
తెనాలి: నాలుగో సంవత్సరం మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని ఈ నెల 27వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెనాలి నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అదే వేదికపై నుంచి ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ నగదును కూడా రైతుల ఖాతాలకు బదిలీ చేయనున్నారు. ఇందులో భాగంగా బహిరంగ సభావేదిక, హెలిప్యాడ్ ఏర్పాట్లను గురువారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి, తెనాలి సబ్‌కలెక్టర్ గీతాంజలిశర్మ పరిశీలించారు. బహిరంగ సభా వేదికగా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డును ఎంపిక చేశారు. తెనాలి–నారాకోడూరు రోడ్డులో కవిరాజనగర్ లేఅవుట్‌లోని ప్రదేశాన్ని సందర్శించి హెలిప్యాడ్ ఏర్పాటుకు నిర్ణయించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెనాలి ఏరియాలో వైఎస్సార్ రైతు భరోసా/ పీఎం కిసాన్ లబ్ధిదారులు అధికంగా ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా నగదు జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తెనాలి నుంచి చేపడుతున్నారని కలెక్టర్ వెల్లడించారు. సీఎం సభకు వచ్చే రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ సంక్షేమ ప్రదాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తెనాలిలో అడుగుపెడుతున్న సందర్భంగా అపూర్వంగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మెప్మా పీడీ వెంకటనారాయణ, డీఆర్‌డీఏ పీడీ హరిహరనాథ్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ బి.నిర్మల, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఆవుల మురళీకృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
27న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి ఖాతాల్లోకి నగదు జమ ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా బదిలీ హెలిప్యాడ్, బహిరంగ సభా వేదిక పరిశీలించిన నేతలు