సీలేరులోని నదిపై ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ ర్యాంప్
మోతుగూడెం: చింతూరు మండలం పొల్లూరులో నిర్వహించనున్న మన్యం కొండ జాతరకు చకచక ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఒడిశా గిరిజనులు నిర్వహించే మన్యం కొండ జాతర వేడుకలకు ఏర్పాట్లు ఒడిశా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ప్రతి రెండేళ్లకు జరిగే మన్యం కొండ జాతరను ఈ ఏడాదిలో ఈనెల 27వ తేదీన నిర్వహిస్తారు.
నెల రోజుల ముందు నుంచే ...
పొల్లూరులో నిర్వహించే మన్యం కొండ జాతరకు ముందు నెలరోజులు పాటు ఒడిశాలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఒక్క రోజు మాత్రం పొల్లూరులో నిర్వహించే వేడుకకు లక్షలాది గిరిజనులు హాజరవుతారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా మన్యంకొండ గ్రామంలో ఉన్న గిరిజన వనదేవతలు కన్నమరాజు( శ్రీకృష్ణుడు) బాలరాజు(అర్జునుడు) పోతురాజు (బీముడు) ముత్యాలమ్మ తల్లి ఘటం ధ్వజం రూపంలో పూజలు చేశారు. వీటిని ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రాణప్రతిష్ట చేస్తారు. అయితే ఈ కార్యక్రమాన్ని పొల్లూరు జలపాతం వద్ద నిర్వహించడం ఒడిశా గిరిజనుల ఆచారం.
ఈ నెల 27న ప్రధానమైన మంగళస్నానం, ప్రాణ ప్రతిష్ట నిర్వహిస్తారు. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి రూపం లేకుండా ఉన్న ముత్యాలమ్మతల్లి ఘటం ధ్వజ రూపంలో ఉన్న సోదరులు (కన్నమరాజు,బాలరాజు,పోతురాజు)తో కలిసి మన్యం కొండ చేరుకుంటారు.సరసనపల్లి గ్రామం నుంచి గద్వాల కోసం కొత్త వెదుర్లును తీసుకుని పూజారులు వస్తారు. కొండ గృహాల్లో ఉన్న మూల రూపాలకు ప్రత్యేక పూజలు చేసి బోయ యాత్ర నిర్వహిస్తారు. భక్తులు చెప్పులు లేకుండా వన దేవతలతో యాత్రను ఒడిశాలోని సీలేరు నది అవతల (పొల్లూరు గ్రామానిక ఎదురు ఒడ్డు)కు 26న చేరుకుంటారు. ఈ నెల 27 ఉదయం పూజ కార్యక్రమాలు ముగించిన తరువాత కొత్తగా తయారు చేసిన ప్రత్యేక పడవలపై వనదేవతలను నది దాటించి ఆంధ్రాలోని పొల్లూరు జలపాతం వద్దకు చేరుకుంటారు. వనదేవతలకు మంగళస్నానం చేయించి ప్రాణప్రతిష్ట చేస్తారు. భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. భారీ అన్నసమారాధన జరుగుతుంది. వన దేవతలకు జలపాతం దగ్గరలో ఉన్న గృహలో ప్రత్యేక పూజలు చేస్తారు. పూజలకు సంతృప్తి చెందిన ముత్యాలమ్మ జలపాతంలో బంగారు చేపరూపంలో దర్శనమిస్తుందని నమ్మకం.
పక్కా ఏర్పాట్లు
ఒడిశా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈ జాతరకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా వన దేవతలను, భక్తులను ప్రత్యేక బోట్లు, గస్తీ నడుమ సీలేరు నది అవతల ఒడ్డుకు చేర్చేందుకు ఒడిశా ఎన్‌డీఆర్‌ఎఫ్ ఏర్పాట్లు చేపట్టింది. పొల్లూరు జలపాతం వద్ద రెవెన్యూ అగ్నిమాపక, పోలీస్, అటవీ శాఖ, పంచాయతీ అధికారులు వేడుకలను పర్యవేక్షిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment