మద్దిపాడు: పశువుల మేత కత్తిరించే చాప్ కట్టర్‌ను జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్ బేబీరాణి మద్దిపాడులో శుక్రవారం ఉదయం పశుపోషకురాలికి సబ్సిడీపై అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేత కోసే యంత్రాన్ని 40 శాతం సబ్సిడీతో ఇస్తున్నామని తెలిపారు. 33 వేల రూపాయల విలువైన ఈ యంత్రాన్ని 40 శాతం సబ్సిడీపై లబ్ధిదారులకు రూ.20 వేలకే అందించినట్లు చెప్పారు. పశుపోషకులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు, నాలుగు నుంచి ఎనిమిది నెలల వయసు గల ఆడ దూడలకు బ్రూసెల్లోసిస్ వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. పశుపోషకులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని పశువులు వ్యాధిబారిన పడకుండా కాపాడుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏడీ సుగణ్యరావు, పశు వైద్యుడు అనిల్, పశుసంవర్థకశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
పీజీ కోర్సులపై విద్యార్థులకు అవగాహన సదస్సు
ఒంగోలు సిటీ: డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఎలా చేసుకోవాలనే అంశంపై విద్యార్థులకు స్థానిక ఆంధ్రకేసరి యూనివర్శిటీ డీఓఏ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలులోని శ్రీహర్షిణి డిగ్రీ కళాశాలలో శ్రీస్టూడెంట్ కెరీర్ గైడెన్స్ ఆన్ పీజీ కోర్సెస్ ఏకేయూశ్రీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఏకేయూ డీఓఏ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ జి.సోమశేఖర, ఏకేయూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహన్‌రావు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.నిర్మలామణి, కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి డాక్టర్ బి.పద్మజ, ఆక్వాకల్చర్ విభాగం సహాయ ఆచార్యుడు డాక్టర్ బి.సురేష్, తదితరులు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
రౌడీషీటర్లు బైండోవర్
చీమకుర్తి: మండలంలోని రౌడీషీటర్లను తహసీల్దార్ వద్ద శుక్రవారం బైండోవర్ చేయించినట్లు సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. మండలంలో మొత్తం 25 మంది రౌడీషీటర్లు ఉండగా, వారిలో ప్రస్తుతం 15 మందిని తహసీల్దార్ వద్ద రూ.2 లక్షల పూచికత్తుతో హాజరుపరిచి బైండోవర్ చేయించినట్లు తెలిపారు. మిగిలిన వారిని రానున్న రెండు రోజుల్లో బైండోవర్ చేయిస్తామన్నారు. ప్రతి ఆరునెలలకు ఒకసారి బైండోవర్ చేసే కార్యక్రమంలో భాగంగానే వారిని హాజరుపరిచామన్నారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలని, గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment