క్షతగాత్రులకు అంబులెన్స్ ఏర్పాటు చేసిన ఎంపీపీ నీలవేణి
అరకులోయటౌన్(అనంతగిరి): మండలంలోని డముకు–తైడా ఘాట్‌రోడ్డులో ఆటో అదుపుతప్పి కొండను ఢీకొన్న ఘటనలో గాయపడిన క్షతగాత్రులను అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆస్పత్రికి తరలించారు. అరకులోయ మండలం, పద్మాపురం గ్రామ పంచాయతీ దుమ్మగుడ గ్రామానికి చెందిన సోమెల రొయిల అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆమెను ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా తైడా సమీపంలో ఆటో అదుపుతప్పి కొండను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రొయిల భర్త సోమెల రంగారావు తలకు తీవ్ర గాయంతో పాటు కుడిచేయి విరిగింది. దోన అనే మరో మహిళ తీవ్ర గాయాల పాలైంది. అదే సమయంలో ఆ రహదారి మీదుగా వెళ్తున్న ఎంపీపీ శెట్టి నీలవేణి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కొర్రా సూర్కనారాయణ ప్రమాదాన్ని తెలుసుకున్నారు.
హుటాహుటిన క్షతగాత్రులకు సపర్యాలు చేసి, 108 అందుబాటులో లేకపోవడంతో అనంతగిరి పీహెచ్‌సీ వైద్యాధికారి జ్ఞానేశ్వరితో ఫోన్‌లో మాట్లాడి పీహెచ్‌సీ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి, క్షతగాత్రులను ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. విషయం తెలుసుకున్న అనంతగిరి ఎస్‌ఐ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకోని క్షతగాత్రులకు ఆస్పత్రికి పంపేందుకు సహకరించారు.


