
స్నేహితుడిపై హత్యాయత్నం.. కేసు నమోదు
నిర్మల్‌టౌన్: తన స్నేహితుడినే హత్య చేసేందుకు ఓ వ్యక్తి ఇతరులతో కలిసి యత్నించిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా గురువారం వివరాలు వెల్లడించారు. స్థానిక బాలాజీవాడకు చెందిన రాజులదేవి ప్రమోద్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. అదే అమ్మాయిని దినేశ్ అనే మరో వ్యక్తి కూడా ప్రేమించాడు. ఈ విషయంపై వారిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగాయి. ఈనెల 1న మరోసారి వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడికి యత్నించడంతో అక్కడే ఉన్న కోట్ల రాజేశ్ వారిని అడ్డుకుని ఇద్దరిని అక్కడి నుంచి పంపించాడు. దీంతో ప్రమోద్ తన మిత్రుడైన రాజేశ్, దినేశ్‌కు మద్దతు ఇస్తున్నాడని భావించి రాజేశ్‌పై కోపం పెంచుకున్నాడు. అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అదేరోజు అర్ధరాత్రి రాజేశ్‌ను రామ్‌రావు బాగ్‌లోని మైసమ్మ కుంట గుట్ట ప్రాంతానికి పిలిచి గొడవపడ్డాడు. ప్రమోద్ మరో మిత్రుడైన కార్తిక్ సింగ్‌తో కలిసి రాజేశ్‌పై దాడి చేశాడు. పగిలిన బీరు సీసాతో పొడిచి హత్యాయత్నం చేశారు. ఇందుకు బబ్లు అలియాస్ రాజ్‌కుమార్, సచిన్ సింగ్‌లు సహకరించారు. రాజేశ్ తల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 24 గంటల్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.