వైద్యాధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్‌కుమార్
చింతూరు: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. చింతూరు ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం వైద్యాధికారులతో సమీక్షించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పూర్తిస్థాయిలో సౌకర్యాలను 50 రోజుల్లో కల్పిస్తామన్నారు. అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులకు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. గైనిక్ సేవలకు అవసరమైన పరికరాలు సమకూరుస్తామన్నారు.
ఆర్ధోపెడిక్ సేవలకు సంబంధించి ఎక్స్‌రే ప్లాంట్‌కు మరమ్మతులు, ఫ్రాక్చర్ టేబుల్, సిఆర్ట్ సిస్టమ్ కోసం రూ.15 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈఎన్‌టీ వైద్యులకు అవసరమైన పోర్టబుల్ ఎండోస్కోపును వెంటనే కొనుగోలు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో పుల్లయ్యను ఆదేశించారు. అత్యాధునిక పడకలు, చిన్న పిల్లల మందులు కొనుగోలు, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవలని సూచించారు.
గ్రామ స్థాయిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. రోగులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రోగులను భద్రాచలం తరలించకుండా స్థానికంగా మెరుగైన వైద్యసేవలు అందించేలా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. అవసరమైన వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారని, సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గైనిక్ డాక్టర్ శశికళ, వైద్య నిపుణులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment