సాక్షి,పాడేరు: ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. విశ్వావసు నామసంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ అర్చకులు పూజలు చేశారు.జిల్లా కేంద్రం పాడేరులోని మోదకొండమ్మతల్లి ఆలయానికి ఉదయం 6గంటల నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకుడు సుబ్రహ్మణ్యం పూజలు జరిపారు. సాయంత్రం వరకు భక్తుల తాకిడి నెలకొంది.ఆలయ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు,ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడుల నేతృత్వంలో భక్తుల సహకారంతో ఉదయం ఉచిత ప్రసాదాలు,మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహించారు.
● పాడేరులోని గిరికై లాస్‌లో గల పురాతన ఉమానీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడు రామం,ఆలయ ధర్శకర్త కొట్టగుల్లి సింహాచలంనాయుడుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. సాయిబాబా, కనకదుర్గమ్మ, అయ్యప్ప, ఆంజనేయస్వామి ఆలయాల్లోను ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రంపచోడవరం: మండలంలోని ఐ పోలవరం గోవిందగిరిపై గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు, పంచాంగ పఠనం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోవిందగిరి మాడవీధుల్లో తిరుచ్చి వాహనంపై స్వామి వారి తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ, డీఎస్పీ సాయి ప్రశాంత్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు.భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఆలయ అధికారి నారాయణరాజు, వేదపండితులు సాయిరామ్ శర్మ, అర్చక స్వాములు, మణికంఠ స్వామి, శ్రీవారి సేవకుల సమన్వకర్త నల్లమిల్లి వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఉగాది వేడుకలు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
పోటెత్తిన భక్తులు


