
‘మావల’ పూడికతీతపై దృష్టి
● చెరువును పరిశీలించిన అధికారులు
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణానికి ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా నీటిని అందించే మా వల చెరువు పూడికతీతపై యంత్రాంగం దృష్టి సారించింది. ఈ చెరువు ద్వారా పట్టణానికి నిత్యం 1.5 ఎంఎల్‌డీల నీరు సరఫరా అవుతోంది. ఎండల తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో నీటి సరఫరా అవుతున్నప్పటికీ భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేలా అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు మున్సిపల్ ఇంజినీర్ పేరిరాజు, ఇరిగేషన్ శాఖ డీఈఈ కే.ప్రేంసింగ్ బుధవారం మావల అటవీ ప్రాంతంలోని చెరువును సందర్శించారు. నిల్వ ఉన్న నీటితో పాటు పేరుకుపోయిన పూడిక, చెత్తను పరిశీలించారు. ఏయే ప్రాంతాల్లో ఎంత మేర పూడిక తొలగించాలనే దానిపై అంచనా వేశారు. వివరాలతో కూడిన నివేదికను కలెక్టర్‌కు గురువారం అందించనున్నట్లు తెలిపారు. ఇరిగేషన్‌శాఖ సిద్ధం చేసే ప్రతిపాదనల ఆధారంగా పూడిక తొలగించనున్నట్లు ఎంఈ పేర్కొన్నారు. అలాగే లాండసాంగ్వీ వాగు ఎండిపోయిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా చెక్‌డ్యాం నిర్మాణానికి సైతం ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్‌కు అందజేయనున్నట్లుగా ఆయన వివరించారు. వారి వెంట మున్సిపల్ డీఈఈ కార్తీక్, ఇరిగేషన్‌శాఖ ఏఈలు కే.డి.సాగర్, బి.ప్రసాద్ తదితరులున్నారు.