చెట్టుపై నుంచి జారిపడిగీతకార్మికుడి మృతి
రాజవొమ్మంగి: మండలంలోని బోనంగిపాలెంలో గీత కార్మి కుడు, గిరిజనుడు అయిన చోడి రాజు బాబు (54) జీలుగు చెట్టుపై నుంచి జారిపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్పంచ్ చంద్రుడు తెలిపిన వివరాల ప్రకారం.. గీతకార్మికుడు రాజుబాబు రోజు మాదిరిగానే కల్లు సేకరించేందుకు చెట్టెక్కాడు. పట్టు తప్పి పడిపోవడంతో గాయాలపాలైన ఆయనను వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. కల్లు విక్రయిస్తు కుటుంబాన్ని పోషిస్తున్న రాజుబాబు మృతిచెందడంతో ఆ కుటుంబం దిక్కులేకుండా పోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.


