Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Chandrababu Govt One Year Rule By Vardhelli Murali1
ఏడాది పాలన పొట్ట విప్పి చూడ..!

చంద్రబాబు అనే నాలుగు అక్షరాలకు అర్థమూ, తాత్పర్యమూ, నిర్వచనమూ అన్నీ కూడా అభివృద్ధేనని యెల్లో మీడియా మనకు ఎప్పటి నుంచో నేర్పిస్తున్నది. ముప్పయ్యేళ్ల లోపు వయసున్న తరానికైతే దొండాకు పసరు నాడే ఈ వసను కూడా కలిపి తాగించారు. అటువంటి రెండు కాళ్ల మీద నడిచే అభివృద్ధి నాలుగోసారి కుర్చీ ఎక్కి సంవత్సరకాలం పూర్తవు తున్నది. ఈ ఏడాది కాలంలో విరగబూసిన అభివృద్ధిని కళ్లారా వీక్షించాలన్న కోరిక ఎవరికి మాత్రం ఉండదు? ఆ వీక్షణ కోసం కొన్ని ‘వ్యూ పాయింట్స్‌’ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి.హిందూపూర్‌ రైల్వే స్టేషన్‌ కూడా ఒక వ్యూ పాయింట్‌.హిందూపూరంటే చంద్రబాబు పార్టీకి కంచుకోట కదా! ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఓటమి చవిచూడలేదట! పైగా ముఖ్యమంత్రికి స్వయానా బావమరిది ప్లస్‌ వియ్యంకుడు ప్లస్‌ మాస్‌ మసాలా హీరో – బాక్సాఫీస్‌ బొనాంజా బాలయ్యబాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇంత బిల్డప్‌ ఉన్నచోట అభివృద్ధి దద్దరిల్లకుండా ఉంటుందా? ఉదయం నాలుగున్నర నుంచి రెండు గంటలసేపు ఆ స్టేషన్‌లో నిలబడితే రైలు కూత వాయిస్‌లో అభివృద్ధి సౌండ్‌ వినిపిస్తుంది.బెంగళూరు నగరంలోని ఇళ్లలో పాచి పనులు చేసేందుకు, వీధుల్లో మూటలు మోసేందుకూ, ఇంకా ఇతర పనుల కోసం దాదాపు మూడు వేలమంది దాకా రోజూ అక్కడ ప్యాసింజర్‌ బండ్లెక్కి వెళుతున్నారు. ఇలా ప్రతిరోజూ వెళ్లి పనిచేసుకుని రావడం కొత్తేమీ కాదు. కాకపోతే ఏడాది కిందట వీరి సంఖ్య ఆరేడు వందలు దాటేది కాదు. ఈ ఏడాదిలో క్రమంగా మూడు వేల మార్కుకు చేరుకున్నది. ఈ పెరుగుదలను ఏడాది పాలన అభివృద్ధి ఖాతాలోనే కదా వేయాల్సింది. రోజువారీ చాకిరీ ముగిసిన తర్వాత మళ్లీ రైలు బండెక్కి రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఇంటికి చేరుకుంటారు. మళ్లీ పొద్దున మూడు గంటలకే లేచి ఇంటి పనులు పూర్తి చేసుకుంటేనే... స్టేషన్‌లో బతుకు బండిని అందుకోగలుగుతారు.మహానగరానికి సమీపంలో ఉన్నందువలన హిందూపూర్‌ వలసల్లో డైలీ షటిల్‌ పద్ధతి కనిపిస్తున్నది. ఆ సమీపంలోనే ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలోనైతే మూడో వంతు జనాభా మాత్రమే మిగిలిపోయిన గ్రామాలు కూడా ఉన్నాయి. అలా మిగిలిపోయిన వాళ్లలో వృద్ధులూ, పిల్లలే ఎక్కువ. భవన నిర్మాణ రంగంలో పనిచేయడానికి నెల్లూరు నగరంలో స్థిరపడ్డ కార్మికుల్లో ఇరవై వేలమంది ఈ మధ్యకాలంలోనే పట్టణం వదిలి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ వలసలపై గ్రామ సచివాలయాల సర్వేను ఆధారం చేసుకొని ఇటీవల ‘ప్రజాశక్తి’ పత్రిక ఒక కథ నాన్ని ప్రచురించింది. దానిప్రకారం ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంతగా వలసలు పెరిగాయి. గణనీయ సంఖ్యలో జనం వలస బాట పట్టారు.వలసలన్నీ అభివృద్ధికి వ్యతిరేకమైనవి కావు. మెరుగైన జీవితం కోసం, నైపుణ్యతకు తగిన ఉపాధి కోసం, ఉన్నతో ద్యోగాల కోసం నిరంతరం వలసలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి వలసలను ప్రగతిశీలమైనవిగానే పరిగణిస్తారు. కానీ ఈ సంవత్సరం ఈ తరహా వలసల సంఖ్య చాలా తక్కువనీ, బతుకుదెరువు వలసలే ఎక్కువనీ సర్వే సారాంశమట! వ్యవ సాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, రైతన్నలకు చేసిన హామీలను ఎగవేయడం, కరువు పరిస్థితులు, ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన బిల్లులు ఆపేయడం, నిర్మాణరంగం పూర్తిగా కుదేలవడం వంటి కారణాలు పెద్ద ఎత్తున వలసలకు కారణమయ్యాయి.తొలి ఏడాది అభివృద్ధికి సంబంధించి పెరిగిన వలసలు ఒక కొలమానమైతే, అధికారిక లెక్కలు వెల్లడించే డాక్యుమెంట్లు మరో బలమైన సాక్ష్యంగా ఉంటాయి. ఇదిగో ఈ సాక్ష్యాలను ముందుపెట్టుకొనే వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర యథార్థ పరిస్థితులను మీడియా సమావేశం ద్వారా మొన్న జనం ముందు ఉంచారు. ఈ సమావేశంలో తన పార్టీ వాళ్లు తయారుచేసిన నివేదికల ఆధారంగా ఆయన మాట్లాడలేదు. ప్రభుత్వం తయారుచేసిన బడ్జెట్‌ పత్రాల్లోని లెక్కల్ని ఆధారంగా చేసుకునే మాట్లాడారు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రిపోర్టుల్లోని విషయాలపైనే మాట్లాడారు. ‘కాగ్‌’కు తన ప్రమాణాలను పాటించడం తప్ప ఎటువంటి పక్షపాత ధోరణీ ఉండదనేది తెలిసిందే. తప్పొప్పులను తూర్పారపట్టడమే దాని పని. ఈ లెక్కల ఆధారంగానే కూటమి సర్కార్‌ మాటల్లోని కపటత్వాన్నీ, వారి ప్రచారాల్లోని డొల్లతనాన్నీ ఆయన చీల్చి చెండాడారు. ప్రభుత్వంపై ఆయన చేసిన దాడి ఎంత సాధికారికంగా, ఎంత శక్తిమంతంగా జనంలోకి వెళ్లిందంటే... మూడు రోజులు గడిచినా సర్కార్‌ వైపు నుంచి ఏ ఒక్కరూ ప్రతిపక్ష నేతకు సమాధానమిచ్చేందుకు ముందుకు రాలేకపోయారు. కొన్ని పిల్లి అరుపులు వినిపించడం, కొన్ని కుప్పిగంతులు కనిపించడం తప్ప!మూలధన వ్యయం పెరుగుదలను ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి గుర్తుగా పరిగణిస్తారు. ఆర్థిక వ్యవస్థపై నమ్మకానికీ, ఉద్యోగాల కల్పనకూ, జీడీపీ ఉద్దీపనకూ ఈ మూలధన వ్యయం దోహదపడుతుంది. మరి, అభివృద్ధికి పర్యాయపదంగా యెల్లో మీడియా పలవరించే చంద్రబాబు తొలి ఏడాదిలో ఈ మూల ధన వ్యయం ఏ మేరకు పెరిగింది? పెరగలేదు సరికదా,అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 17.80 శాతం తగ్గిందని ‘కాగ్‌’ నివేదికలోని అంశాన్ని జగన్‌ జనం ముందు పెట్టారు. జగన్‌ ప్రభుత్వపు చివరి సంవత్సరంలో మూలధన వ్యయం రూ. 23,330 కోట్లయితే చంద్రబాబు తొలి సంవత్సరం అది రూ. 19,177 కోట్లు మాత్రమేనని ‘కాగ్‌’ కుండబద్దలు కొట్టింది.స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏటికేడు పెరుగుతుంటేనే అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు! కానీ గత సంవత్సరంతో పోలిస్తే చంద్రబాబు తొలి సంవత్సరంలో ఈ ఆదాయం 7.39 శాతం తగ్గింది. జగన్‌మోహన్‌రెడ్డి జనం ముందుంచిన ప్రభుత్వ గణాంకాల్లో అత్యంత ఆసక్తికరమైనది ఎక్సైజ్‌ ఆదాయం.ఎందుకంటే అంతకుముందు కంటే మద్యం షాపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి మద్యం షాపుకు అనుబంధంగా ఓ పర్మిట్‌ రూమ్‌ తయారైంది. ఇక బెల్ట్‌షాపుల సంఖ్య నలభై వేలు దాటింది. ఒక్కో బెల్ట్‌షాపు అనధికార పాటల్లో పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు పలికిందని వార్తలొచ్చాయి. బెల్ట్‌షాపుల కేటాయింపులోనే నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల మేరకు అనధికారిక డీల్‌ కనబడుతుంటే... ప్రభుత్వానికి పెరిగిన ఎక్సైజ్‌ ఆదాయం కేవలం రూ. 3,800 కోట్లు మాత్రమే!ఇక ఈ 40 వేల పైచిలుకు బెల్ట్‌ షాపుల్లో అమ్మిన సరుకెంత? వచ్చిన ఆదాయమెంత? 4,400 మద్యం దుకాణాల్లో, వాటికి అనుబంధంగా కొత్తగా వెలసిన పర్మిట్‌ రూమ్‌ల సౌకర్యంతో పెరిగిన అమ్మకాలెన్ని? వచ్చిన ఆదాయమెంత? మద్యం దుకాణాలు, పర్మిట్‌ రూమ్‌లు, బెల్ట్‌షాపులు, బార్లు రౌండ్‌ ది క్లాక్‌ చేస్తున్న వ్యాపారం వల్ల పెరిగిన ఆదాయమెంత? ఇదంతా ఎవరి జేబుల్లోకి వెళుతున్నది? లేని స్కామ్‌పై నెలల తరబడి చేసిన దుష్ప్రచారం తర్వాత ఇప్పుడు ఎవరూ మాట్లాడొద్దని చంద్రబాబు చల్లగా ఆదేశాలివ్వడం వెనుక రహస్యమేమిటి? ఆధారాలు తుడిచేశారని ‘ఈనాడు’, దర్యాప్తు ఇప్పుడప్పుడే పూర్తి కాదని ‘ఆంధ్రజ్యోతి’ రాయడం వెనుక మర్మమేమిటి? ఇప్పుడు నడిపిస్తున్న విశృంఖల అవినీతి బయటికొస్తుందేమోనని భయ పడుతున్నారా? కేవలం 24 శాతం పెరుగుదలనే నమోదు చేసిన ఎక్సైజ్‌ ఆదాయం తీగ అవినీతి డొంకను కదిలించింది.సంపద సృష్టికర్తగా స్వీయ కీర్తనలు చేసుకొని, యెల్లో మీడియా కితాబులందుకునే చంద్రబాబు తొలి ఏడాది పాలనలో రాష్ట్ర సొంత వనరుల ద్వారా పెరిగిన ఆదాయం కేవలం 3.08 శాతం మాత్రమే! అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయం 13.76 శాతం పెరిగింది. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ఆదాయం 12 శాతం పెరిగింది. అప్పుల్లో మాత్రం 30 శాతం అదనంగా చంద్రబాబు ప్రభుత్వం హైజంప్‌ చేసింది. ఇది బడ్జెటరీ అప్పుల సంగతే! అమరావతి అప్పులు, ఇతరత్రా అప్పులు వేరే ఉన్నాయి. అయిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 41 శాతాన్ని చంద్రబాబు సర్కార్‌ తొలి సంవ త్సరంలోనే చేసేసిందని జగన్‌మోహన్‌రెడ్డి ఆధారసహితంగా జనం ముందు పెట్టారు. ఒకపక్క అప్పులు పెరుగుతున్నాయి. అవినీతి మహమ్మారి మాదిరిగా విస్తరిస్తున్నది. అభివృద్ధి మృగ్యమైందని సాక్ష్యాలు చెబుతున్నాయి. మరి సంపద సృష్టికీ, అభివృద్ధికీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా చెప్పుకునే అయ్యవారు ఏం చేస్తున్నారయ్యా అంటే ఆయన తైనాతీలు, భజంత్రీలు అమరావతి వంక చూపెడుతున్నారు. అసలా అమరావతి నిర్మాణమే అతి పెద్ద స్కామ్‌గా గణాంకాల సహితంగా జగన్‌ నిరూపించారు.గతంలో పిలిచిన టెండర్లను, అసాధారణ రీతిలో పెంచి పిలవడం వెనుక, టెండర్లు దక్కించుకున్న వారికి మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇప్పించడం వెనుకనున్న మర్మం కమీషన్లు దండుకోవడం కాదా అని ప్రశ్నించారు. సచివాలయం, హెచ్‌ఓడీ భవనాలను 53 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించడంలోని ఔచిత్యాన్నీ, చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ. 8,931గా నిర్ణయించడంలో లోగుట్టునూ కూడా ఆయన ప్రశ్నించారు.అమరావతి నిర్మాణం పేరుతో ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగూ అనుమానాస్పదంగానే ఉన్నది. ఎన్నికలకు ముందు రాజధానికి ప్రభుత్వం పైసా ఖర్చు చేయనవసరం లేదని చెప్పారు. భూముల అమ్మకం ద్వారానే నిర్మాణం పూర్తి చేయొచ్చనీ, ఆ రకంగా అది సెల్ఫ్‌ ఫైనాన్స్‌ నగరమనీ ప్రచారం చేసిన సంగతి ఎవరూ మరచిపోలేదు. ఇప్పుడేమో తొలిదశ 50 వేల ఎకరాలకే రూ.80 వేల కోట్లు కావాలని చంద్రబాబు చెబుతున్నారు. అందులో 30 వేల కోట్లు ఇప్పటికే అప్పుగా తెచ్చారు. మరో 45 వేల ఎకరాలతో రెండో దశ భూసమీకరణ కూడా జరుగుతుందట! ఈ లెక్కన రాజధాని నగరానికి రెండు లక్షల కోట్ల దాకా ఖర్చు పెట్టవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ నిర్మాణం పూర్తయ్యే సరికి తడిసి మోపెడవుతుందని జగన్‌మోహన్‌రెడ్డి కూడా హెచ్చరించారు. భూముల అమ్మకాలు జరిపినా అప్పులు తీర్చలేరని, చివరికి రాష్ట్ర ప్రజలపై అమరావతి ఒక గుదిబండ కాబో తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చౌకగా వసతి సౌకర్యాలు, అపారంగా ఉపాధి అవకాశాలను సృష్టించ గలిగితేనే ఆ నగరం నెమ్మదిగా ఒక రూపు తీసుకుంటుంది. రోమ్‌ నగరం ఒక్కరోజులో నిర్మితం కాలేదన్న సామెతకు ఒక అర్థం ఉన్నది.ఒక భారీ సంకల్పం నెరవేరాలంటే కావాల్సినంత సమ యం, సహనం, నిరంతర ప్రయత్నం, అంకితభావం ఉండాలి. అమరావతి ప్రాంతం ఇప్పటికే సామాన్యులకు అందు బాటులో లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఈ ప్రాంతంలో జగన్‌ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయిస్తే రాజధాని సమతుల్యత దెబ్బతింటుందని చంద్రబాబు బృందం కోర్టుకెక్కిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇటువంటి చోట ఎంత ప్రయాసపడ్డా వచ్చే పదేళ్లలో మరో మహానగరం కాదు, ఇంకో మంగళగిరి కూడా ఆవిర్భవించదు! ఏడాది కాలంలో ప్రజా సంక్షేమం పూర్తిగా పడకేసింది. అభివృద్ధి అలికిడే లేదు. అవినీతి విశ్వరూపం దాల్చింది. రాజకీయాల్లో ఒక అరాచక బర్బర సంస్కృతిని ప్రవేశపెట్టారు. ప్రత్యర్థులను వేటాడుతూ భయానక పాలనకు తెరతీశారు. ఈ రకంగా ప్రత్యర్థుల నోళ్లు నొక్కాలని ప్రయత్ని స్తున్నారు. శిరస్సుల మీద అప్పుల కిరీటాన్ని ధరించి, మెడలో అవినీతి మాల వేసుకొని, చేతులకు ప్రత్యర్థుల నెత్తురు పులుము కొని ఏడాది ఉత్సవాల పల్లకీలపై ఏలికలు ఊరేగబోతున్నారు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Centre, and states work together like Team India says PM Narendra Modi2
మనమంతా టీమిండియా

న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాలను ‘టీమిండియా’గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అవి కలసికట్టుగా పని చేస్తే ఏ అభివృద్ధి లక్ష్యమూ అసాధ్యం కాబోదని ధీమా వెలిబుచ్చారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ పాలక మండలి 10వ భేటీకి ఆయన సారథ్యం వహించారు. వికసిత భారత్‌–2047 థీమ్‌తో భేటీ సాగింది. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులు భేటీలో పాల్గొన్నట్టు నీతి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రమణ్యం వెల్లడించారు. పశ్చిమబెంగాల్, బిహార్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు పాల్గొనలేదని తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమవడం ఇదే తొలిసారి. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రం ఏర్పాటయ్యేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. పహల్గాం ఉగ్ర దాడి లక్ష్యాల్లో జమ్మూకశీ్మర్‌లో పర్యాటకాన్ని దెబ్బ తీయడం కూడా ఉన్న నేపథ్యంలో ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘ప్రతి గ్రామం, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి నగరం, ప్రతి రాష్ట్రమూ ప్రగతి సాధించడమే మన లక్ష్యం కావాలి. అప్పుడు దేశమంతా దానంతటదే వృద్ధి చెందుతుంది. గడువు లోపలే వికసిత భారత్‌ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఆ దిశగా అభివృద్ధి పనుల వేగం మరింత పెంచుదాం. 140 కోట్ల పైచిలుకు భారతీయుల ఆకాంక్షలను నెరవేరుద్దాం’’ అని రాష్ట్రాలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారత్‌లో పట్టణీకరణ శరవేగంగా సాగుతోందని గుర్తు చేశారు. కనుక నగరాలను సుస్థిరాభివృద్ధి, ఇన్నోవేషన్ల కలబోతగా, భవిష్యత్‌ అవసరాలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ‘‘మహిళా శక్తికి మరింత ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే మనమంతా ఆశించిన విధంగా దేశప్రగతి సాధ్యపడుతుంది. శ్రామిక శక్తిలో మహిళలను మరింతగా భాగస్వాములను చేయాలి. అందుకు అనుగుణంగా చట్టాలు, విధానాలను రూపొందించుకోవాలి’’ అని మోదీ చెప్పారు.కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 50 శాతం: సీఎంలుకేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచాలని తమిళనాడు, పంజాబ్‌ ముఖ్యమంత్రులు ఎం.కె.స్టాలిన్, భగవంత్‌ మాన్‌ డిమాండ్‌ చేశారు. ‘‘రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇస్తామని మాటిచ్చారు. కానీ 33.16 శాతమే ఇస్తున్నారు. తమిళనాడు దేశంలోకెల్లా అత్యంత పట్టణీకరణ చెందిన రాష్ట్రం. అమృత్‌ 2.0 పథకం కింద రాష్ట్రానికి ప్రత్యేక పట్టణీకరణ మిషన్‌ను మంజూరు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. నమామి గంగ తరహాలో తమిళనాడులోని కావేరీ, వైగే తదితర నదుల ప్రక్షాళనకు ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేయాలి’’ అని స్టాలిన్‌ కోరారు. ఆ ప్రాజెక్టులకు పేర్లను ఇంగ్లిష్లోనే పెట్టాలన్నారు. పంజాబ్‌లో పాకిస్తాన్‌ను ఆనుకుని ఉండే ఆరు సరిహద్దు జిల్లాలకు ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీ అందించాలని కేంద్రానికి మాన్‌ విజ్ఞప్తి చేశారు. సరిహద్దు ప్రాంతాల రైతులకు ఇస్తున్న ఎకరాకు రూ.10 వేల పరిహారాన్ని రూ.30 వేలకు పెంచాలన్నారు. సిక్కిం, పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలను కలుపుతూ ప్రపంచస్థాయి జాతీయ రహదారి నిర్మించాల్సిన అవసరం చాలా ఉందని సిక్కిం సీఎం ప్రేంసింగ్‌ తమాంగ్‌ అన్నారు.విధాన అడ్డంకులు తొలగించాలన్నారు: సీఈఓ భేటీ వివరాలను నీతి ఆయోగ్‌ సీఈఓ సుబ్రమణ్యం మీడియాకు వెల్లడించారు. ‘‘వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై మరింతగా దృష్టి సారించాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. పెట్టుబడులను మరింతగా ఆకర్షించాలని, తద్వారా ఇతోధికంగా ఉపాధి అవకాశాలను సృష్టించాలని, అందుకోసం విధానపరమైన అడ్డంకులను తొలగించుకోవాలని హితవు పలికారు’’ అని చెప్పారు. భేటీలో పాల్గొన్న సీఎంలు, నేతలు ఆపరేషన్‌ సిందూర్‌ను ముక్తకంఠంతో సమరి్థంచారన్నారు. జైరాంతో కాంగ్రెస్‌కే చేటు: బీజేపీ నీతి ఆయోగ్‌ ఓ ‘అయోగ్య’ (అసమర్థ) సంస్థ అన్న కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ విమర్శలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్‌కే చేటు చేసే వివాదాలను సృష్టించడం ఆయన నైజమని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్‌ను జైరాం భూస్థాపితం చేయడం ఖాయమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ జోస్యం చెప్పారు.నవ్వుల్‌ పువ్వుల్‌ ఆయోగ్‌ భేటీలో సరదా సన్నివేశాలు ప్రధాని, ముఖ్యమంత్రుల నడుమ పలు సరదా సన్నివేశాలకు నీతి ఆయోగ్‌ భేటీ వేదికైంది. సమావేశం ముగిశాక రేవంత్‌రెడ్డి, స్టాలిన్‌ తదితరులతో మోదీ సరదా సంభాషణలు జరిపారు. నవ్వుతూ, వారిని నవి్వస్తూ కని్పంచారు. భగవంత్‌ మాన్‌ (పంజాబ్‌), హేమంత్‌ సోరెన్‌ (జార్ఖండ్‌), కొన్రాడ్‌ సంగ్మా (నాగాలాండ్‌) తదితరులు మోదీతో చాలాసేపటిదాకా కరచాలనం చేస్తూ కన్పించారు. వారితో ప్రధాని సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా నేతలంతా తేనీరు సేవిస్తూ ఉల్లాసంగా గడిపారు.

Shah Rukh Khan As Brand Ambassador of Candere3
ఒకే ఇంట్లో షెహన్‌షా, బాద్‌షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్

ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ 'షారుక్ ఖాన్‌'ను కందేరే ప్రీమియం లైఫ్‌స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్‌తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్‌కు, మరోవైపు ఆధునికత, డిజైన్‌పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్‌కు షారుక్ ఖాన్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్‌గా 75కి పైగా రిటైల్ అవుట్‌లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్‌స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్‌షా (బచ్చన్) మరియు బాద్‌షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది.

Sakshi Guest Column On Maoists eradication just for sake of corporates4
కార్పొరేట్ల కోసమే ఈ నిర్మూలనా?

‘ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వంద లాది గ్రామాలలో వేలాది రైతుల నుండి వ్యవసాయ శాస్త్రవేత్త డా‘‘ రిఛారియా 22,000 లకు పైగా వరి వంగడాలను, 1,800లకు పైగా ఆకుకూరలను సేకరించి వాటి జర్మ్‌ ప్లాస్క్‌ను రాయ్‌పూర్‌లోని ‘ఇందిరా గాంధీ జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం’లో 1950, 1960లలో భద్రపరిచారు. ఇందులో తక్కువ నీటితో పండేవి, తక్కువ గడ్డినిచ్చేవి, ఎక్కువ గడ్డినిచ్చేవి, సువాసనలు వెదజల్లేవి, పొడవైన– పొట్టి రకాలు, ఏ కాలంలోనైనా పండే అనేక వంగడాలు ఉన్నాయి. అయితే మన దేశ దళారీ పాలకుల కుమ్మక్కుతో ఈ వరి వంగడాల జర్మ్‌ ప్లాస్క్‌ను అమెరికా తదితర దేశాల బహుళజాతి కంపెనీలు దొంగిలించుకు పోయాయి. మనీలాలోని ‘ఇంటర్నేషనల్‌ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌ స్టిట్యూట్‌’ (ఐఆర్‌ఆర్‌ఎ)లలో అభివృద్ధి చేశామని చెప్తూ ఇలా దొంగిలించుకు పోయిన వంగడాలను వివిధ పేర్లతో (ఐఆర్‌–36, ఐఆర్‌–72 తదితర) బహుళజాతి కంపెనీలు భారత్‌ లాంటి అనేక దేశాల్లో అమ్ముకుని భారీగా లాభాలు గడిస్తున్నాయి. విత్తనాల కోసం భారతదేశ రైతులు ప్రతి సంవత్సరం బహుళజాతి కంపెనీలపై ఆధారపడేలా చేస్తు న్నారు...’ ఈ మాటలు విదేశీ జర్నలిస్టు అల్ఫ్‌ బ్రెనన్‌ కు 2022లో ఇచ్చిన ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూలో మావోయిస్టు కేంద్ర ప్రధాన కార్యదర్శి బసవరాజువి. ఈ దేశ ప్రజల పరంపరాగత జ్ఞానం పట్ల, దేశీయత పట్ల, వనరుల పట్ల ఆయన వైఖరిని సూచించే మాటలు ఇవి.దేశభక్తి అనే ఒక్క మాటతో ఈ రోజు అందరినీ శిలువ ఎక్కించి పరీక్షిస్తున్నారు. కానీ నిజంగానే దేశం పట్ల ప్రేమ ఉంటే ఎలా ఆలోచించాలో బసవరాజు చేసిన ఈ సూక్ష్మ పరిశీలన తెలియజేస్తోంది. జాతీయత పేరుతో మావోయిస్టు నిర్మూలనను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న తరుణంలో ఏది దేశభక్తి, ఏది ప్రజల మీది ప్రేమ అనే చర్చ జరగలవసి ఉన్నది.మావోయిస్టుల ఆలోచనలు విదేశీయమని కొందరు చెబుతుంటారు. మావోయిస్టుల వల్ల ఈ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, అభివృద్ధికి వాళ్లు ఆటంకంగా ఉన్నారని అంటున్నారు. కానీ కొద్దిగా ఈ దేశ రాజకీయార్థిక వ్యవహారాలను పరిశీలిస్తే ఎవరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నదీ అర్థమవుతుంది. గతంలో కంటే తీవ్రంగా అభివృద్ధి అనే మాట ఇప్పుడు చలామణీలోకి వచ్చింది. కానీ ఇది ఎవరి అభివృద్ధి అనేది అతి ముఖ్యమైన ప్రశ్న.ఏడాదిన్నరగా మావోయిస్టు నిర్మూలన పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ‘ఆపరేషన్‌ కగార్‌’ కేవలం సైనిక చర్య కాదు. అభివృద్ధి నమూనా కేంద్రంగా సాగుతున్న రాజకీయార్థిక యుద్ధం. సరిహద్దుల కోసం పక్క దేశ ప్రజలపై యుద్ధం చేసే భారత ప్రభుత్వం అభివృద్ధి నమూనా విషయంలో జరుగుతున్న సంఘర్షణను అంతర్యుద్ధంగా మార్చేసింది. తన దేశ ప్రజల మీదే దండయాత్ర చేస్తోంది. యుద్ధాల్లో ఆయుధాలు, విమానాలు, డ్రోన్‌ లు చేసే వికృత ధ్వనుల వెనుక రాజకీయార్థిక విధ్వంసాలు ఉంటాయి.కగార్‌ పేరుతో అదే జరుగుతోంది. అందుకే మావోయిస్టు ప్రభా విత మధ్య భారత రాష్ట్రాల్లో హత్యాకాండ ఆపాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆదివాసుల జీవించే హక్కు, రాజ్యాంగం ఇచ్చిన రక్షణ చట్టాల చర్చగానే ఇది ముగిసి పోవడం లేదు. ఈ రక్తపాతం వెనుక ఉన్న పాలకుల అభివృద్ధి నమూనా ఉంది. ఈ ఏడాదిలోనే వందలాది మంది ఆదివాసుల హత్య వెనుక ఉన్న అభివృద్ధి–విధ్వంసాల సంఘర్షణకు మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ కేశవరావు హత్య ఒక పరాకాష్ఠ.ఒకప్పుడు మావోయిస్టులు, వాళ్ల అభిమానులు మాత్రమే పాలకుల అభివృద్ధి నమూనాను మౌలికంగా విమర్శించేవాళ్లు. ప్రజలే కేంద్రంగా అభివృద్ధి నమూనా ఎట్లా ఉండాలో చెప్పేవాళ్లు. ఈ దేశ ప్రజల అవసరాలే కేంద్రంగా అభివృద్ధి నమూనా ఉండాలని విశ్లేషించేవాళ్లు. ఈ దేశ వనరులు ఇక్కడి ప్రజల కోసమే వినియోగించాలనే వాళ్లు. చిన్న చిన్ని సవరణలు ఎన్ని చేసినా అది ప్రజలకు పనికి రాదని, చాలా మందికంటే భిన్నమైన వైఖరిని ప్రకటించేవాళ్లు. విప్లవం ద్వారా మౌలిక మార్పు వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని అనేవాళ్లు.ఇదే విమర్శ ఇప్పుడు దేశంలోనే ఒక ప్రధాన విమర్శగా ఎదిగింది. ఈ దేశం పిడికెడు మంది కార్పొరేట్లది కాదని, అసంఖ్యాక ప్రజలదనే అవగాహన అనేక రకాలుగా ప్రచారంలోకి వచ్చింది. కార్పొరేటీకరణ ఉద్ధృతంగానే సాగుతూ ఉండవచ్చు. కానీ దాని మీద విమర్శ పదునెక్కుతోంది. అనేక రూపాల్లో ప్రజా పోరాటాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశభక్తి, జాతీయత అనే భావనలను ఆ పక్క పాలకులు ప్రచారంలో పెట్టే కొద్దీ... ఈ పక్క నుంచి రోజువారీ జీవిత సంక్షోభంలోంచి ప్రజా ప్రయోజనాల చర్చ వేగవంతం అవుతున్నది.మావోయిస్టు ఉద్యమం ఈ విషయాలను చర్చించడంతో సరి పెట్టుకోలేదు. వాళ్లకు బలం ఉన్న ప్రాంతాల్లో మిలిటెంట్‌ ఉద్యమాలను నిర్మిస్తోంది. మిగతా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్న వేర్వేరు ప్రజా పోరాటాలకు మద్దతు ఇస్తున్నది. వాటిలో తనకు వీలైన పద్ధతిలో పాలుపంచుకుంటోంది. ఈ దేశంలో మౌలిక స్థాయిలో జరగాల్సిన అభివృద్ధి నమూనా చర్చను ప్రజా ఆచరణలోకి మళ్లిస్తున్నది. ఇది ముఖ్యంగా కేంద్ర పాలకులకు ఆగ్రహం తెప్పించింది. పైకి మావో యిస్టు ఉద్యమం గురించి అప్పుడప్పుడు శాంతి భద్రతల సమస్యగా చెప్పినా... ఇది తాను ఎంచుకొన్న అభివృద్ధి నమూనాకు ఆటంకం అని గ్రహించింది. అడవుల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఉండే అశేష పీడిత ప్రజానీకానికీ, కార్మికులకూ, నానాటికీ పెరుగుతున్న మధ్య తరగతికీ ప్రస్తుత ప్రభుత్వం నడుపుతున్న అభివృద్ధి నమూనా ప్రమాదకరమనే చైతన్యం పెరగడంలో మావోయిస్టుల పాత్ర ఉన్నది.కాబట్టి మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించకపోతే తాను ఎంచుకున్న కార్పొరేట్‌ అభివృద్ధి నమూనాను అమలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వానికి స్పష్టమైంది. కొన్ని తేడాలతో గత ప్రభుత్వాలది కూడా ఇదే వరుస. వాళ్లు చూసిన దారిని మరింత నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా నేటి ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఈ మేరకు వివిధ ప్రజా పోరాటాలు ఉద్ధృతమయ్యాయి. వ్యవస్థ మౌలిక మార్పులో కీలకమైన ఉత్పత్తి సంబంధాల చర్చను, కొత్త దోపిడీ రూపాల సమస్యను మావోయిస్టు ఉద్యమం కేంద్ర స్థానంలోకి తీసుకొని వచ్చింది. కార్పొరేట్‌ పెట్టుబడి, దాని వనరుల దాహం, శ్రమశక్తిని కొల్లగొడుతున్న పద్ధతుల మీద విమర్శను ప్రజల కామన్‌ సెన్స్‌లో భాగం చేసింది. కాబట్టి కార్పొరేట్‌ ఇండియాను సాధించడానికి మావోయిస్టు రహిత భారత్‌ ఒక షరతుగా మారిపోయింది.వ్యక్తిగా నంబాళ కేశవరావు భౌతిక కాయం అరమోడ్పు కన్నులతో ఈ నేలలో కలిసిపోవచ్చు. కానీ ఆయన చూపు, మేధ,హృదయం, చైతన్యం మాత్రం పాలకుల అభివృద్ధి నమూనాను గురి చూస్తూనే ఉంటాయి. పాణి వ్యాసకర్త ‘విరసం’ కార్యవర్గ సభ్యుడు

AP Deputy CM Pawan Kalyan Warn TFI5
సినీ ఇండస్ట్రీకి పవన్‌ కల్యాణ్‌ బెదిరింపులు!

సాక్షి, విజయవాడ: తెలుగు చలన చిత్ర పరిశ్రమ(TFI)పై నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భగ్గుమన్నారు. కూటమి ప్రభుత్వంపై పరిశ్రమకు కనీస మర్యాద, కృతజ్ఞతలు లేవంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. థియేటర్లు, నిర్మాతలు, లీజుదార్లుపై విల్లు ఎక్కిపెట్టిన ఆయన.. వారిని టార్గెట్ చేస్తూ కీలకమైన ప్రకటన విడుదల చేశారు. తన చిత్రం హరిహర వీరమల్లు కోసం ఇండస్ట్రీని టార్గెట్ చేసిన పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) నిన్న తన మంత్రి దుర్గేష్ చేత.. థియేటర్లపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇవాళ నేరుగా తన కార్యాలయం నుండి హెచ్చరికతో కూడిన ఒక ప్రకటన విడుదల చేయించారాయన. ‘‘గతంలో అల్లుఅరవింద్, అశ్వనీదత్, దిల్ రాజు, సుప్రియ, చినబాబు, నవీన్ ఎర్నేని కలిశారు. అందరినీ రమ్మంటే ఎవ్వరూ రాలేదు. తెలుగు ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా వచ్చి మమ్మల్ని సినిమా సంఘాలు కలవలేదు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కూడా కలవలేదు. కేవలం సినిమాలు విడుదలైనప్పుడు మాత్రమే కలుస్తున్నారు. ఇకమీద సినీ ప్రముఖ వ్యక్తులతో చర్చలు జరపేది లేదు. వ్యక్తిగతంగా చర్చలుండబోవు... వ్యక్తిగతంగా వచ్చి టిక్కెట్ ధర పెంచమని కోరడం(Tickets Rate Hike) ఎందుకు..?. అందరినీ కలిసి రమ్మంటే ఎవ్వరూ రాలేదు..?. ఇది మాకు తెలుగు సినిమాలో కొందరు ఇచ్చిన రిటర్న్‌ గిఫ్ట్. ఈ రిటర్న్‌ గిఫ్ట్‌కు తగ్గట్లే మేమూ పని చేస్తాం. సినిమా థియేటర్ల ఆదాయంపై ఆరా తీస్తున్నాం. థియేటర్లను యజమానులు నడపడం లేదు. లీజు దారులే థియేటర్లను నడుపుతున్నారు. లీజు దార్ల నుండి పన్ను వస్తుందా లేదా..? అని పరిశీలిస్తున్నాం. సినిమా హాళ్లలో స్నాక్స్, డ్రింక్స్ అధిక ధరలను కూడా తనిఖీ చేస్తాం. థియేటర్ల పైకి తనిఖీ బృందాలను పంపుతాం. మల్టీప్లెక్స్ లలో టిక్కెట్ల ధరలపై కూడా విచారణ జరుపుతాం. మల్టీప్లెక్స్ లలో ఆహారపదార్థాలపై కూడా తనిఖీలు చేస్తాం. ఇకమీదట కేవలం సినిమా సంఘాలతోనే చర్చిస్తాం’’ అని పవన్‌ పేరిట ప్రకటన వెలువడింది.

Donald Trump Expands Tariff Threat to Samsung, Other Phone Makers6
సామ్‌సంగ్‌కు ట్రంప్‌ హెచ్చరికలు 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ ప్రఖ్యాత తయారీ సంస్థలను టారిఫ్‌ల పేరిట బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆయా కంపెనీలు అమెరికాలోనే వస్తువులు, సరుకులు ఉత్పత్తి చేయాలని, లేకపోతే సుంకాల బాదుడుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆయన యాపిల్‌ కంపెనీకి ఇప్పటికే హెచ్చరికలుజారీ చేశారు. దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్‌ సంస్థకు సైతం ఇప్పుడు అదే పరిస్థితి ఎదురయ్యింది. అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే 25 శాతం టారిఫ్‌ విధిస్తామని సామ్‌సంగ్‌కు ట్రంప్‌ తేల్చిచెప్పారు. ఆయన తాజాగా వైట్‌హúస్‌లో మీడియాతో మాట్లాడారు. అణు విద్యుత్‌ ఉత్పత్తిని మరింత పెంచడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అమెరికాలో ఎల్రక్టానిక్‌ ఉత్పత్తులు విక్రయించుకొనే ఏ సంస్థ అయినా సరే వాటిని ఇక్కడే తయారు చేయాలని, లేనిపక్షంలో సుంకాలు చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టంచేశారు. తయారీ ప్లాంట్లను అమెరికాలో నెలకొల్పితే ఎలాంటి టారిఫ్‌లు ఉండవని చెప్పారు. మరెక్కడో తయారు చేసి, ఇక్కడ విక్రయించుకొని, సొమ్ము చేసుకుంటామంటే అది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఐఫోన్లను అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే యాపిల్‌ కంపెనీపై 25 శాతం టారిఫ్‌లు విధించడం తథ్యమని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. యాపిల్‌ కంపెనీకి సంబంధించి 90 శాతం ఫోన్లు చైనాలోనే తయారవుతున్నాయి. అక్కడి ప్లాంట్లను భారత్‌కు తరలించేందుకు యాపిల్‌ సిద్ధమవుతోంది. ఇంతలోనే ట్రంప్‌ కన్నెర్ర చేశారు. మరోవైపు సామ్‌సంగ్‌కు చైనాలో తయారీ ప్లాంట్లు లేవు. చివరి ప్లాంట్‌ 2019లో మూతపడింది. సామ్‌సంగ్‌ ఫోన్లు, ఎల్రక్టానిక్‌ ఉత్పత్తులు ఎక్కువగా భారత్, దక్షిణ కొరియా, వియత్నాం, బ్రెజిల్‌లోనే తయారవుతున్నాయి. భారత్‌లోనే తయారు చేస్తారా? మీ ఇష్టం.. యాపిల్‌ కంపెనీకి ట్రంప్‌ మరోసారి అల్టిమేటం జారీ చేశారు. ‘‘ఐఫోన్ల తయారీ ప్లాంట్లను చైనా నుంచి భారత్‌కు తరలించుకోవాలంటే తరలించుకోండి. మేము వద్దనడం లేదు. కానీ, ఐఫోన్లను అమెరికాలో విక్రయించుకోవాలంటే మాత్రం సుంకాలు చెల్లించాల్సిందే. సుంకాలు లేకుండా మీరు ఐఫోన్లు ఇక్కడ అమ్ముకోలేరు’’అని పేర్కొన్నారు.

Delhi Capitals beat Punjab Kings by 6 wickets7
విజయంతో ముగించిన ఢిల్లీ

జైపూర్‌: ఈ ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌ చెరిన జట్లను ఇంటికెళ్లే జట్లు గట్టి దెబ్బే కొడుతున్నాయి. తాజాగా పట్టికలో ‘టాప్‌’పై గురిపెట్టిన పంజాబ్‌ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్లతో గెలిచి షాకిచ్చింది. తద్వారా ఢిల్లీ ఘన విజయంతో ఈ సీజన్‌ను ముగించింది. తొలుత పంజాబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. కెపె్టన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (34 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. ఆరంభంలో ఇన్‌గ్లిస్‌ (12 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆఖర్లో స్టొయినిస్‌ (16 బంతుల్లో 44 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం ఢిల్లీ 19.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 208 పరుగులు చేసి గెలిచింది. కరుణ్‌ నాయర్‌ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మెరిపిస్తే... సమీర్‌ రిజ్వీ (25 బంతుల్లో 58 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) గెలిచేదాకా నిలిచాడు. స్కోరు వివరాలు పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ఆర్య (సి) స్టబ్స్‌ (బి) ముస్తాఫిజుర్‌ 6; ప్రభ్‌సిమ్రన్‌ (బి) విప్రాజ్‌ 28; ఇన్‌గ్లిస్‌ (స్టంప్డ్‌) స్టబ్స్‌ (బి) విప్రాజ్‌ 32; శ్రేయస్‌ (సి) మోహిత్‌ (బి) కుల్దీప్‌ 53; నేహల్‌ (సి) డుప్లెసిస్‌ (బి) ముకేశ్‌ 16; శశాంక్‌ (సి) స్టబ్స్‌ (బి) ముస్తాఫిజుర్‌ 11; స్టొయినిస్‌ నాటౌట్‌ 44; అజ్మతుల్లా (సి) సమీర్‌ (బి) కుల్దీప్‌ 1; యాన్సెన్‌ (సి) స్టబ్స్‌ (బి) ముస్తాఫిజుర్‌ 0; హర్‌ప్రీత్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–8, 2–55, 3–77, 4–118, 5–144, 6–172, 7–174, 8–197. బౌలింగ్‌: ముకేశ్‌ 4–0–49–1, ముస్తాఫిజుర్‌ 4–0–33–3, మోహిత్‌ శర్మ 4–0–47–0, విప్రాజ్‌ నిగమ్‌ 4–0–38–2, కుల్దీప్‌ 4–0–39–2. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) శశాంక్‌ (బి) యాన్సెన్‌ 35; డుప్లెసిస్‌ (సి) ప్రియాన్ష్(బి) హర్‌ప్రీత్‌ 23; కరుణ్‌ (బి) హర్‌ప్రీత్‌ 44; సాదికుల్లా (సి) అర్‌‡్షదీప్‌ (బి) ప్రవీణ్‌ 22; రిజ్వీ నాటౌట్‌ 58; స్టబ్స్‌ నాటౌట్‌ 18; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–55, 2–65, 3–93, 4–155. బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 4–0–35–0, అజ్మతుల్లా 4–0–46–0, హర్‌ప్రీత్‌ 4–0–41–2, యాన్సెన్‌ 4–0–41–1, ప్రవీణ్‌ 2–0–20–1, స్టొయినిస్‌ 1.3–0–21–0. ఐపీఎల్‌లో నేడుగుజరాత్‌ X చెన్నైవేదిక: అహ్మదాబాద్‌మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి కోల్‌కతా X హైదరాబాద్‌ వేదిక: ఢిల్లీరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Ministers Tension On Ys Jagan Prakasam District Visit8
వైఎస్‌ జగన్‌ దెబ్బకు దిగొచ్చిన మంత్రులు

సాక్షి, ప్రకాశం జిల్లా: ఈ నెల 28న పొదిలిలో పొగాకు బోర్డును వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో మంత్రుల హడావుడి మొదలైంది. వైఎస్‌ జగన్‌ దెబ్బకు మంత్రులు దిగొచ్చారు. పొగాకు రైతులతో మార్టూరులో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పలువురు రైతులతో మాట్లాడారు. 28 లోపు పొగాకు కొనుగోలు జరపాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలుఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఆశ ఎక్కువ .. పంట పండించక ముందు ఆలోచించాలి. పండించాక నష్టపోయామని బాధపడకూడదంటూ వ్యాఖ్యానించారు. మార్కెట్ లో పంట అమ్మకాలను పసిగట్టి పంటలు వేసుకోవాలంటూ రైతులకు ఉచిత సలహా ఇచ్చారు.కాగా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిరప, వరి, కంది, పొగాకు వంటి పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులను నష్టాలబాట పట్టించిందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. జిల్లాలో పొగాకు రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు. వేలం కేంద్రానికి వెళ్లి పొగాకు అమ్ముడుపోక బేళ్లను వెనక్కు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పొగాకు రైతుల కష్టాలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 28వ తేదీన వైఎస్‌ జగన్‌ పొదిలి వేలం కేంద్రానికి రానున్నారు.

KTR Fires On Congress Party and CM Revanth Reddy9
తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్‌... శని కాంగ్రెస్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్‌రెడ్డి అని, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్‌ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ దెయ్యాన్ని, శనిని వదిలించాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. ‘కేసీఆర్‌ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు’ఉన్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్‌ ఈమేరకు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘అంతర్గత విషయాలను ప్రస్తావించేందుకు పార్టీ వేదికలు ఉంటాయి. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంటుంది. ఆఫీసు బేరర్స్‌ను కలిసి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుటుంది. ఈ సూత్రం వాళ్లకు వీళ్లకు కాదు.. పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ వర్తిస్తుంది. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన బీఆర్‌ఎస్‌లో అధ్యక్షుడు కేసీఆర్‌కు లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా సూచనలిస్తూ ఎవరైనా లేఖలు రాయొచ్చు. అయితే పార్టీలో ఏ హోదాలో ఉన్న వారైనా కొన్ని అంతర్గత విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది’అని కేటీఆర్‌ అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఎలా ముందుకు పోవాలని వేల మంది కార్యకర్తలతో గంటలకొద్దీ చర్చించాం. ఆ క్రమంలో చాలామంది నేరుగా మైక్‌లో మాట్లాడారు. మరికొందరు కేసీఆర్‌కు ఇవ్వమంటూ లేఖలు ఇచ్చారు. మా పార్టీలో బహిరంగ చర్చను ప్రోత్సహిస్తాం. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన మా పార్టీ అధ్యక్షుడికి ఎవరైనా సూచనలు చేయొచ్చు, ఉత్తరాలు రాయొచ్చు’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల్లో ఉన్నట్లు బీఆర్‌ఎస్‌లోనూ రేవంత్‌ కోవర్టులు ఉండొచ్చని, సరైన సమయంలో వారంతటే వారు బయటపడతారన్నారు. ఓటుకు నోటు కేసులో ‘బ్యాగ్‌మ్యాన్‌’ ‘యంగ్‌ ఇండియా నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సీఎం రేవంత్‌ రెడ్డి పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చార్జిషీట్‌లో చేర్చడం రాష్ట్రానికి అవమానకరం. ఈ కేసులో రేవంత్‌ పేరు వచ్చిందన్న వార్తను కొన్ని పత్రికలు అసలు రాయనే లేదు. మీడియా ఎంత తాపత్రయపడ్డా.. ఎన్ని ప్రకటనలు తీసుకున్నా రేవంత్‌ ఒక లొట్ట పీసు ముఖ్యమంత్రి అని ప్రజలకు అర్థమైపోయింది. మీడియా ఎన్ని దాచినా సోషల్‌ మీడియాతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తూనే ఉంటాయి. ఓటుకు నోటు కేసులో బ్యాగ్‌మ్యాన్‌ అని పేరు తెచ్చుకున్న రేవంత్‌ వైఖరి మారలేదని ఈడీ చార్జిïÙట్‌లో బయటపడింది. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంగా మారగా, ఢిల్లీ కాంగ్రెస్‌కు అవసరమైనప్పుడల్లా భారీ మొత్తంలో ఇస్తూ రేవంత్‌ తన పదవి కాపాడుకుంటున్నాడు. నైతికత ఉంటే రేవంత్‌ సీఎం పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం ఆయనను పదవి నుంచి తప్పించాలి. ప్రధాని మోదీ, అమిత్‌ షాతో ఒప్పందం కుదుర్చుకునేందుకే రేవంత్‌ ఢిల్లీ వెళ్లారు. 17 నెలల్లో 44 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌ కేసుల నుంచి తప్పించాలని చీకట్లో అమిత్‌ షా కాళ్లు పట్టుకుంటున్నాడు. రేవంత్‌కు రాహుల్‌ గాంధీ అధికారిక బాస్‌ కాగా, మోదీ, అమిత్‌ షా అనధికార బాస్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిన్నరగా బీఆర్‌ఎస్‌పై నిందలు, బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాస్‌లకు రూ.వేలకోట్ల చందాలు అనే రీతిలో రేవంత్‌ పాలన సాగుతోంది. రేవంత్‌ అవినీతిపై రాహుల్‌ మాట్లాడాలి. ఈడీ చార్జిïÙట్‌లో సోనియా, రాహుల్‌ పేర్లు ఉన్నా జపాన్‌ టూర్‌ పేరిట రేవంత్‌ స్పందించకుండా తప్పుకున్నాడు’అని కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నడుమ అపురూప బంధం ‘నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్‌ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు మౌన మునుల్లా మారిపోయారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూదందా అక్రమాలకు రేవంత్‌ వత్తాసు పలుకుతున్నందుకే మౌనమా’అని కేటీఆర్‌ ప్రశ్నించారు. రూ.187 కోట్ల వాల్మీకి స్కామ్, ట్రిపుల్‌ ఆర్‌ టాక్స్, హెచ్‌సీయూ భూముల్లో అక్రమాలు, పౌర సరఫరాల కుంభకోణం జరుగుతున్నా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదు. రేవంత్‌కు రక్షణ కవచంలా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం స్పందించకుంటే నెల రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం. ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్‌ చేయాలని గవర్నర్‌ను కోరతాం’అని చెప్పారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, డాక్టర్‌ సంజయ్, ఎమ్మెల్సీ రవీందర్‌రావు, మాజీ మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్, రాజయ్య పాల్గొన్నారు.

Southwest Monsoons Entry into Telangana in Coming 3 days10
కేరళ చేరిన నైరుతి

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. శనివారం ఉదయం కేరళ భూభాగంలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు అత్యంత చురుకుగా ఉన్నాయని, లక్షదీవులతో పాటు కేరళ రాష్ట్రంలోకి పూర్తిగా ప్రవేశించేందుకు అత్యంత తక్కువ సమయం పడుతుందని వివరించింది. మరోవైపు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కూడా రుతుపవనాలు తాకాయి. నైరుతి రుతుపవనాలు ముందుగా కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత దేశమంతటా విస్తరిస్తాయి. ఈ సీజన్‌లో రుతుపవనాలు వాతావరణ శాఖ అంచనాల కంటే మూడురోజులు ముందుగానే భారత ప్రధాన భూభాగాన్ని తాకటం విశేషం. గతేడాది నైరుతి రుతుపవనాలు మే 30న కేరళను తాకగా... ఈసారి ఆరు రోజుల ముందే ప్రవేశించాయి. రానున్న రెండురోజుల్లో రుతుపవనాలు మధ్య అరేబియన్‌ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గోవాలో పూర్తి భూభాగం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలతోపాటు సబ్‌ హిమాలయన్‌ పశ్చిమబెంగాల్, సిక్కింలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఈసారి వర్షాకాలంలో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మూడురోజుల్లో రాష్ట్రంలోకి.. రానున్న మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా కేరళను తాకిన తర్వాత సగటున నాలుగు నుంచి ఆరు రోజుల మధ్య తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండడంతో మూడు రోజులలోపే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించేందుకు మరో మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతేడాది జూన్‌ 3వ తేదీన రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించగా... ఈసారి మే నెలలోనే ప్రవేశించడం గమనార్హం. 27న బంగాళాఖాతంలో అల్పపీడనం నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండడం రైతాంగంలో ఉత్సాహాన్ని నింపుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్‌లో కురిసే వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం, వాయుగుండం, తుఫానులపైనే ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆరోజుకల్లా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో ఈ అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని, చాలాచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం రెండ్రోజుల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని ముందస్తు అంచనాలు వెల్లడించాయి. రెండ్రోజులు తేలికపాటి వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్‌ – గోవా తీర ప్రాంతం సమీపంలో కొనసాగిన స్పష్టమైన అల్పపీడన ప్రాంతం శనివారం ఉదయం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం అదే ప్రాంతంలో రత్నగిరికి ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. క్రమంగా తూర్పు దిశలో కదిలి శనివారం రాత్రికల్లా దక్షిణ కొంకణ్‌ తీరంలో రత్నగిరి, దాపోలి మధ్యలో వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో దక్షిణ ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు కానున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement