పట్టణాల్లో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు నీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. బిందెడు నీటి కోసం కుళాయిలు, బావులు, బోర్ల వద్ద బారులు తీరుతున్నారు. అధికారుల నిర్లక్ష్య ధోరణి ప్రజలను కష్టాల్లోకి నెట్టేసింది. జిల్లాలో పాడేరు, అరకులోయ, రంపచోడవరం నియోజకవర్గ కేంద్రాల్లో గత్యంతరం లేక ప్రాణాలు నిలుపుకొనేందుకు కొంతమంది సుదూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటుంటే, మరికొంత మంది డబ్బులిచ్చి మరీ కొనుక్కుంటున్నారు. ఇంకొంతమంది పక్క ఇళ్లలో గల బోరుల నుంచి నీటి తెచ్చుకుంటూ దాహార్తి తీర్చుకుంటున్నారు.
అరకులోయటౌన్: పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన అరకులోయలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. వేసవి ప్రారంభంలోనే తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎటువంటి ఊట గెడ్డలు, ఇతర నీటి వనరులు లేకపోవడంతో పాటు పంచాయతీ కుళాయిల ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెదలబుడు పంచాయతీలో 16 వార్డులున్నాయి. ఈ పంచాయతీ పరిధిలో గల అరకులోయ టౌన్ షిప్‌లో తొమ్మిది వార్డులున్నాయి.
ఈ వార్డుల పరిధిలో ఎనిమిది కాలనీలు ఉన్నాయి. సుమారు 16 వేల మంది జనాభా నివసిస్తున్నారు. వీరందరికీ ఒకే ఒక్క రక్షిత తాగు నీటి పథకం నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ పథకం మరమ్మతులకు గురైన సమయంలో, పైపులు పగిలిపోయిన సమయంలో నీరందక పలు కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బోరు నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్‌కు నీటి సరఫరా చేసే మెయిన్ పైప్‌లైన్ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా మెయిన్ రోడ్డు వద్ద నెలరోజుల కిందట మరమ్మతుకు గురైంది. దీంతో అప్పటి నుంచి అరకులోయలో పలు కాలనీలకు నీటి సరఫరా నిలిచిపోయింది.
అరకులోయ పట్టణ వాసులతోపాటు బి. కాలనీ, ఆస్పత్రి కాలనీ, శరభగుడ కాలనీ, శరబగుడ, పాత పోస్టాఫీసు కాలనీ, కంఠబౌంషుగుడ, జెడ్పీకాలనీ, ఎలక్ట్రికల్ కాలనీ, సి కాలనీ వాసులకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా జరగడం లేదు. సి కాలనీ వాసులకు గత కొన్నేళ్లుగా అసలు నీటి సరఫరాయే జరగడం లేదు. దూరంగా ఉన్న బోరుల నుంచి వీరు నీటిని తెచ్చుకోవలసి వస్తోంది. కొండవీధిలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నప్పటికీ పంచాయతీ అధికారులు నిర్వహణ బాధ్యతలు చేపట్టకపోవడంతో ఆ వీధి వాసులే పథకాన్ని నిర్వహిస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ అధికారులు స్పందించి తమ కాలనీల్లో ప్రతి రోజు నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రంపచోడవరం: నియోజకవర్గ కేంద్రమైన రంప చోడవరంలో దాహం కేకలు మిన్నంటుతున్నా యి. మేజర్ పంచాయతీ అయిన రంపచోడవరంలో 16వార్డుల్లో 15వేల మంది జనాభా ఉన్నారు. ప్రతి రోజు నిబంధనల ప్రకారం నాలుగు లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే రోజుకు 2.30 లక్షల లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. స్థానికంగా ఉన్న రక్షిత తాగునీటి పథకం మరమ్మతులు గురవడంతో శివారు ప్రాంతానికి నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. దీంతో శివారు ప్రాంతాల ప్రజల పరిస్థితి దుర్భంగా ఉంది. సీతపల్లి వాగు నుంచి నీటిని తోడి పంపు హౌస్ వద్ద సంపు నుంచి సినిమా హాల్ వెనుక వైపు ఉన్న ట్యాంక్‌కు పంపిస్తున్నారు.
సత్యసాయి వాటర్ స్కిమ్ నుంచి కూడా నీటి తీసుకుని ట్యాంకులకు పంపించి సరఫరా చేస్తున్నారు. నీటిని శుద్ధి ప్రక్రియ కూడా సక్రమంగా జరగడం లేదు.మూడు, నాలుగు వార్డుల్లోని ఎర్రంరెడ్డి నగర్‌లో ఒక్క వీధి కుళాయి కూడా పనిచేయడం లేదు. దీంతో ఇంటి కుళా యిలు లేని వారు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్న ఒక్క బోరు పైనే ఆధారపడాల్సి వస్తోంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో బోరు మరమ్మతులు గురైంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని స్థానికులు వాపోయారు.
దాహాకారాలు
దాహాకారాలు
దాహాకారాలు
దాహాకారాలు


