బాలిక ఆత్మహత్య
సీతమ్మధార: నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్ కాలనీ, విష్ణు విల్లా అపార్ట్‌మెంట్‌లో పాల్ కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన రామాటాకీస్ దరి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. అతని భార్య పద్మావతి రైల్వే ఉద్యోగి. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఇంటర్ చదువుతుండగా, రెండో కుమార్తె కె.సాస(15) పదో తరగతి మధ్యలో ఆపేసింది. సాస ఎవరితో పెద్దగా కలిసేది కాదు. తల్లిదండ్రులతో కూడా ముభావంగా ఉండేది. గత ఏడాది సెప్టెంబర్‌లో స్కూల్ నుంచి టీసీ తీసుకున్న తర్వాత ఇంట్లోనే ఉంటోంది. ఇదిలా ఉండగా మంగళవారం మధ్యాహ్నం తన చిన్ననాటి స్నేహితురాలికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. కానీ ఆమె తన ఇంటికి రావాలని ఆహ్వానించింది. తనకు కడుపునొప్పి వస్తోందని, నువ్వే రావాలని సాస ఆమెను కోరింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కుమార్తెకు తల్లి నిమ్మరసం ఇచ్చింది. ఆ తర్వాత తల్లి, నాన్నమ్మ ఇంట్లో ఉన్న సమయంలో బాలిక నాలుగో అంతస్తుకు చేరుకుంది. వాటర్ ట్యాంక్‌పై కళ్లద్దాలు, మొబైల్ ఫోన్ పెట్టి.. అక్కడి నుంచి కిందకు దూకేసింది. ఆమె స్నేహితురాలు ఇంటికి వచ్చి సాస కోసం అడగ్గా బయటకు వెళ్లిందని వారు చెప్పారు. అంతలోనే అందరూ బయటకు వెళ్లి చూడగా సాస నిర్జీవంగా కనిపించింది. వెంటనే బాలికను రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇన్‌చార్జి సీఐ దాలిబాబు పర్యవేక్షణలో ఎస్‌ఐ చిన్నంనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment