క్రోమోజోమ్‌ ఉంటాయి. ‘ఎక్స్‌’ క్రోమోజోమ్‌లోని జన్యుకణాల సంఖ్యతో పోల్చుకుంటే, ‘వై’ క్రోమోజోమ్‌లోని జన్యుకణాల సంఖ్య వేగంగా తగ్గిపోతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిణామంపై రకరకాల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాటికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకుందాం.దీనివల్లే పురుషుల్లో వంధ్యత్వం‘వై’ క్రోమోజోమ్‌ క్షీణత వల్లనే పురుషుల్లో వంధ్యత్వం కలుగుతున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా – ‘వై’ క్రోమోజోమ్‌లో ఉన్న జన్యు కణాల్లోని ‘అజూస్పెర్మియా ఫ్యాక్టర్‌’లో (ఏజెడ్‌ఎఫ్‌) ‘మైక్రో డిలీషన్స్‌’ రూపంలో చోటు చేసుకునే క్షీణత పురుషుల్లో వంధ్యత్వానికి కారణమవుతోందని కూడా గుర్తించారు. ‘వై’ క్రోమోజోమ్‌లోని ‘ఏజెడ్‌ఎఫ్‌’ కణాల క్షీణత పురుషుల్లో వంధ్యత్వానికి ప్రధాన కారణంగా ఉంటోందని అమెరికన్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సెయింట్‌ లూయీలోని సెయింట్‌ ల్యూక్స్‌ హాస్పిటల్‌కు చెందిన వైద్య నిపుణులు జరిపిన పరిశోధనల్లో ‘వై’ క్రోమోజోమ్‌లోని జన్యుకణాల్లో పునస్సంయోగానికి అవకాశాలు తక్కువగా ఉండటం వల్లనే ఇందులోని జన్యువులు క్షీణిస్తున్నాయని వెల్లడైంది. ‘వై’ క్రోమోజోమ్‌ క్షీణత వల్ల పురుషుల్లో వంధ్యత్వం మాత్రమే కాకుండా, మరిన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని పలు అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి. వారు చెబుతున్న ప్రకారం ‘వై’ క్రోమోజోమ్‌ క్షీణత వల్ల పురుషుల్లో పెరిగే ఆరోగ్య సమస్యలు ఇవీ:∙‘వై’ క్రోమోజోమ్‌లో ఏర్పడే ‘మొజాయిక్‌ లాస్‌’ వల్ల పురుషుల్లో గుండె కండరాలు బలహీనపడి గుండెజబ్బులు, నాడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి అల్జీమర్స్‌ వంటి నాడీ వ్యాధులు, త్వరగా వార్ధక్య లక్షణాలు సంభవిస్తాయని ఎన్‌ఐహెచ్‌ పరిశోధనలు చెబుతున్నాయి. పురుషుల శరీరంలోని కణాలు ‘వై’ క్రోమోజోమ్‌ను పూర్తిగా కోల్పోయే పరిస్థితినే ‘మొజాయిక్‌ లాస్‌’ అంటారు.∙‘వై’ క్రోమోజోమ్‌ మొజాయిక్‌ లాస్‌ వల్ల శరీరంలోని కండరాల బిగువు సడలిపోవడం, ఎముకల పటుత్వం తగ్గిపోవడం, రోగ నిరోధక కణాలు వేగంగా నశించడం జరిగి అకాల మరణాలు సంభవించే అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని ఎన్‌ఐహెచ్‌ పరిశోధకులు చెబుతున్నారు.అంతరించిపోతే జరిగేదేమిటి?‘వై’ క్రోమోజోమ్‌ పూర్తిగా అంతరించిపోయినట్లయితే, మానవులలో మగజాతి అంతరించిపోతుంది. ఇది వెంటనే జరిగే పరిణామం. ఫలితంగా మానవుల పునరుత్పత్తి నిలిచిపోతుంది. ‘వై’ క్రోమోజోమ్‌లో పురుష లక్షణాల అభివృద్ధికి కీలకమైన ‘ఎస్‌ఆర్‌వై’ (సెక్స్‌ రీజియన్‌ ఆన్‌ ది వై) జన్యువు ఉంటుంది. ఇది నశించినట్లయితే, మానవాళికి తీవ్రమైన అనర్థంగానే భావించవచ్చు. అయితే, జీవపరిణామంలో భాగంగా మానవజాతి పునరుత్పాదలోను, పురుషజాతి లింగనిర్ధారణలోను కొత్త మార్పులు సంభవించవచ్చని, ఇలాంటి మార్పులు కొన్ని ఇతర జంతు జాతుల్లో జరగడాన్ని ఇప్పటికే గమనించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవ పరిణామం ఒక నిదానమైన ప్రక్రియ అని, సుదీర్ఘకాలంలో లింగనిర్ధారణకు కీలకమైన కొత్త జన్యువులు పుట్టుకొచ్చే అవకాశం కూడా ఉంటుందని వారు చెబుతున్నారు. మనుషుల జన్యువులలో ఈ స్థాయి మార్పు జరిగితే, మానవజాతి విభిన్నంగా పరిణామం చెందగలదని అంటున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే అంతరించిపోయినవి అంతరించిపోగా ‘వై’ క్రోమోజోమ్‌లో మిగిలిన జన్యువులను కాపాడుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అంతర్జాతీయ వైద్యపరిశోధకులు చెబుతున్నారు. ‘వై’ క్రోమోజోమ్‌లోని జన్యువులలో జరిగే హానికరమైన ఉత్పరివర్తనలను నిరోధించి, కీలకమైన జన్యువులను కాపాడుకోవడానికి అవసరమైతే జన్యుసవరణ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ‘వై’ క్రోమోజోమ్‌ క్షీణత పురుషుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, దీనివల్ల కొన్నిరకాల క్యాన్సర్లు, గుండెజబ్బులు సహా పలు వ్యాధులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ‘వై’ క్రోమోజోమ్‌ క్షీణతను అరికట్టడానికి, ఇందులోని మిగిలిన జన్యువులు అంతరించిపోకుండా ఉండటానికి మరిన్ని పరిశోధనలు విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ఆ ఎలుకల్లో ఏం జరిగిందంటే?రెండు జాతులకు చెందిన ఎలుకల్లో ‘వై’ క్రోమోజోమ్‌ అంతరించిపోయింది. దాంతోపాటే ‘ఎస్‌ఆర్‌వై’ జన్యువు కూడా అంతరించింది. అయినా వాటి పునరుత్పత్తి నిలిచిపోలేదు. ఇంకా మనుగడ సాగిస్తూనే ఉన్నాయి. అమెరికాలోని మిసోరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ షెరిల్‌ రోజన్‌ఫీల్డ్‌ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు కొద్ది సంవత్సరాల కిందట జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మనుషులు సహా సమస్త స్తన్యజీవుల్లోను మగ జీవుల లింగ నిర్ధారణకు దోహదపడేది ‘వై’ క్రోమోజోమ్‌లోని ‘ఎస్‌ఆర్‌వై’ జన్యువు. మగ జీవుల్లోని పునరుత్పత్తికి కీలకమైనది ‘వై’ క్రోమోజోమ్, అందులోని ‘ఎస్‌ఆర్‌వై’ జన్యువు ‘వై’ క్రోమోజోమ్‌ లేకుండానే, జపాన్‌ తీర ప్రాంతంలో కనిపించే ‘అమామీ స్పైనీ ర్యాట్‌’, ‘ర్యుక్యు స్పైనీ ర్యాట్‌’ అనే జాతులకు చెందిన ఎలుకలు మనుగడ సాగించగలుగుతున్నాయి. ఇవి యథాప్రకారం పునరుత్పత్తి కొనసాగించగలుగుతున్నాయి. వీటిలో ‘వై’ క్రోమోజోమ్‌ పూర్తిగా అంతరించిపోయినా, లింగ నిర్ధారణకు అవసరమైన ప్రత్యామ్నాయ జన్యు ఉత్పరివర్తనలు జరిగాయని, వాటి ఫలితంగానే ఇవి మనుగడ సాగించగలుగుతున్నాయని ప్రొఫెసర్‌ షెరిల్‌ రోజన్‌ఫీల్డ్‌ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ ఎలుకల్లోని ఎక్స్‌ క్రోమోజోమ్‌లోని ‘ఎస్‌ఓఎక్స్‌9’ అనే జన్యువు పురుష లింగనిర్ధారణకు కీలకమైన ‘ఎస్‌ఆర్‌వై’ జన్యువులా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఎలుక జాతుల్లో జరిగిన జన్యు ఉత్పరివర్తనల ఫలితంగా వీటిలో విలక్షణమైన లింగనిర్ధారణ వ్యవస్థ ఏర్పడినట్లు వారు కనుగొన్నారు. యూరోప్‌లో కనిపించే ‘మోల్‌వోల్‌’ అనే ఎలుక జాతిలోనూ ఇదే పరిస్థితిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘మోల్‌వోల్‌’ జాతి ఎలుకల్లో కూడా ‘వై’ క్రోమోజోమ్‌ అంతరించిపోయింది. అయినా, ఇవి కూడా మనుగడ సాగించగలుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో ఇప్పటి వరకు తేలిన ఫలితాల ఆధారంగా ‘వై’ క్రోమోజోమ్‌ అంతరించిపోయినంత మాత్రాన మనుషుల మనుగడకు ముప్పు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ‘వై’ క్రోమోజోమ్‌ అంతరించిపోయిన ఎలుకల్లో మాదిరిగానే మనుషుల్లోనూ ప్రత్యామ్నాయ జన్యు ఉత్పరివర్తనలు జరిగి విలక్షణమైన లింగనిర్ధారణ వ్యవస్థ ఏర్పడవచ్చని భావిస్తున్నారు.పాతికేళ్లుగా పరిశోధనలుమనుషుల్లో ‘వై’ క్రోమోజోమ్‌ క్షీణతపై దాదాపుగా పాతికేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. వేర్వేరు దేశాల శాస్త్రవేత్తలు ఈ అంశంపై వేర్వేరు అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన జెనెటిక్స్‌ ప్రొఫెసర్‌ బ్రియాన్‌ సైక్స్‌ ‘వై’ క్రోమోజోమ్‌ క్షీణతపై ‘ఆడమ్స్‌ కర్స్‌: ఎ ఫ్యూచర్‌ వితౌట్‌ మెన్‌’ అనే పుస్తకాన్ని 2003లో ప్రచురించారు. మనుషుల్లోని ‘వై’ క్రోమోజోమ్‌ జన్యువులు నశిస్తున్న తీరుపై ఆయన విస్తృత పరిశోధనలు జరిపారు. మరో ఐదువేల తరాలు గడిచే నాటికి– అంటే, ఇంకో లక్షా పాతికవేల సంవత్సరాలలోనే మనుషుల్లో ‘వై’ క్రోమోజోమ్‌ పూర్తిగా అంతరించిపోగలదని, భవిష్యత్తులో పురుషులు లేని ప్రపంచం ఏర్పడుతుందని ఆయన తన పుస్తకంలో రాశారు. పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుండటానికి ‘వై’ క్రోమోజోమ్‌ క్షీణతే కారణమని ప్రొఫెసర్‌ బ్రియాన్‌ తన పుస్తకంలో వెల్లడించారు. ‘వై’ క్రోమోజోమ్‌ పూర్తిగా నశించడం వల్ల పురుషులు అంతరించిపోయాక కూడా భూమ్మీద మనుషులు మనుగడ సాగించాలంటే, ఒకే ఒక్క మార్గం ఉంటుందని తెలిపారు. అదేమిటంటే, ఒక ‘ఎక్స్‌’ క్రోమోజోమ్‌తో మహిళల అండాలను ఫలదీకరించి, ‘ఇన్‌ విట్రో ఫర్టిలైజేషన్‌’ (ఐవీఎఫ్‌) పద్ధతి ద్వారా మాత్రమే మనుషుల్లో పునరుత్పత్తి సాధ్యం కాగలదని అభిప్రాయపడ్డారు. బ్రియాన్‌ తన పుస్తకంలో వెల్లడించిన అభిప్రాయాలపై ఇప్పటికీ విస్తృతంగా చర్చ జరుగుతోంది. మరోవైపు మనుషుల్లో ‘వై’ క్రోమోజోమ్‌ క్షీణతపై కూడా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, కొందరు పరిశోధకులు ‘వై’ క్రోమోజోమ్‌ క్షీణత గురించి అనవసరంగా అతిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ‘వై’ క్రోమోజోమ్‌ పూర్తిగా నశించినంత మాత్రాన భూమ్మీద మానవాళి మనుగడ పూర్తిగా అంతరించిపోతుందని చెప్పలేమని ఇంకొందరు పరిశోధకులు చెబుతున్నారు. పురుషుల్లో ‘వై’ క్రోమోజోమ్‌ పూర్తిగా క్షీణించే పరిస్థితి తలెత్తితే, అందుకు ప్రత్యామ్నాయ జన్యు ఉత్పరివర్తనలు కూడా జరుగుతాయని, ఆ ఉత్పరివర్తనలు పునరుత్పత్తిని కొనసాగించగలవని అమెరికన్‌ జన్యు పరిశోధకులు జె.విల్సన్, జె.ఎం.స్టాలీ, జి.జె.వైకాఫ్‌ ‘నేచర్‌’ పత్రికలో రాసిన ఒక వ్యాసంలో తెలిపారు. ‘వై’ క్రోమోజోమ్‌ లేకున్నా, ఎలుక జాతులు మనుగడ సాగిస్తున్నట్లుగానే, మనుషులు కూడా మనుగడ సాగించగలరని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘వై’ క్రోమోజోమ్‌ క్షీణతమానవజాతి మనుగడ మొదలైనప్పుడు పురుషుల్లోని ‘వై’ క్రోమోజోమ్‌లో 1438 జన్యుకణాలు ఉండేవి. ఇప్పుడు వాటిలోని 1383 జన్యుకణాలు అంతరించిపోయాయి. ఇప్పుడు ‘వై’ క్రోమోజోమ్‌లో మిగిలినవి 55 జన్యుకణాలు మాత్రమే! దాదాపు 30 కోట్ల సంవత్సరాల వ్యవధిలో ఈ క్షీణత సంభవించింది. ఈ లెక్కన సగటున ప్రతి పదిలక్షల సంవత్సరాలకు ‘వై’ క్రోమోజోమ్‌లోని 4.6 జన్యుకణాలు అంతరించిపోతున్నాయి. ఇదే రీతిలో ‘వై’ క్రోమోజోమ్‌ క్షీణత కొనసాగితే, మరో కోటి సంవత్సరాలలో పూర్తిగా అంతరించిపోతుంది. నిజానికి 16.6 కోట్ల సంవత్సరాల కిందటి వరకు ‘ఎక్స్‌’ క్రోమోజోమ్‌లోను, ‘వై’ క్రోమోజోమ్‌లోను జన్యువులు సరిసమానంగా ఉండేవి. పరిణామక్రమంలో ‘వై’ క్రోమోజోమ్‌లో జన్యువులు క్రమంగా కనుమరుగవడం మొదలైంది. ప్రస్తుతం ‘వై’ క్రోమోజోమ్‌లో 55 జన్యువులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మానవజాతి మనుగడ మొదలైన తర్వాత గడచిన కోట్లాది సంవత్సరాలలో జరిగిన ఉత్పరివర్తనల పర్యవసానంగా ‘వై’ క్రోమోజోమ్‌లోని జన్యుకణాలు ప్రస్తుత స్థితికి క్షీణించాయి.

Shah Rukh Khan As Brand Ambassador of Candere9
ఒకే ఇంట్లో షెహన్‌షా, బాద్‌షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్

ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ 'షారుక్ ఖాన్‌'ను కందేరే ప్రీమియం లైఫ్‌స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్‌తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్‌కు, మరోవైపు ఆధునికత, డిజైన్‌పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్‌కు షారుక్ ఖాన్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్‌గా 75కి పైగా రిటైల్ అవుట్‌లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్‌స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్‌షా (బచ్చన్) మరియు బాద్‌షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది.

Weekly Horoscope In Telugu From 25-05-2025 To 31-05-202510
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం....ఏ వ్యవహారమైనా చక్కదిద్ది ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊరట చెందే ప్రకటన రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గవచ్చు. కళారంగం వారికి శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. గులాబీ, నేరేడు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.వృషభం...చేపట్టిన పనులలో కొంత ఇబ్బంది ఏర్పడినా అధిగమిస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కొంత మెరుగుపడుతుంది. అయితే ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణాలపై ప్రతిష్ఠంభన తొలగుతుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన సమయం. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. గులాబీ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.మిథునం...మధ్యలో కొన్ని సమస్యలు, వివాదాలు ఎదురైనా మనోధైర్యంతో అధిగమిస్తారు. పట్టుదల మరింత పెరుగుతుంది. అనుకున్న పనులు సజావుగా సాగేందుకు కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఇంతకాలం నైరాశ్యంలో ఉన్న మీకు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి విషయాలు నెమరువేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వారం మధ్యలో బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. పసుపు, నేరేడురంగులు. గణేశాష్టకం పఠించండి.కర్కాటకం....నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో విధుల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. శ్రీమహావిష్ణుధ్యానం పఠించండి.సింహం....మొదట్లో వివాదాలు, సమస్యలు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మలచుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పనిభారం కాస్త తగ్గుతుంది. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో విభేదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.కన్య...కొత్త పనులు చేపట్టి విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు కొంత తీరే సమయం. బంధువుల సలహాలు కొన్ని స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు కష్టానికి ఫలితం దక్కుతుంది. గృహయోగం. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు దక్కించుకుంటారు. కళారంగం వారికి యత్నకార్యసిద్ధి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఎరుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.తుల....మీ శ్రమకు తగిన ఫలితం దక్కే సమయం. అనుకున్న వ్యవహారాలను పూర్తి చేయడంలో స్వశక్తిపైనే ఆధారపడతారు. ఆప్తుల నుంచి పిలుపు రావడంతో ఉత్సాహంగా గడుపుతారు. భూవివాదాలు పరిష్కారమయ్యే సూచనలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. బంధువులను కలుసుకుని మీ భావాలను వెల్టడిస్తారు. ఇంటి నిర్మాణాల్లో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, వివాదాలు సర్దుకుంటాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.వృశ్చికం...ఏ పనినైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. అయితే మధ్యలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా అధిగమిస్తారు. ఎదురుచూస్తున్న ఒక అవకాశాలు మాత్రం చేజారే వీలుంది. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలించి రుణబాధలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందాన్ని పంచుకుంటారు. నిరుద్యోగులకు నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తగ్గే అవకాశం ఉంది. పారిశ్రామికవర్గాల యత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. తెలుపు, నేరేడు రంగులు. శ్రీసూర్యప్రార్ధన మంచిది.ధనుస్సు...మధ్యమధ్యలో కొన్ని చికాకులు ఎదురైనా తట్టుకుని నిలబడతారు. మీ ఆలోచనలకు మరింత పదునుపెడతారు. ఎటువంటి పనులైనా నేర్పుగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పొందుతారు. భూవివాదాలు కొలిక్కి వచ్చే అవకాశం. మిత్రులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పెండింగ్‌లో ఉంచిన పెళ్లి మాటలు సఫలమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు. కళారంగం వారి ఆశలు కొన్ని నెరవేరతాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఆప్తులతో విభేదాలు. ఎరుపు, నీలం రంగులు. హయగ్రీవ ధ్యానం చేయండి.మకరం....నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలపై బంధువులతో చర్చిస్తారు. ఆర్థిక విషయాలు మరింత మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. తెలుపు, గులాబీ రంగులు. శివాష్టకం పఠించండి.కుంభం...అందరిలోనూ మీ మాటకు ఎదురుండదు. ముఖ్యమైన పనులు చకచకా పూర్తి చేస్తారు. కొంతకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు. లక్ష్యాల సాధనలో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు శుభవర్తమానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ పుంజుకుంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి చేయూతనిస్తారు. వివాహాది వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరణ పూర్తి చేస్తారు. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారికి కొంత వరకూ సానుకూలం. వారం మధ్యలో మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. శ్రీకృష్ణస్తుతి మంచిది.మీనం....ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యయప్రయాసలు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఒత్తిడులు ఎదురుకావచ్చు. విద్యార్థులకు శ్రమాధిక్యం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. బంధువుల వైఖరితో మనస్తాపం చెందుతారు. వ్యాపారాలు స్వల్ప లాభిస్తాయి. విస్తరణ కార్యక్రమాలలో కొంత జాప్యం. ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలు ఆచితూచి అడుగువేయడం మంచిది. వారం మధ్యలో శుభవార్తలు. నూతన ఉద్యోగయోగం. ఆస్తిలాభం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement