హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురం గ్రామ శివారు బోరింగ్ తండా సమీపంలో దారుణహత్యకు గురైన దంతాలపల్లి ఎంజేపీ గురుకులం హెల్త్ సూపర్ వైజర్ తాటి పార్థసారథి హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. మహబూబాబాద్ సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతిరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. పార్థసారథి హత్య జరిగిన రోజున మృతుడి సోదరి హేమవరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామన్నారు. ఈ క్రమంలో మృతుడు పార్థసారథి భార్య స్వప్న, ఆమె ప్రియుడు వెంకట విద్యాసాగర్‌ను గురువారం అరెస్టు చేసినట్టు తెలిపారు. కేసు విచారణలో భాగంగా ముగ్గురు నిందితులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరం ఒప్పుకున్నారని చెప్పారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని గంగహుస్సేన్ బస్తీకి చెందిన తెలగరి వినయ్ కుమార్, బోగ శివకుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక గ్రామానికి చెందిన మోతుకూరి వంశీ ఉన్నట్టు గుర్తించామన్నారు. వారిని అరెస్టు చేసి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలిస్తామని పేర్కొన్నారు. గతంలో పార్థసారథిని హత్య చేయాలని జరిగిన రెక్కీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందిన కూసం లవరాజు పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో రూరల్, సీసీఎస్ సీఐలు సర్వయ్య, హత్తిరాం, రూరల్, కేసముద్రం ఎస్‌ఐలు దీపిక, మురళీధర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో ఎటపాకకు
చెందిన వంశీ తదితరులు
పరారీలో రాజవొమ్మంగికి చెందిన లవరాజు
వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు


