రాజవొమ్మంగి: పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణి కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ రావడంతో రాజవొమ్మంగికి చెందిన 108 సిబ్బంది కొండపై ఉన్న గ్రామానికి కాలినడక వెళ్లి ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొయ్యూరు మండలం పర్వతప్రాంతంలో గల కొనుకూరులో గ్రామంలో పాంగి కుమారి (36) అనే ఆదివాసీ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి సోమవారం ఫోన్ చేశారు.
ఆ గ్రామానికి బయలుదేరిన 108 వాహనం మార్గమధ్యంలో ఘాట్ రోడ్డు ఎక్కలేక నిలిచిపోయింది. దీంతో సిబ్బంది అక్కడ నుంచి నాలుగు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి, కుమారికి ఆమె ఇంటి వద్దనే ప్రసవం చేశారు. బిడ్డ మెడకు పేగు చుట్టుకోగా అతి ప్రయాసతో ప్రసవం జరిపి తల్లీబిడ్డలను కాపాడగలిగారు.
అనంతరం మెరుగైన చిక్సిత కోసం కొంతదూరం మోటారు సైకిల్‌పై, ఆ తరువాత 108 వాహనంలో మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు ఈఎంటీ అర్జునబాబు తెలిపారు. పైలెట్ మరణిరాజు, అంగన్‌వాడీ టీచర్లు బేబీరాణి, కాంతమ్మ, ఏఎన్‌ఎం కుమారి తమకు సహకరించారని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment