నిర్వాసితులు అధైర్యపడవద్దు
చింతూరు ఐటీడీఏ పీవోఅపూర్వ భరత్
కూనవరం: పోలవరం నిర్వాసితులెవరూ అధైర్య పడవద్దని, అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ తెలిపారు. మండల పరిధిలో పోలవరం ముంపునకు గురవుతున్న టేకులబోరు, శబరికొత్తగూడెం, టేకుబాక, పెదార్కూరు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఆర్‌అండ్‌ఆర్ గ్రామసభలను ఆయన పరిశీలించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సంబంధించిన అర్హులు, అనర్హుల వివరాలను గ్రామసభలో చదివి వినిపించారు. నాలుగు గ్రామాల్లో మొత్తం పీడీఎఫ్‌లు 3,179కి గాను 2,953 మందిని అర్హులుగా గుర్తించినట్టు పీవో తెలిపారు. అనర్హుల జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆధారాలను తహసీల్దార్ లేదా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు గాని, తనకు గాని సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డీసీ నసరయ్య, తహసీల్దార్ కె.శ్రీనివాసరావు, సర్పంచ్ హేమంత్, కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
వీఆర్‌పురం: పోలవరం ముంపునకు గురవుతున్న కొప్పిలి, ధర్మతాల్లగూడెం, కన్నయ్యగూడెం, శబరిరాయిగూడెం, రాజుపేట కాలనీల్లో గ్రామ సభల్లో ఆర్‌అండ్‌ఆర్ అర్హులు, అనర్హుల జాబితాను శుక్రవారం ప్రకటించారు ఈ సభలో చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్, ఎస్‌డీసీలు పాల్గొని నిర్వాసితుల సందేహాలను నివృత్తి చేశారు.


