అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్ష
ఏర్పాట్లపై చర్చిస్తున్న ఈవో సుబ్బారావు, సీఎఫ్‌వో భ్రమరాంబ
సింహాచలం: ఈ నెల 30న జరిగే సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని దేవదాయశాఖ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ డి.భ్రమరాంబ దేవస్థానం అధికారులను ఆదేశించారు. చందనోత్సవం ఏర్పాట్లపై సోమవారం ఆమె దేవస్థానం ఈవో కె.సుబ్బారావు, ఇంజినీరింగ్ అధికారులు, విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. వీలైనంత వరకు ఎక్కువ మందికి దర్శనం కల్పించే లక్ష్యంతో అధికారులంతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా పరిశుభ్రత, క్యూలైన్ మెయింటెనెన్స్, క్యూల్లో భక్తులకు మజ్జిగ, మంచినీరు పంపిణీ, షెల్టర్లు ఏర్పాటు, కొండపైన, కొండదిగువ తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లపై చర్చించారు. ఉత్సవ నిర్వహణ అంతా సీసీ కెమెరాల నీడలో జరగాలని, ప్రతీ క్యూలైను, ప్రతీ మార్గం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రతీ ప్రదేశం వద్ద శీతల పానీయాలు అందించాలని సూచించారు. చందనోత్సవానికి వచ్చే ప్రతీ భక్తుడికి త్వరితగతిన దర్శనం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో దేవస్థానం ఈఈలు శ్రీనివాసరాజు, రాంబాబు, ఏఈవోలు ఆనంద్‌కుమార్, శ్రీనివాసరావు, డీఈ హరి, సూపరింటెండెంట్‌లు నరసింగరావు, వెంకటరమణ, గాయత్రి, రాజ్యలక్ష్మి, ప్రసన్నలక్ష్మి, సత్యవాణి, శ్రీనివాస్, ఏఈలు తాతాజీ, బంగార్రాజు, రవిరాజు, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.


