
గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఉట్నూర్‌రూరల్: గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. ఉట్నూర్ మండలం చాందూరి గ్రామానికి చెందిన పోసుబాయి తనకి ఏదైనా అంగన్వాడీ సెంటర్‌లో ఉద్యోగం కల్పించాలని, తాండూర్ మండలం గోపాల్‌నగర్ గ్రామానికి చెందిన గట్ల నర్సయ్య తనకి మేకల లోన్, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించాలని, నేరిగొండ మండలం కుంటాల గ్రామానికి చెందిన సిడాం లక్ష్మి తనకు ఏదైనా ఆశ్రమ పాఠశాలలో ఆశ వర్కర్ ఉద్యోగం కల్పించాలని కోరారు. వీరితో పాటు పలు గ్రామాల నుంచి వచ్చిన వారు పింఛన్, రెండు పడకల గదుల ఇళ్లు, స్వయం ఉపాది పథకాల మంజూరు, వ్యవసాయం, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు సమర్పించారు. ఏవో దామదర స్వామి, పీవీటీజీ ఏపీవో మెస్రం మనోహర్, పీహెచ్‌వో సందీప్, మేనేజర్ శ్యామల, డీపీవో ప్రవీణ్, జేడీఎం నాగభూషణం, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.