ఒంగోలు సిటీ: ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్ అంటూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి విమర్శించారు. శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ బాబు వంచన, మోసం గ్యారంటీ అనే రీతిలో బడ్జెట్ ఉందన్నారు. కేవలం అంకెల గారడీ, గ్రాఫిక్స్‌తో కూడుకున్నదే తప్ప ప్రజల అభివృద్ధి, సంక్షేమం గురించి, ఎన్నికల హామీల గురించి ప్రస్తావించకపోవడంతో చంద్రబాబు మోసం మరోసారి బట్టబయలైందన్నారు.
మహిళలని మోసం చేశారు : వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ
సంతనూతలపాడు: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని కూటమి నేతలు ఇచ్చిన హామీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని, ఇక దాల్చబోదని ఈ బడ్జెట్ ద్వారా స్పష్టంగా తెలిసిపోతోందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ విమర్శించారు. పక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బస్సు హామీని అమలు చేశాయని, మన రాష్ట్రంలో ఈ బడ్జెట్లో అయినా ప్రవేశపెడతారేమో అని ఎదురుచూసిన మహిళలకు ఆశాభంగం తప్పలేదని అన్నారు. చంద్రబాబు మహిళలను నిలువునా మోసం చేశారని విమర్శించారు.
ఇది రైతు వ్యతిరేక బడ్జెట్: చుండూరి రంగారావు, సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్
ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక బడ్జెట్. 4.5 లక్షల ఎకరాలకు సాగునీరందించే వెలుగొండ ప్రాజెక్టుకు నామమాత్రంగా నిధులను కేటాయించడం, మిర్చి క్వింటాలు ధర గుంటూరు మిర్చి యార్డులో రూ.13 నుంచి రూ.14 వేలు ఉండగా ప్రభుత్వం మద్దతు ధర కేవలం రూ.11,781 ప్రకటించడం, ధరల స్థిరీకరణకు కేవలం రూ.300 కోట్లు కేటాయించడం దీనికి నిదర్శనం. ప్రజలకు మేలు చేయడం చేతకాక మీడియా ముందు ఏడవడం సిగ్గుచేటు.
ఆర్‌ఆర్ ప్యాకేజీకి రూ.116 కోట్లేనా: చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసి రాష్ట్ర అధికార ప్రతినిధి
వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్‌ఆర్ ప్యాకేజికి రూ.1000 కోట్లు కేటాయించాల్సి ఉండగా రూ.116 కోట్ల మాత్రమే విదిల్చడం దారుణం. దీంతో నిర్వాసితులకు ఎలాంటి న్యాయం చేయాలనుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఎంత మాత్రం మంచిదికాదు. అలాగే సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని పక్కప పెట్టేసి ప్రజా సంక్షేమాన్ని దెబ్బ తీశారు. నిరుపేదలను దగా చేశారు.
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment