సీతమ్మధార : నకిలీ బంగారం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ద్వారకా ఏసీపీ అన్నపు నరసింహమూర్తి తెలిపారు. ఆదివారం ద్వారకా పోలీస్ స్టేషన్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈశ్వరరావు, రాఘవేంద్ర సుబ్బారావు గాజువాకకు చెందిన జగదీశ్వరావుతో పరిచయం పెంచుకున్నారు. వారు తమ చెల్లి పేరు మీద 2.9 కిలోల బంగారం బ్యాంకులో ఉందని, దానిని విడిపించాలని జగదీశ్వరావును కోరారు. ఇది నిజమేనని నమ్మిన జగదీశ్వరావు వారికి రూ.68 లక్షలు ఇచ్చి బంగారాన్ని విడిపించాడు. తీరా పరిశీలించగా అందులో కేవలం 200 గ్రాముల అసలైన బంగారం మాత్రమే ఉండటంతో మోసపోయానని గ్రహించిన జగదీశ్వరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ మోసంలో ఎనిమిది మందికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని ఏసీపీ తెలిపారు. వీరిలో ఈశ్వరరావు, రాఘవేంద్ర సుబ్బారావులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1700 గ్రాముల నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ బంగారాన్ని తనఖా పెట్టిన బ్యాంకు ఉద్యోగుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. ఎస్‌ఐలు ధర్మేంద్ర, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


