ప్రేమోన్మాది నవీన్‌కు 14 రోజుల రిమాండ్
మధురవాడ: ప్రేమోన్మాది దమరసింగి నవీన్‌కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినట్టు పీఎంపాలెం ఎస్‌ఐ కె.భాస్కరరావు తెలిపారు. పెళ్లికి అంగీకరించడం లేదనే కోపంతో నవీన్ బుధవారం విచక్షణా రహితంగా తల్లీ కూతుళ్లపై దాడి చేసిన సంగతి తెలిసిందే. కొమ్మాదిలోని స్వయంకృషి నగర్‌లో జరిగిన ఈ ఘటన విశాఖనే కాదు యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో తల్లి నక్కా లక్ష్మి(47) మృతి చెందగా, కుమార్తె దీపిక ప్రస్తుతం మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం నిందితుడు పరారయ్యేందుకు ప్రయత్నం చేయగా.. పోలీసులు శ్రీకాకుళం జిల్లాలో అతన్ని పట్టుకుని బుధవారం సాయంత్రం పీఎంపాలెం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. గురువారం సాయంత్రం నిందితుడిని భీమిలిలో న్యాయమూర్తి ముందు హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్టు పోలీసులు తెలిపారు. నవీన్ డిగ్రీ పూర్తి చేసినా సక్రమంగా స్థిరపడకపోవడంతో ఎనిమిదేళ్లుగా దీపిక తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకుండా తరచూ వాయిదాలు వేస్తున్నారు. బుధవారం కూడా అదే జరిగింది. దీంతో నిందితుడు వారిపై దాడికి దిగాడు.


