కారు ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
అనంతగిరి (అరకులోయ టౌన్): విశాఖ–అరకు ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైన ఇద్దరు యువకులను అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి, జెడ్పీటీసీ దీసరి గంగరాజు చొరవతో ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు. వాలసీ పంచాయతీ కరకవలస గ్రామానికి చెందిన చప్పి శీలయ్య, జంగిడే బాలరాజు ఎస్.కోట నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గురువారం మధ్యాహ్నం ఘాట్ రోడ్డులోని 1వ నెంబర్ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొని వెళ్లిపోయింది. తీవ్ర గాయాలపాలైన వారి గురించి అటువైపు వెళ్తున్న ఎంపీపీతోపాటు ఇతరులు 108కి సమాచారం అందించడంతో క్షతగాత్రులను ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు. స్థానికులు అనంతగిరి పోలీసులకు కూడా సమాచారం అందించారు. వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాహన చోదకులు తగు జాగ్రత్తలు పాటించి ఘాట్ రోడ్డులో ప్రయాణించాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఎంపీపీ సూచించారు. ఘాట్ రోడ్డులో రక్షణ గోడలు లేకపోవడం, ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి వాహన ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని ఎంపీపీ కోరారు.
ఎంపీపీ నీలవేణి, జెడ్పీటీసీ గంగరాజు చొరవతో
ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు


