ట్రాలర్ ఢీకొని యువకుడి దుర్మరణం
అక్కిరెడ్డిపాలెం: ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడిని ట్రాలర్ రూపంలో మృత్యువు కబళించింది. షీలానగర్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమా దం జరిగింది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివీ.. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెంకయ్యపాలేనికి చెందిన మైలపల్లి మనోహర్ (24) మెరినో సంస్థలో సేల్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా మంగళవారం నగరం నుంచి గాజువాక వైపు బైక్‌పై వెళ్తున్నాడు. షీలానగర్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత వెనుకనే వేగంగా వస్తున్న ట్రాలర్ బైక్‌ను ఢీకొట్టింది. బైక్ అదుపు తప్పడంతో మనోహర్ తూలి లారీ చక్రాల కిందకు వెళ్లిపోయాడు. ఆ సమయంలో మనోహర్ హెల్మెట్ ధరించినా.. లారీ చక్రాల కింద నలిగి హెల్మెట్ ఊడిపోయింది. తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రుడిని షీలానగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే మనోహర్ మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ కోటేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మనోహర్‌కు తండ్రి మైలపల్లి దేముడు, తల్లి దేముడమ్మ, ఒక సోదరి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment