
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి
టెండర్ల ఫైల్స్
అనుమతి కోసం పంపాం
జీజీహెచ్‌లో టెండర్ల ఫైల్స్ అనుమతి కోసం ఉన్నతాధికారుల వద్దకు పంపించాం. అనుమతి రాగానే టెండర్ల నోటిఫికేషన్ ఇస్తాం. కార్యాలయ ఉద్యోగుల పనితీరుపై దృష్టి సారించి ఫైల్స్ పెండింగ్‌లో లేకుండా చూస్తాం.
– డాక్టర్ నీలం ప్రభావతి,
సూపరింటెండెంట్, జీజీహెచ్, గుంటూరు
గుంటూరు మెడికల్: ఆస్పత్రికి ఆదాయం వచ్చే సైకిల్ స్టాండ్ టెండర్ ప్రక్రియను మూడేళ్లుగా నిర్వహించకుండా కార్యాలయ ఉద్యోగులు చోద్యం చూస్తున్నారు. డైట్ టెండర్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పలువురు గుంటూరు జీజీహెచ్ కార్యాలయ ఉద్యోగులు ఆసుపత్రికి వచ్చి హాజరు వేసి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటున్నా, ఒక్క నోట్ ఫైల్ కూడా సిద్ధం చేసి అధికారులకు పంపించకపోయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరికొంత మంది ఉద్యోగులకు ఎలాంటి విధి నిర్వహణ బాధ్యతలు (సీట్లు) కేటాయించకపోవడంతో వారు ఏ విధులు నిర్వహించకుండానే ఆసుపత్రిలో కాసేపు గడిపి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. మళ్లీ సాయంత్రం తాపీగా వచ్చి హాజరు వేస్తున్నారు. పనివేళల్లో కార్యాలయ ఉద్యోగులు సీట్లలో లేకున్నా, వారు ఎలాంటి ఫైల్స్ సిద్ధం చేయకుండా ఖాళీగా కూర్చున్నా వారిని అజమాయిషీ చేసే వారు లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆసుపత్రి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
మచ్చుకు కొన్ని..
ఆసుపత్రిలో కోవిడ్ సమయంలో కాంట్రాక్టు స్టాఫ్‌నర్సుగా పనిచేసిన ఎస్.కరుణకు వేతనం చెల్లించకుండా కార్యాలయంలోని ఓ ఉద్యోగి ఆమె జీతాన్ని వేరే వారి ఖాతాలో జమ చేశారు. ఈ విషయంపై పలుమార్లు బాధితురాలు ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో జనవరి 9న ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేసింది. తప్పిదానికి పాల్పడి ఉద్యోగికి జీతం చెల్లించకుండా ఆసుపత్రికి సంబంధం లేని, వేరే జిల్లాకు చెందిన వ్యక్తికి వేతనం వేసిన ఉద్యోగిపై నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల్లో పలువురు అనర్హులకు ఉద్యోగాలు కేటాయించడంతో పలువురు కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడంతో నియామకపు ఉత్తర్వులు ఇచ్చిన అభ్యర్థులను వెనక్కు పిలిపించి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఈ తప్పిదాలకు పాల్పడిన ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు
మెడికల్ లీవ్‌లు మంజూరు చేయకపోవడం, అరియర్స్ చెల్లించకపోవడం, సర్వీస్ సంబంధిత విషయాలపై చర్యలు తీసుకోకపోవడం వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పలుమార్లు ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు లిఖిత పూర్వకంగా ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
ఒకేచోట ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు
జీజీహెచ్ కుటుంబ నియంత్రణ విభాగంలో ముగ్గురు సీనియర్ అసిస్టెంట్‌లు, ఒక జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్నారు. ఇరువురు రెగ్యులర్ సీనియర్ అసిస్టెంట్లు కాగా, ఒకరు అనధికార డెప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. వాస్తవానికి కార్యాలయంలో ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తే సరిపోతుంది. మిగతా వారంతా కేవలం కాలక్షేపానికే సంబంధిత విభాగంలో కూర్చుండిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎంఆర్డీలో కూర్చుండిపోయారు
జనన మరణాల నమోదుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే మెడికల్ రికార్డ్ డిపార్టుమెంట్‌లో కార్యాలయ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఖాళీగా కూర్చుండిపోతున్నారు. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ కోర్సు చదివిన అభ్యర్థులను ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్టు పద్ధతిలో నియమించింది. వీరు కాకుండా గతంలో శిక్షణ పొందిన జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. మెడికల్ రికార్డ్ ఆఫీసర్, ఓ మెడికల్ ఆఫీసర్, శిక్షణ పొందిన ఇద్దరు విభాగంలో విధులు నిర్వహిస్తే సరిపోతుంది. కానీ అధిక సంఖ్యలో సిబ్బందిని ఎమ్మార్డీ విభాగంలో పోస్టింగ్స్ ఇవ్వడం వల్ల పలువురు ఉద్యోగులు ఏపని చేయకుండా ఖాళీగా కూర్చుండిపోతున్నారు.
గుంటూరు జీజీహెచ్ కార్యాలయంలో విచిత్ర పరిస్థితి కొందరు ఉద్యోగులు ఫైల్స్ పెట్టరు.. సీట్లో ఉండరు కొంత మంది ఏ పని చేయకుండానే జీతాలు డ్రా చేస్తున్న వైనం ఏళ్ల తరబడి పేరుకుపోతున్న కార్యాలయ ఫైల్స్ చోద్యం చూస్తున్న ఆస్పత్రి అధికారులు పలువురు కార్యాలయ ఉద్యోగుల తీరుపై తీవ్ర విమర్శలు
అన్ని విభాగాల్లో ఇదే తీరు
ఎస్టాబ్లీష్‌మెంట్ విభాగం, మేనేజర్ విభాగం, అకౌంట్స్ విభాగం, క్యాషియర్ విభాగం, మెడికల్ రీయింబర్స్‌మెంట్ విభాగం, డైట్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల్లో కేవలం ఒకరిద్దరు మాత్రమే యాక్టివ్‌గా ఫైల్స్ సిద్ధం చేస్తున్నారు. మిగతా సిబ్బందంతా తమకు కీలకమైన ఫైల్స్, సీట్లు ఏమీ అప్పగించలేదంటూ ఖాళీగా మిన్నకుండిపోతున్నారు. మరో పక్క కలెక్టర్ గ్రీవెన్స్‌లో జీజీహెచ్ కార్యాలయంలో ఫైల్స్ పెండింగ్‌లో ఉంటున్నాయని, ముఖ్యంగా ఆసుపత్రికి ఆదాయం తీసుకొచ్చే టెండర్ల ఫైల్స్ కూడా చేయకుండా మిన్నకుండిపోతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆసుపత్రిలో 12 మంది సీనియర్ అసిస్టెంట్‌లు, 35 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేటర్లు, క్లర్క్ కమ్ టైపిస్టులు ఉండి కూడా కార్యాలయ ఫైల్స్ పేరుకుపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఆసుపత్రి అధికారులు స్పదించి కార్యాలయ ఉద్యోగుల పనితీరుపై పర్యవేక్షణ చేసి కార్యాలయంలో ఫైల్స్ పెండింగ్ లేకుడా చూడాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.