ఎటపాక: అంతిమ యాత్రలో పాల్గొన్న వారిపై తేనెటీగలు దాడి చేయడంతో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఎటపాక మండలం గౌరిదేవిపేటలో శుక్రవారం జరిగింది. గ్రామంలోని కొప్పుల పల్లమ్మ(86) అనే వృద్ధురాలు గుండెపోటుతో గురువారం రాత్రి మరణించింది. శుక్రవారం ఉదయం ఆమె అంతిమయాత్ర నిర్వహించారు. ఈక్రమంలో దింపుడుకల్లం ఆశతో మృతదేహాన్ని కిందకి దించిన సమయంలో బాణసంచా కాల్చుతుండగా సమీపంలో చెట్టుపై ఉన్న తేనెటీగలు అంతిమ యాత్రలో పాల్గొన్న వారిపై దాడిచేశాయి. దీంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి ప్రాణభయంతో తలోదిక్కుకు పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో గాయపడిన వారిలో 26 మందికి గౌరిదేవిపేట పీహెచ్‌సీలో డాక్టర్లు దేవినాగ్,శ్రీదేవి ప్రథమచికిత్స చేశారు. నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని 108 వాహనంలో భద్రాచలంలోని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన కారణంగా సుమారు రెండు గంటల పాటు మృతదేహం రహదారిపై ఉండిపోయింది. తేనెటీగల ప్రభావం తగ్గిన తరువాత మృతదేహాన్ని గోదావరి నది వద్దకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
40 మందికి గాయాలు
మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసి పరుగులు తీసిన బంధువులు
అంతిమ యాత్రలో తేనెటీగల దాడి


