మహిళా పోలీసులకు ప్రశంసాపత్రాలు అందిస్తున్న ఎస్పీ సతీష్‌కుమార్
గూడెంకొత్తవీధి: మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా ముద్రపడిన జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే ప్రభుత్వానికి గిరిజనులకు మధ్య వారధిగా సంక్షేమ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. స్థానిక పోలీసు మైదానంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన బ్యారెక్స్ భవనాలను చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైదాన ప్రాంతాలతో పోల్చి చూస్తే మన్యంలో పోలీసుల విధులు ఎంతో కష్టతరంగా ఉంటాయన్నారు. ఇటువంటి భిన్నమైన పరిస్థితులు, వాతావరణం మధ్య అమాయక ఆదివాసీ గిరిజనులకు తమవంతు సాయంగా ఉండాలని భావించి పోలీసు యంత్రాంగం అనేక సామాజిక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే నిరుద్యోగ యువతీ యువకులకు ప్రేరణ పేరుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని చెప్పారు. సీఆర్‌పీఎఫ్, పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఉచితంగా అవసరమైన శిక్షణ ఇస్తున్నామన్నారు. సేతు కార్యక్రమం పేరిట దివ్యాంగులకు సదరం శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. సదరం దృవపత్రాలు పొందిన కొందరికి యాభైశాతం రాయితీపై ఆర్టీసీ బస్సు పాసులను తాము చొరవ తీసుకుని మంజూరు చేయించామన్నారు.
మారుమూల గ్రామాలకు రహదారుల నిర్మాణానికి తమవంతు సహాయం చేస్తున్నామన్నారు. మారుమూల గ్రామాలకు సెల్ టవర్ల నిర్మాణం చురుగ్గా జరుగుతోందన్నారు. గంజాయిని దూరం చేసి ప్రత్యామ్నాయ పంటల ద్వారా గిరిజనులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు. చదువు మానేసిన గిరి యువత అసాంఘిక కార్యక్రమాల వైపు ఆకర్షితులు కాకుండా స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించుకోవాలన్నారు. ఇందుకు పూర్తిగా సహకరిస్తామన్నారు. గ్రామ సచివాలయ పోలీసులు క్షేత్రస్థాయిలో అన్ని విధాలా సహకరిస్తున్నారన్నారు. ఉత్తమ సేవలందించిన గూడెంకొత్తవీధి ఎస్‌ఐ అప్పలసూరి, సీఆర్‌పీఎఫ్ సహాయ కమాండెంట్ బీరేంద్రకుమార్, పలువురు సీఆర్‌పీఎప్ , ఏపీఎస్‌పీ సిబ్బందితోపాటు మహిళా పోలీసులకు ప్రశంసాపత్రాలను అందించారు. సదరం శిబిరానికి హాజరైన పలువురి దివ్యాంగులకు ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. జీకేవీధి సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐ అప్పలసూరి, సీఆర్‌పీఎఫ్ సహాయ కమాండెంట్ బీరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment